సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో భారీ ప్రక్షాళన మొదలైంది. క్షేత్రస్థాయి నుంచి అవినీతి నిర్మూలన దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. వివిధ సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు విద్యుత్తు శాఖ కార్యాలయాల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి గురువారం తెలిపారు. ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా వినియోగదారులు కమిషన్ దృష్టికి పలు అంశాలను తెచ్చారు. కొత్త కనెక్షన్లు, తప్పుగా ముద్రించిన విద్యుత్తు బిల్లులు, ట్రాన్స్‌ఫార్మర్లు మార్చుకునేందుకు వినియోగదారులు రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. లో వోల్టేజీ, వేలాడే విద్యుత్ తీగలతో సమస్యలు ఎదురవుతున్నట్లు ఏపీఈఆర్‌సీ దృష్టికి తెచ్చారు. దీనిపై కిందిస్థాయి సిబ్బంది వెంటనే స్పందించడం లేదనే ఫిర్యాదులందాయి. సిబ్బంది అవినీతి వ్యవహారాలపై కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రజల ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తూ కమిషన్ చర్యలు చేపట్టింది.
ఫిర్యాదు బాక్సులు ఇలా...
►ప్రతి అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), అడిషనల్ డివిజినల్ ఇంజనీర్ (ఏడీఈ), జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) కార్యాలయాల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేస్తారు.
►ఫిర్యాదు బాక్సుల తాళాలు పై అధికారుల వద్ద మాత్రమే ఉండాలని నిబంధన విధించారు.
►ప్రతి నెల మొదటి తారీఖున ఫిర్యాదు బాక్సులను తెరిచి వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.
►ఫిర్యాదు వివరాలు ఉన్నతాధికారులకూ వెళ్తాయి.
►ఫిర్యాదును గుర్తించిన 48 గంటల్లోగా పరిష్కారం చూపించాలి. అది కూడా సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొనాలి.
►ఫిర్యాదు చేసే వ్యక్తులు కరెంట్ బిల్లు, పూర్తి వివరాలను అందులో పొందుపర్చాలి.
►అవసరమైతే జిల్లా, రాష్ట్ర కార్యాలయాలకూ ఫిర్యాదులు పంపవచ్చు.
►ఫిర్యాదు బాక్సులపై అన్ని విద్యుత్ సంస్థల వెబ్‌పోర్టర్లలో ప్రజలకు అర్థమయ్యేలా వివరాలు వెల్లడించాలి.
►అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించకపోయినా, లంచాల కోసం వేధించినా ఫిర్యాదు చేయవచ్చు.
కఠిన చర్యలుంటాయి
ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై ప్రతి మూడు నెలలకోసారి ఉన్నతస్థాయి సమీక్ష జరుగుతుంది. ఫిర్యాదుల వివరాలు, అపరిష్కృతంగా ఉంటే కారణాలను వెల్లడించాలి. ఏపీఈఆర్‌సీ ఈ వ్యవస్థను స్వయంగా పర్యవేక్షిస్తుంది. మా ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించినా, విద్యుత్ వినియోగదారులను లంచాల కోసం వేధించినా కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యుత్ వ్యవస్థ తమదనే భావన ప్రజలకు కల్పించడం కోసమే సరికొత్త చర్యలు చేపట్టాం. – జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, ఏపీఈఆర్‌సీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment