ప్రజలపై పెనుభారం మోపుతారా! | Anantha Venkatarami reddy comments Chandrababu: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ప్రజలపై పెనుభారం మోపుతారా!

Published Mon, Dec 2 2024 4:04 AM | Last Updated on Mon, Dec 2 2024 4:04 AM

Anantha Venkatarami reddy comments Chandrababu: Andhra pradesh

ఐదున్నర నెలల్లోనే రూ.15,485 కోట్ల భారం 

బెల్టు షాపుల తొలగింపు బెల్టు తీసినంత ఈజీ కాదు 

బూడిద కోసం చంద్రబాబు పంచాయితీ పెట్టడం సిగ్గుచేటు 

వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి 

అనంతపురం (కార్పొరేషన్‌): విద్యుత్‌ చార్జీలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపై సీఎం చంద్రబాబు ఐదున్నర నెలల్లో రూ.15,485 కోట్ల పెనుభారం మోపారని.. తిరిగి మరోసారి విద్యుత్‌ చార్జీలు పెంచేందుకు నిర్ణయించడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఆదివారం పార్టీ స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు ఐదున్నర నెలల్లోనే మాట తప్పారని ధ్వజమెత్తారు.

ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఇప్పుడు విద్యుత్‌ చార్జీల పెంపుతో మరింత ఇబ్బంది పడే దుస్థితి నెలకొందన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు హామీ ఇచి్చన చంద్రబాబు మాట తప్పారన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించకపోతే ప్రజల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు.  

బెల్టు తీసినంత సులభం కాదు.. 
బెల్టు షాపుల మాఫియాను అరికట్టడం బెల్టు తీసినంత సులభం కాదని చంద్రబాబుకు అనంత చురకలంటించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు పెట్టడానికి కారణం చంద్రబాబే అన్నారు. వేలం పాట వేసి మరీ బెల్టు షాపులను తన కార్యకర్తలకు కట్టబెడుతున్నారన్నారు. ఇప్పుడేమో బెల్టు తీస్తా అని తనకేమీ తెలియనట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బూడిద కోసం రెండు జిల్లాల పోలీసులను సరిహద్దుల్లో బందోబస్తు పెట్టడం, ఈ విషయంపై సీఎం చంద్రబాబు పంచాయితీ పెట్టడం చూస్తుంటే ఇంతకన్నా సిగ్గు చేటు మరొకటి లేదని మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement