
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) సమర్పించిన వార్షిక ఆదాయ అవసర నివేదికలపై మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి చెప్పారు. ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను అందుబాటు ధరల్లో అందించాలన్నదే ఏపీఈఆర్‌సీ లక్ష్యమని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వివరాలను ఇంధన పొదుపు అధికారి చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు. విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలకే ఏపీఈఆర్‌సీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని జస్టిస్ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. ప్రజలపై భారం లేని టారిఫ్ అవసరమని వెల్లడించారు. అలాగే డిస్కంల ఆర్థిక పరిపుష్టిని పరిగణనలోనికి తీసుకుంటామని వెల్లడించారు. విద్యుత్ రంగాన్ని మెరుగుపర్చి సుస్థిరత సాధించడానికి, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు.
కొనుగోలు వ్యయం తగ్గింపుపై దృష్టి
విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడంపై ఏపీఈఆర్‌సీ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిందని జస్టిస్ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. బొగ్గు, జల, పవన, సౌర విద్యుత్ వంటి వాటి విషయంలో హేతుబద్ధత, సాంకేతికత, మార్కెట్ ట్రెండ్‌ను పరిగణనలోనికి తీసుకుంటామని వివరించారు. దీనివల్ల విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. విద్యుత్ సంస్థలు నిర్వహణ వ్యయం తగ్గించడంపైనా దృష్టి పెట్టాలన్నారు. ఇందుకోసం వ్యయంపై విచక్షణతో కూడిన అదుపు ఉంచడంతోపాటు అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలని ఏపీఈఆర్‌సీ ఇప్పటికే డిస్కంలను కోరిందని గుర్తుచేశారు.
వినియోగదారులే కేంద్ర బిందువు
ప్రజలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతోపాటు సేవల్లో నాణ్యత, విశ్వసనీయత కూడా ముఖ్యమని జస్టిస్ నాగార్జునరెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ టారిఫ్‌లకు సంబంధించిన కసరత్తులో వినియోగదారులే కేంద్రబిందువుగా ఉంటారని వివరించారు. పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన విద్యుత్ నివేదికలపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 7వ తేదీన విశాఖపట్నం, 8న ఏలూరు, 9న విజయవాడ, 10న కడప, 11న తిరుపతిలో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా విద్యుత్ ఉన్నతాధికారులు ఏపీఈఆర్‌సీకి అందుబాటులో ఉండాలని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆదేశాలు జారీ చేశారు.