గిరిజన విద్యకు గ్రహణం
సీతంపేట:గిరిజనుల విద్యాభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉన్నా నియామకాల జోలికి వెళ్లడం లేదు. జిల్లాలో 42 ఎస్టీ ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు పదివేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి మూడు పూటల భోజనంతోపాటు మంచి విద్య అందించాలనే ది ప్రభుత్వ లక్ష్యం. అయితే విద్యా బోధనకు తగినంత మంది ఉపాధ్యాయులను నియమించడంలో ప్రభుత్వం విఫలమవుతోందనే ఆరోపణలున్నాయి. ఈ విద్యా సంవత్సరం ఆరంభమై ఏడునెలలు గడిచాయి. మరో మూడు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తుంది. గణితం, పిజికల్ సైన్స్, ఆంగ్లం, హిందీ, జీవశాస్త్రం వంటి సబ్జెక్టుల ను బోధించడానికి ఇప్పటికీ సిబ్బంది లేరు. అరకొరగా నియమించిన సీఆర్టీలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలను ఏ,బీ గ్రేడ్లుగా విబజించారు. నిబంధనల ప్రకారం ఏ గ్రేడ్‌లో 640 మంది విద్యార్థులు మించి ఉన్న పాఠశాలలను చేర్చారు. వీటిలో 26 మంది ఉపాధ్యాయులుండాలి. బీ గ్రేడ్‌లో 320 మంది విద్యార్థులున్న పాఠశాలలను చేర్చారు. వీటిలో 13 మంది ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఏ గ్రేడ్ పాఠశాలల్లో 20 లోపు, బీ గ్రేడ్‌లో పది మందిలోపే ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.
ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీ ఎప్పుడు?
టీచర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు. దీనికి ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాల్సి ఉండగా.. అదీ చేయడంలేదు. ఇటీవల ప్రకటించిన డీఎస్సీలో సైతం ఏజెన్సీ పోస్టులు కలపకపోవడంతో వచ్చే విద్యా సంవత్సారానికి కూడా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యే సూచనలు కనిపించడం లేదు.
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నా..
పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 27 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పాటికే 90 శాతం సిలబస్ పూరి ్తకావాల్సి ఉంది. అయితే సబ్జెక్టు టీచర్ల కొరతతో సకాలంలో పూర్తికాని పరిస్థితి నెలకొంది. సిలబస్ పూర్తికాకపోతే తామేం పరీక్షలు రాస్తామని విద్యార్థులు వాపోతున్నారు. కాగా రెండేళ్ల క్రితం ఐటీడీఏ పరిధిలో పది వరకు పాఠశాలలను అప్‌గ్రేడ్ చేశారు. ఈ పాఠశాలల్లో ఇప్పటివరకు బోధకులు లేరు. దీంతో విద్యార్థులను పట్టించుకున్న నాథడు కరువయ్యాడు. మారుమూలన ఉన్న పూతికవలస, సామరిల్లి వంటి పాఠశాలల్లో అరకొర ఉపాధ్యాయులుతో నెట్టుకొస్తున్నారు.
ఆశ్రమాలుగా మార్చారు.. సిబ్బందిని మరిచారు
రెండేళ్ల కిందట శ్రీకాకుళం, మందస, సీతంపేటల లో ఉన్న గిరిజన బాలుర వసతిగృహాలను ఆశ్రమ పాఠశాలలుగా మార్చారు. అయితే వీటికి బోధకులను మాత్రం నియమించలేదు. సీతంపేటకు 13 పోస్టులు మంజూరు చేసినా ఆర్థిక శాఖ అనుమతి లేదు. శ్రీకాకుళం, మందస ఆశ్రమ పాఠశాలలకు అసలు పోస్టులనే మంజూరు చేయలేదు. వసతులు కల్పించకుండానే వసతిగృహాలను ఆశ్రమ పాఠశాలలుగా మార్చడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసంతృప్తి చెందుతున్నారు. ఈ విషయమై ఇటీవల సీతంపేట వచ్చిన గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర అదనపు డెరైక్టర్ చిన్నవీరభద్రుడు వద్ద ప్రస్తావించగా త్వరలోనే ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ రానుందని తెలిపారు. గిరిజన విద్య పట్ల నిర్లక్ష్యం: డొంకాన ఈశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శి గిరిజన విద్య పట్ల ప్రభుత్వం నిర్లక్ష్వం వహిస్తోంది. అప్‌గ్రేడ్ చేసి రెండేళ్లయినా పోస్టులను భర్తీ చేయకపోవడం అన్యాయం. చాలా ఆశ్రమ పాఠశాలల్లో ఇంతవరకు ఉపాధ్యాయులను నియమించకపోవడం దారుణం. గిరిజన విద్యకు భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నామంటున్న ప్రభుత్వం పోస్టుల భర్తీపై ఇంత నిర్లక్ష్యం వహించడం తగదు.