కొత్తూరు/భామిని:మావోయిస్టుల వారోత్సవాలు ఈ నెల 28 నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు కావడంతో పాటు కొత్తూరు-భామిని మండలాలకు అనుకొని ఉన్న తివ్వకొండలు మావోలకు సేఫ్ జోన్ కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. స్థానిక సీఐ కె.అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలతో కొత్తూరు నాలుగు రోడ్ల కూడలితో పాటు బత్తిలి రోడ్డు నుంచి వచ్చిన ప్రతి వాహనాన్ని గురువారం నిశితంగా పరిశీలించారు. ఒడిశా నుంచి వచ్చే వాహనాలను మరింత జాగ్రత్తగా తనిఖీ చేపట్టారు. అపరిచిత వ్యక్తుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు.
ప్రత్యేక పోలీస్ బలగాలు స్థానిక సర్కిల్ పరిధిలో మొహరించాయి. సీతంపేట, భామిని మండలాలతో పాటు ఒడిశాకు చెందిన కొన్ని గ్రామాలకు కొత్తూరు ప్రధాన కేంద్రం కావడంతో మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిని కూడా తనిఖీ చేశారు. స్థానిక పోలీస్ సర్కిల్ పరిధిలోని కొత్తూరు, దోనుబాయి, సీతంపేట, బత్తిలి పోలీస్ స్టేషన్లు పూర్తిగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా చర్యలు చేపట్టారు. సీతంపేట, భామిని ఏజెన్సీ ప్రాంతాల్లో కూబింగ్‌లు నిర్వహిస్తూ జల్లేడ పడుతున్నారు.
లాడ్జీలను సైతం గురువారం రాత్రి పోలీసులు పరిశీలించారు. తనిఖీల్లో ఎస్సై వి.రమేష్, ఏఎస్‌ఐ ప్రసాద్, ప్రత్యేక పోలీస్ బలగాలు పాల్గొన్నాయి.భామిని మండలంలో బత్తిలి ఎస్‌ఐ సీహెచ్ రామారావు ఆధ్వర్యంలో సాయుధ పోలీసు బలగాలతో ఏరియా డామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. జామిగూడ, ఇప్పమానుగూడ, మాసగూడ, ఘనసర పరిసరాల్లో ఎస్‌టీఎఫ్ దళాలతో కూంబింగ్ చేపట్టారు. సరిహద్దులో అనుమానితులపై నిఘా పెంచారు. అనంతరం ఏబీ రోడ్డు వెంబడి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు.
జల్లెడ పడుతున్న పోలీస్‌లు
Published Fri, Jul 31 2015 2:27 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement