ఐఏఎస్ అధికారి ఎక్కడ! | Where IAS officer | Sakshi
Sakshi News home page

ఐఏఎస్ అధికారి ఎక్కడ!

Published Mon, Jun 1 2015 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

Where IAS officer

సీతంపేట:  గిరిజనాభివృద్ధి పథకాలను సమగ్రంగా నిర్వహించాలంటే సమర్ధుడైన అధికారి కావాలి. అందుకే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలకు (ఐటీడీఏ) ఐఏఎస్ అధికారులను నియమించాలనే నిబంధన ఉంది. అయితే ఆ భాగ్యం సీతంపేట ఐటీడీఏకు కలగానే మిగింది. పదేళ్లుగా ఐఏఎస్ అధికారిని నియమించకపోవడంతో పథకాల అమలు నత్తనడకన సాగుతున్నాయి. అదే క్రమంలో పలు అక్రమాలు కూడా చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. జిల్లా కలెక్టర్ తర్వాత రెండో పరిపాలనా ధికారిగా పథకాలు పకడ్బందీగా అమలు జరగాలంటే ఐటీడీఏ పీవోకు సర్వాధికారాలు ఉండాలి. కొన్నాళ్లుగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థకు ఐఏఎస్ అధికారి లేకపోవడంతో పాలనలో పారదర్శకత పడకేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
 
 నాలుగు రోజుల కిందట రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు టైం స్కేల్ కింద పదోన్నతి ఇచ్చి రంపచోడవరం, పార్వతీపురం, పాడేరు ఐటీడీఏలకు పీవోలుగా నియమించారు. మిగతా ఐటీడీఏలకు ఐఏఎస్‌లే పీవోలుగా కొనసాగుతున్నారు. సీతంపేటకు మాత్రం మొండి చేయిచూపించారు. గిరిజనాభివృద్ధిలో భాగంగా 20 మండలాల్లో ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేయాల్సి ఉంది. అలాగే 26 ప్రభుత్వ సంస్థలను ఏకత్రాటిపై నడిపించాల్సి ఉంది.  ఐఏఎస్ అధికారి లేకపోవడంతో మౌలిక వసతుల కల్పన నామమాత్రంగా సాగుతోంది. ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా పీవోగా పనిచేసి పదేళ్ల క్రితం బదిలీ జరిగిన తర్వాత ఇక్కడ ఐటీడీఏకు పీవోగా గ్రూప్ వన్ అధికారులే సాగుతున్నారు.  
 
 - గాలిలో సీఎంల హామీలు  
 ఐటీడీఏకు ఐఏఎస్ అధికారిని పీవోగా నియమిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ అమలకు మాత్రం నోటుచోలేదు. గతంలో సీతంపేట వచ్చిన గిరిజన మంత్రి రావెల్ల కిశోర్‌బాబు కూడా సీతంపేట ఐటీడీఏకు ఐఏఎస్ అధికారిని నియమిస్తామని చెప్పినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అసెంబ్లీలో జీరో అవర్‌లో ఈ విషయమై ప్రస్తావించారు. సీతంపేటకు ఐఏఎస్ అధికారిని నియమించకపోవడంతో అవీనితి జరుగుతుందని సభ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సమాధానంగా ప్రభుత్వం స్పందించి తప్పనిసరిగా ఐఏఎస్ అధికారిని నియమిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేదు.
 
 గ్రూపు వన్ అధికారే దిక్కా?
 సీతంపేట ఐటీడీఏకు మళ్లీ గ్రూప్‌వన్ అధికారినే పీవోగా నియమించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో గ్రూప్‌వన్ కన్‌ఫర్మడ్ గా ఉన్న ఒక అధికారిని ఇక్కడ పీవోగా నియమిస్తారనే పుకార్లు వస్తున్నాయి. జిల్లాలో కీలక మంత్రి ఆశీస్సులతో ఇక్కడ చేరుతారనే ప్రచారం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement