ఎందుకీ ‘వేలం’ వెర్రి! | Vehicle auctions ITDA in Sitampeta | Sakshi
Sakshi News home page

ఎందుకీ ‘వేలం’ వెర్రి!

Published Tue, Aug 5 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM

ఎందుకీ ‘వేలం’ వెర్రి!

ఎందుకీ ‘వేలం’ వెర్రి!

 సీతంపేట: నిధులకు కటకటలాడుతున్న ఐటీడీఏలో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి.. అనవసర ఖర్చులతో దుబారా చేయడంపైనే అధికారులు శ్రద్ధ చూపుతున్నారు. నిక్షేపంలా తిరుగుతున్న వాహనాలను వేలం వేసి వాటి స్థానంలో అద్దెకు వాహనాలు సమకూర్చుకోవాలని తలపెట్టడం దీనికి నిదర్శనం. ఇప్పటికే ఐకేపీలో ఏ ఇతర ఐటీడీఏలోనూ లేని విధంగా గుమస్తాల నుంచి ఏపీఎంల వరకు కార్లు కేటాయించేసి అద్దెల రూపంలో లక్షలాది రూపాయల ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇది చాలదన్నట్లు ఉన్న వాహనాలను వేలం వేసి కొత్త వాహనాలు అద్దెకు తీసుకోవాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
 
  ప్రస్తుతం పనిచేస్తున్న కొన్ని వాహనాలను మూలనపడిన వాటితో కలిపివేలం వేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించడానికి ఐటీడీఏలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులకు ప్రభుత్వం వాహనాలు కేటాయించింది. ఇలా ఐటీడీఏలో రెండు అంబులెన్సులు కాకుండా మరో 8 వాహనాలు ఉన్నాయి. వాటిలో 7 జీపులు కాగా.. ఒకటి బొలేరో వాహనం.  వీటిలో మూడు మాత్రమే కండీషన్‌లో లేక మూలనపడ్డాయి. సీజ్ చేసిన ఒక జీపు కూడా మూలన పడింది. మిగతా ఆరు వాహనాలు తిరుగుతున్నాయి. అయితే మూలనపడిన వాటితోపాటు అన్ని వాహనాలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు.
 
 చిన్న రిపేర్లతో సరిపోయేదానికి..
 ప్రస్తుతం తిరుగుతున్న వాహనాలకు ఏవో చిన్నపాటి సమస్యలు తప్ప ఏ లోపం లేదు. ఒక్కో వాహనానికి రూ. 25 వేలు.. మొత్తం మీద రూ.2 లక్షలు వెచ్చించి వీటికి మరమ్మతులు చేయిస్తే.. మరో రెండేళ్ల వరకు బాగా పనిచేస్తాయని ఐటీడీఏ డ్రైవర్లే చర్చించుకుంటున్నారు. కొండలపైనున్న గ్రామాలకు సైతం ఎటువంటి ఇబ్బందులు  లేకుండా వెళ్తాయని అంటున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా వీటిని వేలం వేసి.. కొత్తగా ఎనిమిది వరకు వాహనాలను అద్దెకు తీసుకుని ఒక్కో వాహనానికి నెలకు రూ. 24 వేలు చెల్లించడానికి అధికారులు సిద్ధమతున్నారు. దీనివల్ల వాహనాలకు అద్దె రూపంలో నెలకు రూ.1.50 లక్షలు ఖర్చవుతాయి.
 
 డ్రైవర్ల పరిస్థితి ప్రశ్నార్థకం...
 కాగా కొందరు డ్రైవర్లు గత 20 ఏళ్లుగా ఐటీడీఏనే నమ్ముకుని పని చేస్తున్నారు. ఇప్పుడున్న వాహనాలను వేలం వేసి.. వేరేవి అద్దెకు తీసుకుంటే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి 9 మంది డ్రైవర్లు పని చేస్తున్నారు. వాహనాలను వేలం వేస్తే వీరికి పని ఉండదు. అందువల్ల తమ ఉపాధి పోతుందేమోనని వారంతా ఆందోళన చెందుతున్నారు.
 
 అవి పాత వాహనాలే:పీవో
 ఐటీడీఏలో ప్రస్తుతం తిరుగుతున్నవన్నీ పాత వాహనాలని ప్రాజెక్టు అధికారి ఎన్.సత్యానారాయణ అన్నారు. 15 ఏళ్లు క్రితంనాటి ఈ వాహనాలు ఇప్పటికే 2.50 లక్షల కిలోమీటర్లు తిరిగేశాయన్నారు. ఎక్కడ ఏ ప్రమాదం సంభవిస్తుందోనన్న ఉద్దేశంతో వేలం వేయాలని నిర్ణయించామని వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు వేలం వేస్తామని, ప్రస్తుతం పనిచేస్తున్న డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement