ఆర్‌ఈసీఎస్‌ ఎండీపై క్రిమినల్‌ కేసు పెట్టండి | Electricity Regulatory Board mandate to EPDCL | Sakshi
Sakshi News home page

ఆర్‌ఈసీఎస్‌ ఎండీపై క్రిమినల్‌ కేసు పెట్టండి

Published Fri, Jul 15 2022 4:42 AM | Last Updated on Fri, Jul 15 2022 3:24 PM

Electricity Regulatory Board mandate to EPDCL - Sakshi

అనకాపల్లి రూరల్‌ ఎలక్ట్రిక్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ

సాక్షి, అమరావతి: రూరల్‌ ఎలక్ట్రిక్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ (ఆర్‌ఈసీఎస్‌)ల్లో అధికార దుర్వినియోగం, అనధికారికంగా బిల్లుల వసూలు తదితర ఆరోపణలపై విచారణకు హాజరు కాని అనకాపల్లి ఆర్‌ఈసీఎస్‌ ఎండీపై చట్టపరంగా క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌)ను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆదేశించింది. ఈమేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌ఈసీఎస్‌లలో అధికార దుర్వినియోగం జరుగుతోందని, అనధికారికంగా అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఏపీఈఆర్‌సీ తీవ్రంగా పరిగణించింది.

అనకాపల్లి ఆర్‌ఈసీఎస్‌లో నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్న వైనాన్ని సూమోటోగా స్వీకరించిన ఏపీఈఆర్‌సీ.. ఈ నెల 13న విచారణకు రావాలని ఎండీ రామకృష్ణంరాజుకు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన బుధవారం విచారణకు హాజరు కాలేదు. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నానని, డాక్టర్లు పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని, విచారణకు హాజరు కాలేనని తెలుపుతూ డాక్టర్‌ సర్టిఫికెట్‌తో పాటు లేఖను మెయిల్‌ ద్వారా కమిషన్‌కు పంపారు.

విచారణకు హాజరుకాకుండా ఉండేందుకే వెన్నునొప్పిని సాకుగా చూపించారని ఏపీఈఆర్‌సీ భావించింది. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎండీపై చట్టపరంగా క్రిమినల్‌ కేసు పెట్టాలని బుధవారం విచారణకు హాజరైన ఈపీడీసీఎల్‌ విశాఖపట్నం ఆపరేషన్‌ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ సురేష్‌కుమార్‌ను ఆదేశించింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆర్‌ఈసీఎస్‌లో కూడా అవకతవకలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. అనకాపల్లి, చీపురుపల్లి ఆర్‌ఈసీఎస్‌లపై పూర్తి స్థాయి నివేదికలతో ఈ నెల 20న మరోసారి హైదరాబాద్‌లోని ఏపీఈఆర్‌సీ కార్యాలయంలో విచారణకు రావాలని ఎస్‌ఈని ఆదేశించింది. అదే రోజు ఎండీ కూడా వ్యక్తిగతంగా రావాల్సిందేనని స్పష్టం చేసింది.

మేం ఆదేశించినా ఆర్‌ఈసీఎస్‌ వసూళ్లు ఆపలేదు
నియంత్రణ మండలి ఆదేశాల మేరకు అనకాపల్లి, చీపురుపల్లి ఆర్‌ఈసీఎస్‌లపై తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఎస్‌ఈ సురేష్‌కుమార్‌ వెంటనే అఫిడవిట్‌ దాఖలు చేశారు. అనకాపల్లి ఆర్‌ఈసీఎస్‌కు లైసెన్స్‌ మినహాయింపు గడువు ముగియగా, గతేడాది మార్చి 25న దానిని స్వాధీనం చేసుకోవాలని ఈపీడీసీఎల్‌కు ఏపీఈఆర్‌సీ ఆదేశాలు జారీ చేసిందని ఎస్‌ఈ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌ 1 నుంచి ఈ ఏడాది మే 31 వరకు ఈపీడీసీఎల్‌ ఆధ్వర్యంలోనే బిల్లింగ్‌ జరుగుతుతోందని తెలిపారు. కానీ జూన్‌ మొదటి వారంలో ఆర్‌ఈసీఎస్‌ మే నెల బిల్లులు జారీ చేసి దాదాపు రూ.9 కోట్లు వసూలు చేసిందన్నారు.

బిల్లులు వసూలు చేయవద్దని తాము జూన్‌ 1న, 3న నోటీసులు జారీ చేశామని వివరించారు. అయినప్పటికీ ఆర్‌ఈసీఎస్‌ వసూళ్లు ఆపలేదన్నారు. వినియోగదారుల నుంచి సేకరించిన మొత్తాలను వెంటనే ఈపీడీసీఎల్‌కు పంపాలని కోరుతూ జూన్‌19న, 22న, 23న లేఖలు పంపినప్పటికీ స్పందన లేదన్నారు. వినియోగదారుల నుంచి వసూలు చేసిన రూ.9 కోట్లను వెంటనే రికవరీ చేస్తామని, అనకాపల్లి ఆర్‌ఈసీఎస్‌ ఎండీపై చట్టపరంగా కేసు నమోదు చేస్తామని ఎస్‌ఈ అఫిడవిట్‌లో తెలిపినట్లు విద్యుత్‌ నియంత్రణ మండలి వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement