ఏమి‘టీ’ శిక్ష..?
సీతంపేట: భరించలేని తలనొప్పి ఆ విద్యార్థి పాలిట శాపంలా పరిణమించింది. ఎంతో ఓపిక, సహనంతో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి..ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయిని బాధ్యత మరిచి వేడి టీ గ్లాసుని బాలుడి చేతిపై ఉంచింది. దీంతో బాలుడి చేతి పై తీవ్ర గాయమై..ఆస్పత్రి పాలయ్యాడు. వివరాలివీ.. మల్లి గిరిజన సంక్షేమ ఉన్నత బాలుర ఆశ్రమ పాఠశాలలో జగ్గడుగూడకు చెందిన సవర సూగన్న ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 15న పాఠశాలలో సో షల్ అసిస్టెంట్ పల్లెరిక చంద్రకళ 8వ తరగతి మూడు సెక్షన్లు కలిపి పాఠ్యాంశాలు బోధిస్తున్నారు.
మధ్యలో టీ రావడంతో ఆమె టీ తాగుతూ..ఆ సమయంలో తలనొప్పితో బాధపడుతూ..కునుకు తీస్తున్న సూగన్న వద్దకు వెళ్లి..టీ గ్లాసుతో చురక వేసింది. వెంటనే తేరుకున్న విద్యార్థి వెక్కివెక్కి ఏడ్చాడు. అనంతరం చేతిపై బొబ్బలు తేలడంతో మరుసటి రోజు.. వసతిగృహ సంక్షేమాధికారి ధర్మారావు ఆస్పత్రికి తీసుకువెళ్లినా.. చేయిపై బొబ్బలు తగ్గలేదు. అనంతరం చెయ్యి సెప్టిక్ అయి..చీము కారడంతో విద్యార్థి..తన స్వగ్రామమైన జగ్గడుగూడకు వచ్చేసి..తల్లికి విషయాన్ని చెప్పాడు. కంగారు పడిన ఆమె..సపర్యలు చేసి, బం ధువులతో విషయాన్ని చెప్పింది. వెంటనే వారంతా.. ఐటీడీఏకు వచ్చి..జరిగిన సంఘటనను బుధవారం రాత్రి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆయన..విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని డీడీ సుదర్శనదొరను ఆదేశించారు. డీడీ పాఠశాలకు వెళ్లి..విచారణ జరిపారు.
ఇంత నిర్లక్ష్యమా..?
మల్లి ఆశ్రమ పాఠశాలలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ సుదర్శన దొర విచారణ చేపట్టారు. ఏటీడబ్ల్యూవో ఎర్రన్నాయుడు, సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌పాత్రో తదితరులు పాఠశాల సిబ్బంది నుంచి వివరాలు తీసుకున్నా రు. ఉపాధ్యాయిని చంద్రకళను విచారించగా..విద్యార్థి చేయిపై..టీ తాగుతున్న గ్లాసుతో చేరకవేయడం వాస్తవేనని అంగీకరించారని డీడీ చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇంత సంఘటన జరిగినా..తనకు గానీ, ఏటీడబ్ల్యూవోకు గానీ సమాచారం ఇవ్వకపోవడం వెనుక హెచ్‌ఎం నిర్లక్ష్యం ఉందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచారణ నివేదికను ఐటీడీఏ పీవోకు అందజేస్తానన్నారు. ఇదిలా ఉండగా..బాబు కనీసం అన్నం తినలేకపోతున్నాడని..సూగన్న తల్లి చంద్రమ్మ రోదిస్తోంది. పాఠశాలకు పంపిస్తే..ఇంతటి శిక్ష వేస్తారా..అంటూ..ఆమె ప్రశ్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చదివించాలంటూ.. ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాలుడికి వైద్యసేవలంది స్తున్న డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ..చెయ్యి సెప్టిక్ అయ్యిందని..ప్రస్తుతానికి ఫర్వాలేదని తెలిపారు.
ఉపాధ్యాయురాలి సస్పెన్షన్
విద్యార్థిపై టీ గ్లాసుతో చురక వేసిన ఉపాధ్యాయిని పి.చంద్రకళను సస్పెండ్ చేసినట్టు గిరిజన సంక్షేమ శాఖ డీడీ సుదర్శన్ దొర తెలిపారు. సంఘటన జరిగినా..ఐటీడీఏకు సమాచారం ఇవ్వనందుకు హెచ్‌ఎం గున్ను రామ్మోహనరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.