రుణమాఫీపై పోరాడండి
తెలంగాణ టీడీపీ నేతల భేటీలో లోకేశ్ సూచన
సాక్షి, హైదరాబాద్ : రైతుల రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కావడం లేదని, బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు భరోసా కలిగించేలా ఉద్యమించాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. ప్రభుత్వం తన హామీని అమలు పరిచేలా ఒత్తిడి చేయాలని, రుణమాఫీ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌బాబు సూచించారు. ఈ మేరకు శనివారం ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో తెల ంగాణ టీడీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. వివిధ అంశాలపై నియమించిన 10 కమిటీల కార్యాచరణ, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించారు.
ఈ నెలాఖరున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బ్యాంకుల ఎదుట ధర్నాలు చేపట్టాలని, ఆగస్టు మొదటివారంలో జిల్లా కేంద్రాల్లో ఆందోళ నలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో రుణమాఫీ అంశంపై సదస్సు నిర్వహించాలని టీటీడీపీ నేతలకు సూచించారు. ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణతో లోకేశ్ కొద్దిసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు తదిత రులు పాల్గొన్నారు.