small indusrties
-
Lockdown Impact: ‘చిరు’ నవ్వులు దూరం
భూపాలపల్లి: కరోనా మహమ్మారి వేల కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది. అయిన వారిని కోల్పోయి వేలాది మంది దుఖః అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు చిరు వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. లాక్డౌన్ కారణంగా పూట గడవక పనుల కోసం ఎదురుచూస్తున్నారు. వైరస్ ప్రబలడమేమో కానీ కూలీ దొరికి ఇంటికి నిత్యావసర సరుకులు తీసుకెళ్తే బాగుండు అని భావిస్తున్నారు. ఉపాధి లేక వేలాది మంది.. రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్ విజృంభించి పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ నుంచి లాక్డౌన్ విధించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే అన్ని వ్యాపార సంస్థలు తెరవాలని, మిగతా సమయాల్లో కచ్చితంగా లాక్డౌన్ పాటించాలని ప్రకటించింది. దీంతో వ్యాపారాలు, ప్రజా రవాణా, వివిధ రంగాల్లో పనులు జరుగక అసంఘటిత రంగంలోని 27 విభాగాల్లో పని చేస్తున్న సుమారు 20 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరంతా గత 12 రోజులుగా పనులు లేక పస్తులుండాలి్సన పరిస్థితి నెలకొంది. కుటుంబాన్ని వెళ్లదీసేందు కు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. చేసేది లేక అప్పులు తీసుకొని వచ్చి నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయం.. రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ చిరు వ్యాపారులపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆటో, ట్రాలీ డ్రైవర్లు లాక్డౌన్ సడలింపు సమయంలో అడ్డాల వద్ద గిరాకీ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ఫలితం లభించడం లేదు. రెక్కాడితే గానీ డొక్కాడని హమాలీ, రిక్షా కార్మికుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. పొట్టకూటి కోసం రహదారికి ఇరువైపులా చిరు వ్యాపారం సాగించే కూరగాయలు, పండ్లు, సోడా, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, గప్‌చుప్, మిర్చిబండ్ల వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. వీరంతా ఇంటికే పరిమితమై వైరస్ ప్రభావం ఎప్పుడు తగ్గుతుందా.. లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందా అని ఆలోచిస్తున్నారు. లాక్డౌన్ ముగిసే వరకు రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. పూట ఎల్లుడు ఇబ్బంది ఐతాంది.. లాక్డౌన్ పెట్టినంక పుటకు ఎల్లుడు ఇబ్బంది ఐతాంది. ఇదివరకు రోజంతా రిక్షా తొక్కితే రూ. 400 నుంచి రూ. 500 వచ్చేవి. ఇప్పుడు రిక్షా అడిగినొళ్లే లేరు. అడ్డా మీద రోజుకు నాలుగు రిక్షాలు బయటకు వెళ్తలేవు. రోజుకు ఒక గిరాకీ వస్తే వస్తాంది.. లేదంటే లేనే లేదు. రోజుకు వంద కూడా సంపాదించకపోతే ఇల్లు ఎట్ల గడుస్తది. చాన ఇబ్బంది పడుతానం. - మొలుగూరి సారయ్య, రిక్షా కార్మికుడు ఇంటికాడనే ఉంటాన.. లాక్డౌన్ల పొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకే దుకాండ్లు తియ్యాలె అంటుండ్రు. మధ్యాహ్నం అయితేనే సోడాలకు గిరాకీ ఉంటది. పొద్దుపొద్దున సోడా తాగెటోళ్లు ఎవ్వరు ఉండరు. పొయిన ఎండాకాలం మొత్తం లాక్‌డౌనే ఉన్నది. ఇప్పుడు కూడా గట్లనే అయింది. ఇంటి కర్చులైతే ఆగవు కదా. పని లేక, పైసలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం మాలాంటి వాళ్లను ఆదుకోవాలె. - మార్కండేయ, సోడాబండి వ్యాపారి ప్రభుత్వం సాయం అందించాలి కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలు ఎవరూ బయటకు వస్తలేరు. ఆర్టీసీ బస్సులే నడుస్త లేవు. ఇగ మా ఆటోలు నడుస్తయా. ఉదయం 6 గంటలకు ఆటోను అడ్డా మీద ఉంచితే ఒక్కరు కూడా కిరాయి అడుగుతలేరు. రోజుకు రూ. వంద గిరాకీ కూడా అయితలేదు. చూసి చూసి 9 గంటలకు ఇంటికి వెళ్తున్నాం. ఆటో ఫైనాన్స్‌కు కిస్తీ తప్పకుండా కట్టాలి్సందే. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. - యార రామకృష్ణ, ఆటో డ్రైవర్ -
కుటీర పరిశ్రమ కుదేలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కుటీర పరిశ్రమలు అంతరించిపోతున్నాయా? ఏటా తగ్గిపోతున్న కుటీర పరిశ్రమల విద్యుత్ కనెక్షన్ల సంఖ్య ఇందు కు అవుననే సమాధానమిస్తోంది. కుటీర పరిశ్రమల కేటగిరీ కింద 2014–15లో 16,377 కనెక్షన్లు ఉండగా 2015–16లో ఆ సంఖ్య 10,995కు పడిపోయింది. రాష్ట్ర అర్థ గణాంక శాఖ విడుదల చేసిన వార్షిక గణాంకాల పుస్తకం–2017 దీన్ని బహిర్గతం చేసింది. 2014–15తో పోల్చితే 2015–16లో రాష్ట్రంలోని మిగిలిన అన్ని కేటగిరీల కింద విద్యుత్ కనెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరగ్గా, కుటీర పరిశ్రమల కనెక్షన్లు భారీగా తగ్గిపోయాయి. కుటీర పరిశ్రమలు గడ్డు కాలాన్ని ఎదుర్కొని ఏటా మూతబడుతున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా ఏటా రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల కుల వృత్తులు, చేతి వృత్తులు చతికిలబడిపోతున్నాయి. కుటీర పరిశ్రమల స్థితిగతులపై రాష్ట్ర పరిశ్రమల శాఖ వద్ద ఎలాంటి సమాచారం లేదని, దీన్ని ధ్రువీకరించలేమని ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల స్థితిగతుల సమాచారమే ఆ శాఖ వద్ద ఉంది. కుటీర పరిశ్రమల నమోదుకు యంత్రాంగం లేకపోవడమే ఇందుకు కారణం. బడా పరిశ్రమలతో పోటీ: ధోబీ ఘాట్లు, పవర్ లూమ్స్, వడ్రంగి, కుమ్మరి, కంచారి, స్వర్ణకార, శిల్పి, కమ్మరి, ఫినాయిల్, అగర్బత్తి, కోవత్తి, అప్పడాలు, చెప్పులు, సబ్బుల తయారీ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉత్పత్తులు, ఫల కాలు, కొయ్యలతో బొమ్మల తయారీ, పచ్చళ్లు, మ్యాంగో జెల్లీ, విస్తరాకుల తయారీ పరిశ్రమలను రాష్ట్ర విద్యుత్ సంస్థలు కుటీర పరిశ్రమలుగా పరిగణించి యూనిట్‌కు రూ.3.75 చొప్పు న చార్జీలు వసూలు చేస్తున్నాయి. 10 హెచ్‌పీల విద్యుత్ లోడ్లోపు వినియోగిస్తే కుటీర పరిశ్రమలుగా గుర్తిస్తున్నాయి. విద్యుత్ లోడ్ 10 హెచ్పీలకు మించితే ఈ పరిశ్రమలను ఎల్టీ–పరిశ్రమల కేటగిరీ కింద చేర్చి రూ.6.70 చార్జీలు విధిస్తున్నాయి. చెరుకు క్రషింగ్, రొయ్యలు, చేపల పెంపకం పరిశ్రమలను ఎల్టీ–3 పరిశ్రమల కేటగిరీ నుంచి కుటీర పరిశ్రమల కేటగిరీలోకి మార్చాలన్న డిస్కంల ప్రతిపాదనలను 2016– 17 విద్యుత్ టారిఫ్ ఉత్తర్వుల్లో ఈఆర్సీ తిరస్కరించింది. నిరంతర విద్యుత్ ఇస్తున్నా, చార్జీలు పెంచకున్నా కుటీర పరిశ్రమల సంఖ్య తగ్గిపోవడం వెనక బడా పరిశ్రమలతో ఎదురవుతున్న పోటీయే కారణమని పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉత్పత్తులు, సేవలను భారీ పరిశ్రమలు తక్కువకే అందిస్తుండటంతో కుటీర పరిశ్రమలు నిలదొక్కుకోలేకపోతున్నాయని ఆ శాఖ సీనియర్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. విద్యుత్ సమస్య కాదు: టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను కుటీర పరిశ్రమల నుంచి తొలగించి కొత్తగా ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ పరిశ్రమల కేటగిరీ కింద చేర్చడంతోపాటు వాటి విద్యుత్ చార్జీలను తగ్గించామని దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. 5 హెచ్‌పీ విద్యుత్ లోడ్ లోపు విద్యుత్ వినియోగించే పరిశ్రమలు కుటీర పరిశ్రమల కేటగిరీ కింద వస్తాయన్నారు. కొన్ని పరిశ్రమలు వినియోగించే విద్యుత్ లోడ్ 5 హెచ్‌పీకి మించిపోతే సాధారణ పరిశ్రమల కేటగిరీలో చేరుతాయన్నారు. దీంతో కుటీర పరిశ్రమల కేటగిరీ విద్యుత్ కనె క్షన్లు తగ్గి ఉంటాయని అన్నారు. విద్యుత్ కారణంతో కుటీర పరిశ్రమలు మూతబడేందుకు అవకాశామే లేదని కొట్టిపారేశారు. -
చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలి
ముకరంపుర : చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆలిండియా ఫోరమ్ ఫర్ స్మాల్, మీడియం ఇండస్ట్రీస్ రాష్ట్ర కన్వీనర్ కోటేశ్వర్రావు కోరారు. మంగళవారం కరీంనగర్‌లోని ప్రెస్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కరువు పరిస్థితులు, వ్యాపారం, ముడిసరుకు లేక పరిశ్రమల కోలుకోలేకపోతున్నాయన్నారు. ఈపరిస్థితుల్లో బ్యాంకులకు వడ్డీలు, వాయిదాలు కట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. అప్పులు చెల్లించలేక పరిశ్రమలు మూతపడుతున్నాయని, బ్యాంకు రుణాలు ప్రభుత్వం మాఫీ చేయాలని కోరారు. రాష్ట్ర కన్వీనర్లు ప్రభాకర్‌రావు, రాజేశ్వర స్వామి, కళ్యాణ్ చక్రవర్తి, ఎం.వాసుదేవచారి, జడల భాస్కర్‌రావు, రవీందర్, మేరుగు పర్శరాములు, తాటికొండ రాజు, దేవదాసు, గుడ్లపల్లి సుధాకర్, శ్యాంసుందర్, వీరేశం, శనిగరం సునీత, మధు పాల్గొన్నారు.