బాలబడులకు మంగళం
275 మంది ఉద్యోగులకు ఉద్వాసన
ఉపాధి కోల్పోయామంటూ ఆందోళన
తాము అధికారంలోకి వస్తే ఏడాదికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రగల్బాలు పలికిన తెలుగుదేశం ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కొత్త ఉద్యోగాల మాట పక్కన బెడితే..ఉన్న ఉద్యోగాలకు మంగళం పాడుతోంది. ఇప్పటికే వివిధ రంగాల్లో సేవలందించిన కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది, ఆదర్శ రైతులు, ఉపాధి మేట్లను ఇంటికి పంపించేసిన చంద్రబాబు సర్కార్..తాజాగా బాలబడుల్లో పనిచేస్తున్న వలంటీర్లను సాగనంపేందుకు నిర్ణయించింది. 2009లో వెలుగు ఆధ్వర్యంలో..రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ పర్యవేక్షణలో బాలబడులను ఏర్పాటు చేశారు. మూడు సంవత్సరాల నుంచి ఐదేళ్ల పిల్లలకు ఆటపాటల ద్వారా విద్యనందించాలనేది వీటి లక్ష్యం. అయితే టీడీపీ సర్కార్ వాటిని మూసి వేయూలని నిర్ణయించింది.
సీతంపేట: బాలబడుల్లో పనిచేస్తున్న 275 మంది వలంటీర్లపై వేటు పడింది. ఇక మీ సేవలు చాలంటూ స్వయం గా జిల్లా కలెక్టర్ ప్రకటించడంతో వీరంతా రోడ్డున పడినట్లైంది. ఉపాధి కోల్పోయూమని వలంటీర్లు లబోదిబోమంటున్నారు. అర్ధంతరంగా తొలగించేస్తే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.
పరిస్థితి ఇది..
2009లో వెలుగు ఆధ్వర్యంలో రాష్ట్ర పేదరిక నిర్మూలనా సంస్థ సీతంపేట, భామిని, కొత్తూరు మండలాల్లో 130 బాలబడులను ఏర్పాటు చేసింది. వీటి పరిధిలో 130 మంది వలంటీర్లు, అంతే సంఖ్యలో ఆయాలు, 12 మంది కో-ఆర్డినేటర్లు, ఇద్దరు క్లస్టర్ కో-ఆర్డినేటర్లు, ఒక ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ పనిచేస్తున్నారు. సుమారు రెండు వేల మంది పిల్లలు వీటిలో ఉన్నారు. మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య ఉన్న చిన్నారులను బాలబడుల్లో చేర్పించి వారికి ఆటపాటల ద్వారా విద్యనందించాలనేది లక్ష్యంగా నిర్ణయించారు. ఐదేళ్లు నిండిన తర్వాత ప్రభుత్వ జీపీఎస్ పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంది.
అయితే ఏడాదిన్నరగా ప్రభుత్వం ఈ బాలబడులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచకపోగా సిబ్బందికి వేతనాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో ఇబ్బందులు పడుతూనే నెట్టుకొస్తున్నారు. ఒక్కో వలంటీర్‌కు రూ.4 వేలు నుంచి 4,500 వరకు సీనియార్టినీ బట్టి వేతనం చెల్లిస్తున్నారు. అలాగే కో ఆర్డినేటర్లకు రూ.5 వేల నుంచి 6 వేలు, ఆయాలకు రూ.1200 చెల్లించేవారు. అయితే ఏడాదిగా వీరికి సక్రమంగా జీతాలు అందడం లేదు. దీనికితోడు ఈ నెల నుంచి వీరిని నిలిపి వేయనుండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
కలెక్టర్‌కు వినతి
తమకు ఏడాదిగా వేతనాలు చెల్లించడం లేదంటూ సోమవారం ఐటీపీఏకి వచ్చిన జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహాన్ని బాలబడుల్లో పనిచేస్తున్న వారంతా కలిసి విన్నవించారు. దీనికి స్పందించిన కలెక్టర్ 2015 ఏప్రిల్ నుంచి 2016 మే 31 వరకు బకాయి పడిన వేతనాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఇకపై బాలబడులను ఎత్తివేస్తున్నామని, అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నందున మరి బాలబడులు వద్దని, మీ సేవలు అవసరం లేదని చెప్పడంతో దీనిలో వలంటీర్‌లు, సీసీలు, ఆయాలు ఖంగుతిన్నారు. మేమంతా విధులు నిర్వహిస్తున్నామని ముందుగా చెప్పకుండా అర్దాంతరంగా ఇలా ప్రకటించడం ఎంతవరకు సమంజసమని వారంతా ప్రశ్నిస్తున్నారు.
ఏపీఎం ఏమన్నారంటే.
ఈ విషయమై బాలబడుల ఏపీఎం కొండలరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా 60 వరకు మాత్రమే ప్రస్తుతం బాలబడులు నడుస్తున్నాయని తెలిపారు. వేతనాలు చెల్లించడానికి బడ్జెట్ కూడా లేదని చెప్పారు.
చిరుద్యోగులపై బ్రహ్మాస్త్రం!
Published Tue, Jun 7 2016 8:35 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM
Advertisement