సాక్షి, అమరావతి: వినియోగదారులు, విద్యుత్ సంస్థల ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి, డిస్కంల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 2015–2019 మధ్య కాలానికి రూ.3,669 కోట్ల సర్దుబాటు చార్జీ (ట్రూ అప్)ల వసూలుకు అనుమతి ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి తెలిపారు. డిస్కంలు ఆర్థికంగా సంక్షోభంలో ఉండటం రాష్ట్రానికి, వినియోగదారులకు మంచిదికాదని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ను అందుబాటు ధరల్లోనే సరఫరా చేస్తే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని, ఫలితంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. భవిష్యత్తు లక్ష్యాలు, సవాళ్లను సమర్థంగా అధిగమించేందుకు విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్‌సీతో కలిసి పనిచేయాలని సూచించారు. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, విద్యుత్తు సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు.
వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన సర్దుబాటు చార్జీల్లో మూడోవంతును రాష్ట్ర ప్రభుత్వమే (రైతులు, ఎస్సీ, ఎస్టీలు, ఎంబీసీలు తదితరుల తరఫున) భరించాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 1.86 కోట్ల మంది వినియోగదారుల్లో దాదాపు 40 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ సబ్సిడీతో లబ్ధి పొందుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు వివిధ వర్గాల వినియోగదారులకు నేరుగా లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన 1,657 కోట్ల రూపాయలను సెక్షన్ 65 ప్రకారం అర్హులైన 23 లక్షల మంది లబ్ధిదారులకు రాయితీలివ్వడానికి 2021–22 టారిఫ్ ఆర్డర్‌లో తొలిసారిగా అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనివల్ల లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డిస్కంల నుంచి విద్యుత్ సబ్సిడీ పొందుతున్నారని తెలిపారు. విద్యుత్ రంగంలో సగటు వినియోగదారుడికి నాణ్యమైన, నమ్మకమైన, మెరుగైన కరెంటు సరఫరా 24 గంటలు అందించడంతోపాటు వారి శ్రేయస్సు, అభివృద్ధి తమకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని పేర్కొన్నారు. ఇందుకోసం డిస్కంలకు ఆర్థిక సామర్థ్యం , సుస్థిరత అత్యవసరమని తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతి ఇచ్చింనట్లు ఆయన తెలిపారు.
నేడు సలహా మండలి సమావేశం
డిస్కంలను బలోపేతం చేయడంతోపాటు వాటి పనితీరును మెరుగుపరిచి వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీఈఆర్‌సీ ఇందులో భాగంగా సోమవారం సలహా మండలి సమావేశం నిర్వహిస్తోంది. ఒక యూనిట్ విద్యుత్ సరఫరా చేసేందుకు అయ్యే సగటు ఖర్చు తగ్గించడం, విద్యుత్ కొనుగోళ్లను క్రమబద్ధీకరించడం, డిస్కంల పనితీరును మెరుగుపర్చడం, డిమాండ్ నిర్వహణ–ఇంధన సంరక్షణ–సామర్థ్యానికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సలహా మండలి సభ్యులు 16 మంది, ఈఆర్‌సీ సభ్యులు పి.రాజగోపాల్‌రెడ్డి, ఠాకూర్‌రామ్‌సింగ్, డిస్కంల సీఎండీలు, విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment