మొక్కుబడి పర్యటన! | Manyam Visit in Minister Kamineni Srinivas | Sakshi
Sakshi News home page

మొక్కుబడి పర్యటన!

Published Wed, Jul 12 2017 3:28 AM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

మొక్కుబడి పర్యటన!

మొక్కుబడి పర్యటన!

వచ్చారు.. వెళ్లారు అన్నట్టుసాగిన మంత్రి కామినేని మన్యం టూర్‌
మారుమూల పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లను తనిఖీ చేయని వైనం
 రహదారి పక్క గ్రామాలకే పరిమితం..
 మందులు, సిబ్బంది ఖాళీలపై దృష్టిసారించని వైద్య మంత్రి

మన్యం పర్యటనకు వైద్యశాఖ మంత్రి వస్తున్నారంటే తమ ఆరోగ్యాలు గురించి పట్టించుకుంటారని ఆశించిన గిరిజనులకు నిరాశే మిగిలింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఏజెన్సీలో మంగళవారం పర్యటించగా.. అది మొక్కుబడిగానే సాగింది. పర్యటన షెడ్యూల్‌ మేరకు ఉన్న మారుమూల గ్రామాలను, కొండ ప్రాంతాల్లో కాకుండా కేవలం రహదారి పక్కనున్న గ్రామాలను సందర్శించి మమ అనిపించారు. కుసిమి గ్రామానికి వెళ్లిన మంత్రి మంచినీటి బావిని మాత్రమే పరిశీలించారు. సబ్‌సెంటర్‌ను తనిఖీ చేయలేదు. అక్కడికి కొద్ది దూరంలో ఉన్న  ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సైతం సందర్శించలేదు. ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులు, మందుల గురించి కనీసం ఆరా తీయలేదు.

సీతంపేట: మంత్రి కామినేని శ్రీనివాస్‌ మన్యం పర్యటన మొక్కుబడిగానే సాగింది. గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై కనీసం దృష్టిసారించలేదు. మారుమూలన ఉన్న  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు ఎలా ఉన్నాయి, రోజువారి ఓపీ ఎలా ఉంది, వైద్య సిబ్బంది పనితీరు, ఖాళీలు, మందులు ఉన్నాయా? లేదా అనేది పరిశీలించాల్సి ఉన్నప్పటికీ అవేవి చూడకుండా కొద్ది సేపు అక్కడ ఉన్న గిరిజనులతో మాట్లాడి వెళ్లిపోయారు. హైరిస్క్‌ గ్రామాలైన దోనుబాయి, మర్రిపాడు ప్రాంతాల్లో పర్యటిస్తే ప్రజా సమస్యలు తెలిసేవి. అలా కాకుండా గ్రామాల్లోని వీధుల్లో తిరిగి.. ఒకరిద్దరు గిరిజనులతో మాట్లాడి పర్యటనను ముగించారనే విమర్శలు స్థానికుల నుంచి వ్యక్తమయ్యాయి.

పర్యటన సాగింది ఇలా...
మల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను కామినేని సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. తల్లిదండ్రులను వ్యాధుల పట్ల చైతన్యం చేయాలని కోరారు. పాత అలవాట్లకు స్వస్తి పలికి ఇళ్లల్లో దోమలనివారణా మందును స్ప్రేయింగ్‌ చేయించుకునే విధంగా చూడాలన్నారు. అనంతరం జక్కరవలస గ్రామాన్ని సందర్శించారు. అక్కడ మంచినీటి వసతిసౌకర్యాలు పరిశీలించారు. మండ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని, వీధులను పరిశీలించారు. కిరప గ్రామానికి వెళ్లి అక్కడ గిరిజనులతో మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను మీ కోసం చేస్తుందన్నారు. వైద్యపరమైన సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు.

 వైద్యాధికారి నరేష్‌ కుమార్‌ బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. మంచి నీటి సమస్య ఉందని సర్పంచ్‌ గోపాల్‌తో పాటు పలువురు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం పెదరామ గ్రామానికి మంత్రి వెళ్లగా  గ్యాస్‌ స్టౌలు పంపిణీ చేయలేదని మహిళలు ఫిర్యాదు చేశారు.  అలాగే వివిధ సమస్యలను ఎమ్మెల్యే కళావతితో పాటు గిరిజనులు వివరించారు. దేవనాపురంలో మంత్రి పర్యటించినప్పటికీ వైద్య పరమైన విషయాలను ఏం మాట్లాడకుండానే వెళ్లిపోయారు. సీతంపేట సీహెచ్‌సీని సందర్శించిన కామినేని ఎక్స్‌రే మిషన్, జనరేటర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్‌ఆర్‌సీ, బర్త్‌వెయిటింగ్‌ గదిని పరిశీలించారు.

 అనంతరం రేగులగూడ, వెంపలగూడ, సోమగండి తదితర గ్రామాలను సందర్శించినప్పటికీ ఎలాంటి హామీలు ఇవ్వలేదు. వైద్య సిబ్బంది పనితీరు బాగుందని చెప్పడం స్థానికులను విస్మయం కలిగించింది. మంత్రి వెంట జిల్లా కలెక్టర్‌ కె.ధనుంజయరెడ్డి, ఐటీడీఏ పీవో లోతేటి శివశంకర్,  ఆర్‌డీవో గున్నయ్య,  ఎంపీపీ ఎస్‌.లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు రాజబాబు, ఎంపీటీసీ సభ్యులు బి.జయలక్ష్మి, బి.దమయంతి, శశికళ సర్పంచ్‌ విజయకుమారి, మలేరియా నివారణా శాఖ జేడీ ఏడీవీ లక్ష్మి, వైద్యాఆరోగ్యశాఖ జేడీ సావిత్రి, డీఎంహెచ్‌ ఎస్‌.తిరుపతిరావు, అదనపు డీఎంహెచ్‌వో మెండ ప్రవీణ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో నరేష్‌కుమార్, ఈఈ అశోక్, డీఈ సింహాచలం, జేఈ రవికుమార్, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ మల్లికార్జునరా వు, జేఈ మూర్తి, జీసీసీ మేనేజర్‌ లిల్లీపుష్పనాథం ఉన్నారు.

వైద్యులు నిబద్ధతతో పని చేయాలి
గిరిజన ప్రాంతాల్లో వైద్యులు నిబద్ధతతో పనిచేయాలని వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సబ్‌ప్లాన్‌ మండలాలకు చెందిన వైద్యాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనజీవనానికి దూరంగా కొండ ప్రాంతాల్లో ఉంటున్న గిరిజనులకు ఎంత సేవైనా చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్‌ ఆసరా వంటి పథకాలు వినూత్న రీతిలో ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

ఇటువంటి అధికారి సేవలు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల్లో కమ్యూనికేషన్‌ లోపం ఉందని దీని కారణంగా చాపరాయిలో 22 రోజుల్లో 16 మంది మృతి చెందారన్నారు. ఇటువంటి సంఘటనలు ఎక్కడా జరగకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో పర్యటిస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న వైద్యాధికారులకు జీతం రూ. 40 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని.. దీన్ని పెంచాలని మర్రిపాడు వైద్యాధికారి చంద్రమౌళి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్ట్‌ డాక్టర్లను రెగ్యులర్‌ చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో ఈఎన్‌వీ నరేష్‌కుమార్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement