recs
-
ఆర్ఈసీఎస్ ఎండీపై క్రిమినల్ కేసు పెట్టండి
సాక్షి, అమరావతి: రూరల్ ఎలక్ట్రిక్ కో–ఆపరేటివ్ సొసైటీ (ఆర్ఈసీఎస్)ల్లో అధికార దుర్వినియోగం, అనధికారికంగా బిల్లుల వసూలు తదితర ఆరోపణలపై విచారణకు హాజరు కాని అనకాపల్లి ఆర్ఈసీఎస్ ఎండీపై చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆదేశించింది. ఈమేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌ఈసీఎస్‌లలో అధికార దుర్వినియోగం జరుగుతోందని, అనధికారికంగా అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఏపీఈఆర్సీ తీవ్రంగా పరిగణించింది. అనకాపల్లి ఆర్ఈసీఎస్లో నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్న వైనాన్ని సూమోటోగా స్వీకరించిన ఏపీఈఆర్సీ.. ఈ నెల 13న విచారణకు రావాలని ఎండీ రామకృష్ణంరాజుకు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన బుధవారం విచారణకు హాజరు కాలేదు. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నానని, డాక్టర్లు పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని, విచారణకు హాజరు కాలేనని తెలుపుతూ డాక్టర్ సర్టిఫికెట్తో పాటు లేఖను మెయిల్ ద్వారా కమిషన్‌కు పంపారు. విచారణకు హాజరుకాకుండా ఉండేందుకే వెన్నునొప్పిని సాకుగా చూపించారని ఏపీఈఆర్సీ భావించింది. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎండీపై చట్టపరంగా క్రిమినల్ కేసు పెట్టాలని బుధవారం విచారణకు హాజరైన ఈపీడీసీఎల్ విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సురేష్‌కుమార్‌ను ఆదేశించింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆర్ఈసీఎస్లో కూడా అవకతవకలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. అనకాపల్లి, చీపురుపల్లి ఆర్‌ఈసీఎస్‌లపై పూర్తి స్థాయి నివేదికలతో ఈ నెల 20న మరోసారి హైదరాబాద్‌లోని ఏపీఈఆర్సీ కార్యాలయంలో విచారణకు రావాలని ఎస్ఈని ఆదేశించింది. అదే రోజు ఎండీ కూడా వ్యక్తిగతంగా రావాల్సిందేనని స్పష్టం చేసింది. మేం ఆదేశించినా ఆర్ఈసీఎస్ వసూళ్లు ఆపలేదు నియంత్రణ మండలి ఆదేశాల మేరకు అనకాపల్లి, చీపురుపల్లి ఆర్‌ఈసీఎస్‌లపై తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఎస్ఈ సురేష్‌కుమార్ వెంటనే అఫిడవిట్ దాఖలు చేశారు. అనకాపల్లి ఆర్ఈసీఎస్కు లైసెన్స్ మినహాయింపు గడువు ముగియగా, గతేడాది మార్చి 25న దానిని స్వాధీనం చేసుకోవాలని ఈపీడీసీఎల్‌కు ఏపీఈఆర్సీ ఆదేశాలు జారీ చేసిందని ఎస్ఈ అఫిడవిట్లో పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి ఈ ఏడాది మే 31 వరకు ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలోనే బిల్లింగ్ జరుగుతుతోందని తెలిపారు. కానీ జూన్ మొదటి వారంలో ఆర్ఈసీఎస్ మే నెల బిల్లులు జారీ చేసి దాదాపు రూ.9 కోట్లు వసూలు చేసిందన్నారు. బిల్లులు వసూలు చేయవద్దని తాము జూన్ 1న, 3న నోటీసులు జారీ చేశామని వివరించారు. అయినప్పటికీ ఆర్ఈసీఎస్ వసూళ్లు ఆపలేదన్నారు. వినియోగదారుల నుంచి సేకరించిన మొత్తాలను వెంటనే ఈపీడీసీఎల్‌కు పంపాలని కోరుతూ జూన్19న, 22న, 23న లేఖలు పంపినప్పటికీ స్పందన లేదన్నారు. వినియోగదారుల నుంచి వసూలు చేసిన రూ.9 కోట్లను వెంటనే రికవరీ చేస్తామని, అనకాపల్లి ఆర్ఈసీఎస్ ఎండీపై చట్టపరంగా కేసు నమోదు చేస్తామని ఎస్ఈ అఫిడవిట్లో తెలిపినట్లు విద్యుత్ నియంత్రణ మండలి వెల్లడించింది. -
అంధకారంలో ఆర్ఈసీఎస్!
సాక్షి, చీపురుపల్లి (విజయనగరం): ‘మేడిపండు చూడు మేలిమై ఉండు.. పొట్ట విప్పిచూడు పురుగులుండు’ అనే చందంగా తయారైంది. ఆర్ఈసీఎస్ (గ్రామీణ విద్యుత్ సహకార సంఘం) పరిస్థితి. ఆర్ఈసీఎస్ పేరు వినగానే అవినీతికి అడ్రస్‌గా మారిందన్న ఆరోపణ తారాస్థాయికి చేరింది. నిత్యం విద్యుత్ వెలుగులు నింపాల్సిన ఆర్ఈసీఎస్లో అవినీతి మితిమీరడంతో అంధకారం ఆవరించింది. ఆర్ఈసీఎస్లో శాశ్వత ఉద్యోగులు సగానికిపైగా లేరు. క్షేత్రస్థాయి సిబ్బంది అసలే లేని దుస్థితి, ఉన్న వారిలో నిర్లక్ష్యం, అవినీతి పెచ్చుమీరిపోవడం, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కావడంతో ఇక్కడ ఏం జరుగుతున్నా పట్టించుకునేందుకు కనీసం విజిలెన్స్ లేదా జిల్లా అధికారులు పర్యవేక్షణ కూడా లేకపోవడం వెరసి ఆర్ఈసీఎస్ ప్రతిష్ట దిగజారిపోయింది. ప్రస్తుతం సంస్థలో ఉన్న ఆదాయం, ఏడాదికి అయ్యే ఖర్చు దాదాపు రెండూ సమానంగా ఉన్న పరిస్థితుల్లో ఆర్ఈసీఎస్ మనుగడ సాధించడం కష్టమేనన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. నిబంధనల ఉల్లంఘన సహకార చట్టంలో సెక్షన్ 116(సి) ప్రకారం సంస్థ గ్రాస్ ప్రాఫిట్లో 30 శాతానికి మించి ఖర్చు చేయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ ఏటా ప్రభుత్వ అనుమతి తీసుకుని సహకారశాఖ నిబంధనలు సడలించి, 30 శాతానికి మించి సిబ్బందికి వేతనాలు ఇస్తూ, విద్యుత్ కొనుగోలు చేస్తూ కాలం వెల్లదీస్తున్న పరిస్థితి నెలకొంది. సంస్థలో సరిపడా సిబ్బంది లేరు, నియామకాలకు సహకారశాఖ చట్టం 116(సి) ఒప్పుకోదు. దీంతో సిబ్బంది లేక, పనులు జరగక, నిర్లక్ష్యం పేరుకుపోయి చివరకు మనుషుల ప్రాణాలు పోతున్న సంఘటనలకు దారి తీస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వినియోగదారులతో పాటు రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో 1979లో ఏర్పడిన గ్రామీణ విద్యుత్ సహకార సంఘం(ఆర్ఈసీఎస్) ప్రస్తుతం అంపశయ్యపై ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్‌ఈసీఎస్‌ను ఏపీఈపీడీసీఎల్‌లో విలీనం చేయడమే మంచిదన్న చర్చ సర్వత్రా సాగుతోంది. తగ్గిపోతున్న శాశ్వత ఉద్యోగులు చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాలతో పాటు గుర్ల మండలంలో కొంత భాగంలో దాదాపు 100 గ్రామాలకు ఆర్ఈసీఎస్ సేవలు అందిస్తోంది. అలాంటి సంస్థలో 116 మంది శాశ్వత ఉద్యోగులు ఉండేవారు. అయితే వారిలో పదవీ విరమణలు పొందుతూ ప్రస్తుతానికి 30 మంది మాత్రమే మిగిలారు. వీరిలో కూడా 2019 చివరి నెలకు వచ్చే సరికి మరో ఏడుగురు వరకు పదవీ విరమణ పొందనున్నారు. దీంతో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 20 మందికి పడిపోనుంది. ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల సంగతి పక్కన పెడితే నిత్యం చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన క్షేత్ర స్థాయి సాంకేతిక ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆర్ఈసీఎస్లో ముగ్గురు ఏఈలకు గాను ఒక్కరు మాత్రమే ఉండగా, ఇద్దరు ఏడీలకుగాను ఒక్కరే ఉన్నారు. అలాగే ఆరుగురు లైన్ఇన్స్పెక్టర్లకు గాను ఇద్దరు ఉండగా అందులో ఒకరు జూన్‌లో పదవీ విరమణ పొందనున్నారు. అలాగే 10 మంది లైన్మెన్ ఉండాల్సి ఉండగా ముగ్గురు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఇక అసిస్టెంట్ లైన్మెన్ లేనేలేరు. దీంతో మొత్తం 38 మంది కాంట్రాక్ట్ జూనియర్ లైన్‌మన్(సీజెఎల్ఎమ్)లుపైనే వ్యవస్థ అంతా నడుస్తోంది. ఆదాయం రూ.5 కోట్లు.. ఖర్చు రూ.4 కోట్లు! ఆర్ఈసీఎస్కు ఏడాదికి వస్తున్న గ్రాస్ ప్రాఫిట్‌కు ఆ సంస్థలో ఖర్చుకు దాదాపు సరిపోతోంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.6 కోట్లు, 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్లు గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. అయితే ఈ రెండేళ్లలో సంస్థ ఖర్చు రూ.4 నుంచి రూ.5 కోట్లు వరకు అయింది. సహకారశాఖలో 116(సి) నిబంధన ప్రకారం గ్రాస్ ఫ్రాఫిట్‌లో 30 శాతానికి మించి ఖర్చు చేసేందుకు అనుమతి లేదు. ఈ లెక్క ప్రకారం ఏడాదికి రూ.2 కోట్లు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది. అదే పరిస్థితి వస్తే వెంటనే సంస్థను మూసివేయాల్సిన పరిస్థితి తప్పదు. ఇంతవరకు ప్రభుత్వ అనుమతి తీసుకుని 116(సి) నిబంధనలను సడలిస్తూ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్‌లో ప్రమాదాలకు బ్రేక్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ఆర్ఈసీఎస్ పరిధిలో సిబ్బంది నిర్లక్ష్యం, ముడులు పెట్టని విద్యుత్ వైర్లు కారణంగా చీపురుపల్లి మండలంలోని పుర్రేయవలస, రామలింగాపురం, యలకలపేట గ్రామాల్లో గత మూడేళ్లలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మూగజీవాల మరణాలు లెక్కేలేదు. దీంతో వారి కుటుంబాలకు ఆర్ఈసీఎస్ నష్టపరిహారం చెల్లిస్తూ వస్తోంది. అదే ఏపీఈపీడీసీఎల్‌లో అయితే ప్రమాదాలకు అవకాశమే లేదు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో హై ఓల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(హెచ్‌వీడీఎస్) అమలు చేస్తున్నారు. ఈ విధానంలో మూడు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి కేబుల్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
ఆర్ఈసీఎస్ ఉద్యోగుల్లో కలవరం..!
సాక్షి, అనకాపల్లి: : టీడీపీని ఇంటికి సాగనంపడానికి స్పష్టమైన ప్రజాతీర్పు వెలువడనుందనే సంకేతాల నేపథ్యంలో.. పచ్చ నేతల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్ఈసీఎస్) ఉద్యోగులను సంఘ మాజీ పర్సన్ ఇన్చార్జి సతీమణి, టీడీపీ జడ్పీటీసీ ధనమ్మ బెదిరింపులకు గురిచేశారు. వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ..టీడీపీకి ఓటేయకుంటే ఉద్యోగాలు పీకేస్తామని హెచ్చరించారు. గురువారం ఎన్నికల ప్రచారం చేపట్టిన ధనమ్మ ఆర్ఈసీఎస్ సిబ్బంది అంతా అధికార టీడీపీకి ఓటు వేయాలని ఒత్తిడి చేశారు. ‘మీరంతా ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నట్టు తెలిసింది. రానున్నది టీడీపీ ప్రభుత్వమే. మా పార్టీకే ఓటు వేయాలి’ అంటూ బెదిరించే ధోరణిలో మాట్లాడినట్టు సమాచారం. ఈ పరిణామంతో ఉద్యోగులు కలవరం చెందుతున్నారు. ధనమ్మ బెదిరింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు..‘మమ్మల్ని వదిలేయండి. మాకు నచ్చినవారికి ఓటేస్తాం’ అని స్పష్టం చేశారు. జెడ్పీటీసీ తీరు బాగోలేదని సంఘ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు పరదేశినాయుడు పేర్కొన్నారు. ఇలా బెదిరించడం సమంజసం కాదని, ప్రజాస్వామ్యంలో నచ్చిన వారికి ఓటు వేసుకోవచ్చన్నారు. సంస్థ ఉద్యోగులకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. వినియోగదారులకు సేవలందించడమే తమ ధ్యేయమన్నారు. ఇదే విషయాన్ని జెడ్పీటీసీ ధనమ్మ వద్ద ప్రస్తావించగా సంఘ వినియోగదారునిగా తాను విద్యుత్ కనెక్షన్ కోసం అధికారులతో మాట్లాడటానికి మాత్రమే వెళ్లానని పేర్కొన్నారు. జడ్పీటీసీ తీరుపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. -
ఎవరికివారే.... రికవరీ ఎలా...!
చీపురుపల్లి: ఆర్ఈసీఎస్ నిర్లక్ష్యం పుణ్యమాని రూ.1.79 కోట్లు డబ్బు పక్కదోవ పట్టింది. దీనిపై వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఇదంతా జరిగి ఐదారు రోజులు గడుస్తోంది. కాని పక్కదోవ పట్టిన రూ.1.79 కోట్లు నిధులు రికవరీకు సంబంధించిన ఎలాంటి ముందడుగు చర్యలు ఇంతవరకు ప్రారంభమైనట్టు కనిపించడం లేదు. ఆంధ్రా బ్యాంకు వైపు నుంచి ప్రాథమిక నివేదిక ఉన్నత అధికారులకు సమర్పించామని చెబుతుంటే ఆర్ఈసీఎస్ వైపు నుంచేమో వోచర్లు మా దగ్గర ఉన్నాయి...డబ్బు మొత్తానికి బ్యాంకుదే బాధ్యత అంటూ స్పష్టం చేస్తున్నారు. ఇలా ఆంధ్రా బ్యాంకు, ఆర్ఈసీఎస్ ఎవరికి వారే మాటలే చెబుతున్నారు తప్ప డబ్బు రికవరికీ సంబంధించిన ఎలాంటి విచారణలు ఇంతవరకు ప్రారంభమైన దాఖలాలు కనిపించడం లేదు. ఇందులో తమదేమీ తప్పులేదన్నట్టు ఆర్ఈసీఎస్లో ఇప్పటికే ముగ్గురు అధికారులకు ఈ నెల 3న షోకాజ్ నోటీసులు ఇవ్వగా, తాజాగా మరో నలుగురు అధికారులకు మెమోలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 3న షోకాజ్ నోటీసులు ఇచ్చిన వారిని సస్పెండ్ చేసేందుకు కూడా ఎండీ సిద్ధమైనట్టు సమాచారం. ఈ చర్యలతో ఆర్ఈసీఎస్ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. అంతేకాకుండా శాఖల వారీగా వారిలో అంతర్యుద్ధం కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. తమకు సంబంధం లేకపోయినా చర్యలు ఎందుకు తీసుకుంటున్నారంటూ ఉద్యోగులు ఎదురు తిరుగుతున్నట్టు తెలిసింది. దీంతో రూ.1.79 కోట్లు పక్కదోవ పట్టడంలో నిర్లక్ష్యం వహించిన ప్రతీ ఉద్యోగిపైనా చర్యలు తీసుకుంటే మంచిదన్న అభిప్రాయానికి ఎండీ రమేష్ వచ్చినట్టు సమాచారం. ఉద్యోగులపై చర్యలు సరే...డబ్బు సంగతి ఏంటంటే మళ్లీ పాత పాటే పాడుతున్నారు. డిపాజిట్లు వెనక్కి తీసుకునే యోచనలో... ఇదిలా ఉండగా ఆంధ్రా బ్యాంకులో ఆర్ఈసీఎస్కు చెందిన రూ.8 కోట్లు వరకు డిపాజిట్లు ఉన్నాయి. తాజాగా రూ.1.79 కోట్లు ఆర్ఈసీఎస్ డబ్బు పక్కదోవ పట్టడంలో ఆంధ్రాబ్యాంకుదే ప్రధాన పాత్ర అంటూ ఐదారు రోజులుగా ఆర్ఈసీఎస్ ఎండీ, పాలకవర్గం స్పష్టం చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఆంధ్రా బ్యాంకు నుంచి స్పష్టమైన ప్రకటనలు లేవు. దీంతో ఆ బ్యాంకులో ఉన్న రూ.8 కోట్లు డిపాజిట్లు వెనక్కి తీసుకుని వేరే బ్యాంకులో డిపాజిట్ చేయాలని అధికారులు, పాలకవర్గం భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు డిపాజిట్లు వెనక్కి తీసుకునేందుకు లిఖిత పూర్వకంగా బ్యాంకును ఒకటి, రెండు రోజుల్లో కోరనున్నట్టు తెలుస్తోంది. రికవరీ చర్యలు శూన్యం... ఇదిలా ఉండగా రూ.1.79 కోట్లు ఆర్ఈసీఎస్ డబ్బు రికవరీలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. సరిగ్గా ఈ నెల 1న నిధులు గల్లంతు విషయం బయిటపడింది. అప్పటికే మూడు రోజులు ముందు నుంచి అధికారులు ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నప్పటికీ ఏప్రిల్ 1న నియోజకవర్గంలో బాహాటంగా చర్చకు వచ్చింది. దీంతో ఈ నెల 2న పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఇంతవరకు డబ్బు రికవరీకి సంబంధించి బ్యాంకులో ఎలాంటి విచారణ ప్రారంభమైనట్టు కనిపించడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రాబ్యాంకు, ఆర్ఈసీఎస్ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం తప్ప డబ్బు రికవరీ చర్యలు మాత్రం కనిపించడం లేదు. ఆర్ఈసీఎస్లో రూ.కోట్ల కుంభకోణం విషయంలో ఇటు ఆర్ఈసీఎస్ అధికారులు, అటు ఆంధ్రాబ్యాంకు అధికారులు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. తమ తప్పిదం లేదన్నట్టు వీరు వ్యవహరిస్తుండడంతో అసలు కుంభకోణం విషయం సంగతేంటన్నది వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. -
దొంగనోట్ల చెలామణి
మునగపాక, న్యూస్‌లైన్: ఇన్నాళ్లూ అసలు నోట్లను తలపించేలా దొంగనోట్లు ముద్రించి చెలామణీ చేసేవారు. అయితే ఇప్పుడు అంత శ్రమ లేకుండా అతి సులువుగా జెరాక్స్ తీసేసి కథ నడిపించేస్తున్నారు. విశాఖ మన్యంలోను, ఇంకా కొన్ని కుగ్రామాల్లో ఇలాంటి జెరాక్స్ నోట్లు చెలామనీ అయిపోతున్నాయి. అనకాపల్లి ఆర్ఈసీఎస్ పరిధిలోని గణపర్తిలో బిల్లు కలెక్టర్‌గా పని చేస్తున్న ద్వారం హరిబాబు ఎప్పటిలాగానే వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం జోగారావుపేటకు చెందిన వంద రూపాయల జెరాక్స్నోటును తీసుకొచ్చి బిల్లు చెల్లించాడు. ఈ సొమ్మును మునగపాక ఎస్బిఐలో చెల్లించేందుకు హరిబాబు వెళ్లి అక్కడ సొమ్ము జమ చేయగా అందులో ఒకటి జెరాక్స్ వంద నోటు ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో హరిబాబు అవాక్కయ్యారు. నకిలీ నోట్లు హల్చల్ చేస్తుండడంతో ఏది అసలో...ఏది నకిలీయో తెలియని పరిస్థితి నెలకొంది.