ఆ దుండగునికి దండన విధించాలి
ఆ దుండగునికి దండన విధించాలి
Published Wed, Feb 8 2017 11:03 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM
-హోలీ ఏంజెల్స్ ‘మధు’ను అరెస్టు చేయాలి
-‘రంప’లో గిరిజన విద్యార్థుల ప్రదర్శన
రంపచోడవరం : న్యాయం కోసం గిరిజన విద్యార్థులు చేసిన నినాదాలతో రంపచోడవరం వీధులు మార్మోగాయి. గిరిజన విద్యార్థినులపై దౌర్జన్యానికి పాల్పడిన రాజమహేంద్రవరం హోలీ ఏంజెల్స్ పాఠశాల డైరెక్టర్ మధుసూదనరావును అరెస్టు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్థానిక డిగ్రీ కళాశాల నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. విచారణలో వాస్తవాలు తెలుస్తాయని, దోషులను వదిలే ప్రస్తకే లేదని పీవో దినేష్‌కుమార్ హామీ ఇచ్చారు. కాగా గిరిజన విద్యార్థినులను చితకబాదిన మధుసూదనరావును తక్షణం అరెస్టు చేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థినులను అమానుషంగా కొట్టిన రాజమహేంద్రవరం హోలీఏంజెల్ పాఠశాల డైరెక్టర్ మధుసూదనరావును తక్షణం అరెస్టు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్థులు బుధవారం రంపచోడవరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. డిగ్రీ కళాశాల నుంచి ర్యాలీగా అంబేడ్కర్ సెంటర్ మీదుగా ఐటీడీఏ పీఓ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కుంజా శ్రీను, సీపీఐ డివిజన్ కార్యదర్శి జత్తుక కుమార్ ఆధ్వర్యంలో రంపచోడవరంలోని అన్ని యాజమాన్య పాఠశాలల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో విద్యార్థులతో పీఓ ఏఎస్ దినేష్‌కుమార్ మాట్లాడారు. జ్యుడిషియల్ విచారణలో వాస్తవాలు తెలుస్తాయని దోషులను వదిలే ప్రస్తకే లేదన్నారు. పదో తరగతి పరీక్షలకు ఎంతో సమయం లేనందున శ్రద్ధగా చదువుకోవాలని, అక్కడ ఇబ్బందులు లేకుండా చూసేందుకు కేర్‌టేకర్‌ను నియమిస్తామన్నారు. విద్యార్థినులు భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు. అక్కడి పరిస్ధితిపై విచారణ చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ డీడీ సుజాతను పంపినట్టు తెలిపారు. విచారణ చేయమని ఏటీడబ్ల్యూఓ ఆకుల వెంకటేశ్వరరావును ఆదేశించామని వివరించారు. దీంతో విచారణకు వచ్చిన ఏటీడబ్ల్యూఓ ఐటీడీఏ పీఓకు, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకుండానే సర్దుబాటు చేయాలని యాజమాన్యంతో మాట్లాడినట్టు పీఓ దృష్టికి విద్యార్థులు తీసుకువెళ్లారు.
ఎమ్మెల్యే రాజేశ్వరి డిమాండ్..
హోలిఎంజెల్స్‌లోని గిరిజన విద్యార్థినులను చావకొట్టిన పాఠశాల డైరెక్టర్ మధుసుదన్‌రావును తక్షణం అరెస్టు చేయాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. కులం పేరుతో దూషించిన డైరెక్టర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలన్నారు. గిరిజన విద్యార్థుల చదువు కోసం గిరిజన సంక్షేమ శాఖ రూ.లక్షలు ఖర్చు చేస్తుంటే అక్కడ వారికి కనీసం భోజనం కూడా సక్రమంగా పెట్టడడం లేదన్నారు. ఆడపిల్లలను డైరెక్టర్ కొట్టడం హేయమన్నారు. విద్యార్థినులకు న్యాయం చేసేవరకూ పక్షాన పోరాడతానని చెప్పారు.
Advertisement
Advertisement