
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం (2018–19)లో రూ.6,030 కోట్ల లోటు ఉంటుందని ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) అంచనా వేసింది. విద్యుత్తు సరఫరా చార్జీల టారిఫ్ ఉత్తర్వులను మంగళవారం హైదరాబాద్‌లో ఏపీఈఆర్సీ విడుదల చేసింది. వివరాలను ఏపీఈఆర్సీ సభ్యులు పి.రఘు, పి.రామ్మోహన్‌తో కలసి చైర్మన్ జస్టిస్ జి.భవానీప్రసాద్‌లు మీడియా సమావేశంలో వివరించారు. ‘‘వచ్చే ఆర్థిక సంవత్సరం(2018–19)లో రూ.7,983 కోట్ల లోటు ఉంటుందని డిస్కంలు గతేడాది డిసెంబర్ 1న నివేదికలు సమర్పించాయి. వీటిని విశ్లేషించాక వార్షిక లోటు రూ.6,030 కోట్లు ఉంటుందని (డిస్కంలు సమర్పించిన దానిలో రూ.1,953 కోట్లు తగ్గించి) ఏపీఈఆర్సీ అంచనా వేసింది. డిస్కంల లోటును వివరిస్తూ సబ్సిడీగా ఎంత భరిస్తుందో తెలపాలంటూ ప్రభుత్వానికి నివేదిక పంపించాం. మొత్తం రూ.6,030 కోట్ల లోటును సబ్సిడీ రూపంలో ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో 2017–18 ఆర్థిక సంవత్సరం అమల్లో ఉన్న విద్యుత్తు చార్జీలు, ఇతర రుసుములనే 2018–19లోనూ కొనసాగించాలని నిర్ణయించి ఉత్తర్వులిచ్చాం’ అని జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు.
టారిఫ్ ఉత్తర్వుల్లోని ముఖ్యమైన అంశాలు...
- ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులతో సమానంగా నర్సరీ రైతులకు కూడా వచ్చే సంవత్సరం నుంచి ఉచిత విద్యుత్ వర్తిస్తుంది. నర్సరీలవారు చెల్లించాల్సిన బకాయిల రద్దు. ఇందుకోసమయ్యే రూ.4 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది.
- వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్.
- 2017–18లో రూ.3,700 కోట్లుగా ఉన్న సబ్సిడీ వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.6,030.17 కోట్లకు పెరుగుతుంది.
- రాత్రి 10 నుంచి ఉదయం 6 దాకా హెచ్‌టీ పరిశ్రమలు వాడే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.1 చొప్పున రాయితీ.
- ఆక్వా మేత కలుపు కర్మాగారాలకు రాయితీ టారిఫ్ యూనిట్‌కు రూ.4.89 ఉంటుంది.
- ప్రింటింగ్ ప్రెస్‌లను 2011–12 నుంచి ఎల్‌టీ–2 వాణిజ్య కేటగిరీగా పేర్కొన్నప్పటికీ ఎల్‌టీ–3 పరిశ్రమల కేటగిరీ కింద బిల్లులు జారీ చేశారు. ఇప్పుడు పొరపాటు గుర్తించి ఎల్‌టీ వాణిజ్య కేటగిరీ కింద ఆరేళ్ల బకాయిలు చెల్లించాలంటూ నోటీసులిచ్చారు. ఇది సరికానందున పునఃపరిశీలించి సానుకూల చర్యలు తీసుకోవాలని ఏపీఈఆర్సీ డిస్కంలను ఆదేశించింది.
- స్మార్ట్ మీటర్లు సొంతంగా అమర్చుకునే గృహ వినియోగదారులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు వాడుకునే విద్యుత్‌కు యూనిట్‌కు రూపాయి తగ్గింపు.
- తక్షణావసరాలకు విద్యుత్ కొనాలంటే కారణాలతో వెంటనే మండలికి తెలపాలని ఆదేశాలు జారీ. స్వల్పకాలిక కొనుగోళ్లను కనీస స్థాయికి పరిమితం చేయాలని, దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోళ్లను క్రమపద్ధతిలో నియంత్రించాలని స్పష్టీకరణ.
హెచ్‌టీ లోడ్ ఫ్యాక్టర్ ఇన్సెంటివ్‌లపై త్వరలో నిర్ణయం..
గతంలో హెచ్‌టీ లోడ్ ఫ్యాక్టర్ ఇన్సెంటివ్‌లు ఉండేవి. 2010–11లో పవర్ కట్స్, ఇతర కారణాలవల్ల లోడ్ ఫ్యాక్టర్ ఇన్సెంటివ్‌లు రద్దు చేశారు. దీనిని మళ్లీ పునరుద్ధరిద్దామా? వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా అభిప్రాయాలతో నివేదిక సమర్పించాలని డిస్కంలను ఏపీఈఆర్సీ ఆదేశించింది.