​పసిమొగ్గలపై పైశాచికత్వం | holly angels director beats tribal students | Sakshi
Sakshi News home page

​పసిమొగ్గలపై పైశాచికత్వం

Published Tue, Feb 7 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

​పసిమొగ్గలపై పైశాచికత్వం

​పసిమొగ్గలపై పైశాచికత్వం

పరుగుపెట్టించి కొట్టిన హోలీ ఏంజెల్స్‌ డైరెక్టర్‌
ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేసిన గిరిజన బాలికలు
డైరెక్టర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్‌
కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/ రంపచోడవరం : పైశాచికత్వం పెల్లుబికింది... పసిమొగ్గలని కూడా చూడలేదు వారిని..చేతులపై బొబ్బలు వచ్చేలా.. కాళ్లు వాచేలా చితకబాదాడు...రోజూ అతడు స్కూలుకు వస్తున్నాడంటేనే వణికిపోతున్న విద్యార్థులకు ఒక రోజంతా తన విశ్వరూపం చూపించాడు. రాజమహేంద్రవరంలోని హోలీ ఏంజెల్స్‌ పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థినులు పాఠశాల డైరెక్టర్‌ పైశాచికత్వానికి బలయ్యారు. ఈ సంఘటన రాజమహేంద్రవరంలో మంగళవారం వెలుగుచూసింది. దీనికి సంబంధించి విద్యార్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
బెల్ట్‌ దెబ్బలు తట్టుకోలేక రోడ్డుపైకి పరుగులు 
ఐటీడీఏ ప్రతిభ పాఠశాల పేరుతో గిరిజన విద్యార్థులను రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ పాఠశాల అయిన హోలీ ఏంజెల్స్‌లో చేర్పిస్తున్నారు. వీరికి ఐటీడీఏ ఫీజులు చెల్లిస్తోంది. సోమవారం ఉదయం పాఠశాల క్యాంపస్‌కు డైరెక్టర్‌ మధుసూధనరావు  వచ్చారు. ఆయన గిరిజన విద్యార్థుల వద్దకు వెళ్లారు. ఏం చేస్తున్నారురా అంటూ తిట్ల పురాణం మొదలుపెట్టాడు. అక్కడితో చాలక వారిని ఇష్టారాజ్యంగా చితకబాదాడు. విషయాన్ని తమ వారికి తెలపాలంటూ ఏదోలా వారంతా బయటపడ్డారు. మంగళవారం రంపచోడవరం ఐటీడీఏ పీవో ఏఎస్‌ దినేష్‌కుమార్, స్థానిక ఏఎస్పీ నయీం ఆస్మీకి ఫిర్యాదు చేశారు. పదో తరగతి చదువుతున్న ఎం. జ్యోత్స్నకుమారి అనే విద్యార్థిని మాట్లాడుతూ తమను అకారణంగా కొడుతున్న డైరక్టర్‌ సార్‌ని కొట్ట వద్దంటూ కాళ్లు పట్టుకున్నామని, అయినా బెల్ట్‌తో కొట్టారంటూ వాచి పోయిన తన చేతులను చూపింది. పి సోనియా అనే మరో బాలిక మాట్లాడుతూ డైరెక్టర్‌ ఎప్పుడు వచ్చినా ఎవర్ని కొడతారోననే భయంతో వణుకుతూ దాకుంటున్నామని తెలిపింది. సోమవారం ఉదయం ఐదు గంటలకు వచ్చిన డైరెక్టర్‌ గిరిజన విద్యార్థినులను తిడుతూ ‘ఐటీడీఏ ఇచ్చే డబ్బులు మీకు భోజనానికి కూడా సరిపోవడం లేదు మీకు చెట్లు కింద చదువే మీకు సరిపోతుంది’ అంటూ కర్ర విరిగిపోయేలా కొట్టారని వాపోయింది. దెబ్బలు తట్టుకోలేని కొంత మంది రోడ్డుపైకి పరుగులు తీశారని తెలిపింది. జరిగిన సంఘటన పోలీసులకు తెలియడంతో పాఠశాలకు పోలీసులు వచ్చారని, బాగా దెబ్బలు తగిలిన జ్యోత్స్న కుమారిని గదిలో దాచిపెట్టారంది. నరకం అంటే ఎలా ఉంటే మీకు రోజూ చూపిస్తానని బెదిరించి, జరిగిన సంఘటన ఎవరికి చెప్పిన మీ సంగతి తేల్చుతానని హెచ్చరించారని తెలిపింది. ఆ పాఠశాలలో ఇక చదువును కొనసాగించలేమని విద్యార్థులు వాపోయారు. 
అందరి దుస్తులూ ఉతకండి..
డైరెక్టర్‌ వచ్చే సయమానికి ఉతికిన దుస్తులు ఆరబెట్టుకుంటే .. పాఠశాలలో అందరి దుస్తులూ మీరే ఉతకండని తిట్టారని దుర్గవిజయలక్ష్మి అనే బాలిక తెలిపింది. సుమారు 200 మంది గిరిజన విద్యార్థినులు హోలి ఏంజెల్స్‌లో చదువుతున్నారని డైరెక్టర్‌ వస్తే బాత్‌రూమ్‌లో ఉన్న బయటకు పిలిచి మరీ కొడుతున్నారని వివరించింది. కనీసం జ్వరం వచ్చినా పట్టించుకోరని, ఇంటి నుంచి ఫోన్‌ వచ్చినా ఆ విషయం చెప్పరని వివరించింది. 
క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి
గిరిజన విద్యార్థినులపై అమానుషంగా ప్రవర్తించిన హోలి ఏంజెల్స్‌ పాఠశాల డైరెక్టర్‌ మ«ధుసూధనరావుపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్‌  చేశారు. విద్యార్థి పట్ల జరిగిన సంఘటనపై కలెక్టర్, ఐటీడీఏ పీవోలతో చర్చించి విద్యార్థినులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆ పాఠశాలలో విద్యార్థినులు చదివే పరిస్థితి లేదు కాబట్టి మరో పాఠశాలలో చదివేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులు, ఆదివాసీ సంక్షేమ సాంస్కృతిక సంఘం నాయకుడు కడబాల రాంబాబులు డిమాండ్‌ చేశారు. ఐటీడీఏ రూ.లక్షలు కార్పొరేట్‌ పాఠశాలకు ఇస్తుంటే అక్కడ కనీసం సరైన భోజనం కూడా పెట్టకుండా కొట్టడం దారుణమన్నారు. గిరిజన సంక్షేమ సహాయ అధికారి ఆకుల వెంకటేశ్వరరావు హోలి ఏంజెల్స్‌ పాఠశాలకు వెళ్లి బాలికల తల్లిదండ్రులు రాకుండానే సర్దుబాటు చేయాలని చూడడం వెనుక కారణాలు ఏమిటని జగ్గంపాలెం సర్పంచ్‌ రంగబాబు ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement