
మా కరెంటులో తెలంగాణకు వాటా
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) విషయంలో తెలంగాణకు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది! ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో తెలంగాణకు వాటా ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది! ఏపీఈఆర్‌సీకి తాజాగా సమర్పించిన వార్షిక ఆదాయ, అవసర నివేదిక (ఏఆర్‌ఆర్)లో డిస్కమ్‌లు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.
కృష్ణపట్నం తదితర కేంద్రాల్లో ఉత్పత్తయ్యే కరెంటును తెలంగాణకు ఇచ్చేది లేదని ఇప్పటిదాకా ఏపీ వాదిస్తుండటం, దీనిపై న్యాయ పోరాటానికి తెలంగాణ సిద్ధమవడం, పీపీఏల వివాద పరిష్కారానికి నీరజా మాథుర్ కమిటీ వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు విద్యుత్ వాటా ఇస్తామంటూ ఏకంగా ఏఆర్‌ఆర్‌లో ఏపీ డిస్కంలు పొందుపరచడం రాష్ట్రానికి సానుకూల పరిణామమని నిపుణులు అంటున్నారు.
ఏం జరిగింది?
రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ప్రభుత్వం జీవో నంబర్ 20 ద్వారా విద్యుదుత్పత్తిని పంపిణీ చేసింది. తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం కేటాయించారు. విభజన తర్వాత అప్పటికి ఉమ్మడిగానే ఉన్న ఏపీఈఆర్‌సీ పీపీఏలపై తీర్పు చెప్పింది. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్కేంద్రం పీపీఏ మినహా మిగతా అన్ని పీపీఏలనూ ఆమోదించినట్టుగానే భావించాలని కేంద్రానికి తెలిపింది. కానీ ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టాక కొత్త వివాదానికి తెర తీశారు. పాత ఈఆర్‌సీ ఆదేశాలు చెల్లవని, రాష్ట్రంలో ఉత్పత్తయ్యే కరెంటంతా తమకే దక్కుతుందని వాదించారు.
అందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్పింది. పీపీఏలను ఏపీ అంగీకరించకపోవడం వల్ల తమకు 462 మెగావాట్ల వాటా రాకుండా పోతుందని, కృష్ణపట్నం, హిందూజా వాటాలను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ కరెంటులో తెలంగాణకు వాటా ఇస్తామని ఏఆర్‌ఆర్‌లోనే డిస్కంలు తాజాగా పేర్కొనడం కోర్టులో కూడా తెలంగాణ వాదనకు బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. అలాగే కృష్ణపట్నం కరెంటులోనూ తెలంగాణ తన వాటాను మరింత గట్టిగా డిమాండ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. పీపీఏలు ఆమోదం పొందలేదని ఏపీ ప్రభుత్వం కోర్టులో వాదించినా అది నిలబడబోదని అభిప్రాయపడుతున్నారు.