ఆశ్రమ పాఠశాలల్లో సీసీ నిఘా | CC Surveillance in Schools | Sakshi
Sakshi News home page

ఆశ్రమ పాఠశాలల్లో సీసీ నిఘా

Published Thu, Mar 15 2018 9:11 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

CC  Surveillance in Schools - Sakshi

నర్సాపూర్‌(బీ) బాలికల ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సీసీ మానిటర్‌

ఉట్నూర్‌(ఖానాపూర్‌): ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలపై ప్రభుత్వం నిరంతరం నిఘా కోసం చర్యలు చేపట్టింది. ప్రతీ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. ఆశ్రమాల్లో జరిగే ప్రతీ సంఘటన.. విషయం క్షణాల్లో అధికారులకు తెలిసేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతీచోట ఆరు సీసీ కెమెరాలకు తగ్గకుండా ఏర్పాటు చేయడంతో పాటు ఇంటర్‌నెట్‌ లేదా వైఫై ద్వారా నేరుగా ఆయా జిల్లాల డీటీడీవో కార్యలయాలు, అక్కడి నుంచి నేరుగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యలయానికి అనుసంధానం చేసేలా చర్యలు చేపట్టారు. 

ప్రస్తుతం ఆశ్రమాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాగానే ప్రత్యేక ఐపీల ద్వారా కార్యాలయాలు, అధికారులు స్మార్ట్‌ఫోన్లకు ప్రత్యక్షంగా వీక్షించేలా అనుసంధానం చేయనున్నారు. ఫలితంగా ఆశ్రమాల్లోని గిరిజన విద్యార్థులకు మేలు జరగనుంది.

నిరంతరం సీసీ నిఘా..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో 127 ఆశ్రమ పాఠశాలల్లో 39,123 మంది, ఏడు వసతి గృహాల్లో 1254 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖ ద్వారా ఉచితంగా విద్య, భోజన, ఇతర మౌలిక వసతులు కల్పిస్తోంది. వీరందరికీ నిర్దేశిత మెనూ ప్రకారం పోషకాహారం అందిస్తూ వసతి సౌకర్యాలు క ల్పిస్తోంది.



ఆశ్రమ పాఠశాలలపై పటిష్ట పర్యవేక్షణ ద్వారా గిరిజన విద్యార్థులకు మెరుగైన పోషకాహారం, విద్యనందించాలని ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒక్కో ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సం ఖ్యకు అనుగుణంగా ఆరుకు తగ్గకుండా సీసీ కెమెరాలు, డీవీఆర్, మానిటర్‌లను ఏర్పాటు చేస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమాల్లో ఇప్పటికే 40శాతం పాఠశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయినట్లు తెలిసింది.

ఆశ్రమం ప్రధాన ద్వారం, సరుకుల గది, మైదానం, వరండాలు, చుట్టు పక్కల ప్రాంతాలు కవర్‌ అయ్యేలా ఏర్పాటు చేస్తూ కార్యాలయ గదిలో టీవీలకు అనుసంధానం చేయడం ద్వారా సిబ్బంది నిత్యం పర్యవేక్షణ చేసేలా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పాఠశాలపై నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టింది. ఇంటర్‌నెట్‌ లేదా వైఫై సాయంతో ప్రత్యే క ఐపీల ద్వారా నేరుగా డీటీడీవో కార్యాలయానికి అక్క డి నుంచి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యాలయానికి అనుసంధానం చేయనున్నారు. అంతేకాకుండా అధికా రుల స్మార్ట్‌ఫోన్లలో ప్రత్యేక యాప్‌ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేలా గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. 

మహిళా సిబ్బంది హర్షం, బాలికలకు భరోసా..
ఆశ్రమ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై ఆశ్రమాల్లో విధులు నిర్వహించే మహిళా సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలికలకు గిరిజన సంక్షేమశాఖ పూర్తి స్థాయి భద్రత కల్పిస్తుందని బాలికల తల్లిదండ్రులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా బాలికల ఆశ్రమ పాఠశాలల్లో బాలికలపై వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం నార్నూర్‌లోని బాలికల ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న విజయ్‌కుమార్‌ అనే ఉపాధ్యాయుడు గిరిజన బాలికలపై అసభ్యకరంగా వ్యవహరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆశ్రమాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుతో విధులు నిర్వహించే మహిళా సిబ్బందికి, బాలికల భద్రతకు భరోసా ఏర్పడనుంది. 

డుమ్మా సిబ్బందికి గుబులు..
గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలోని ఆశ్రమ పాఠశాలలు అంటేనే అక్రమాలకు నిలయమని ఎన్నో ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగా చా లా మంది సిబ్బంది ఆశ్రమాల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించడం కంటే హెచ్‌డబ్ల్యూవో (వార్డెన్‌)లుగా విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూ పిస్తుంటారు. ఇందుకోసం ఉన్నతా«ధికారులపై రాజకీయంగా, ఇతర రకాలుగా ఒత్తిడి తీసుకువచ్చి హెచ్‌డబ్ల్యూవోలుగా కొనసాగుతున్నవారు ఉన్నారు. చాలా చోట్ల విద్యార్థులకు పెట్టే మెనూలో కోత పెట్టి బి య్యం, ఇతర నిత్యావసర వస్తువులను పక్కదారి పట్టిస్తూ పలువురు సిబ్బంది అక్రమాలకు పాల్పడిన సం దర్భాలున్నాయి.

అలాగే ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహించే బోధన, బోధనేతర సిబ్బంది వంతులవారీగా ఆశ్రమాల్లో విధులు నిర్వహిస్తున్న సంఘటనలున్నాయి. జిల్లాలో ఓ ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహించే జూనియర్‌ అసిస్టెంట్‌ నెలల తరబడి వి ధులకు హాజరు కాకుండా రిజిష్టర్‌లో వేరే సిబ్బందితో తన సంతకం పెట్టిస్తూ సొంత పనులు చేసుకుంటున్నారనే ప్రచారం ఉంది. సిబ్బంది తరచూ ఆశ్రమాలకు ఎగనామం పెడుతూ సొంత వ్యాపారాలు, వ్యవసాయం లాంటి  పనులు చేసుకుంటున్నారు. అధికా రులకు తెలిసిన పైరవీలు, రాజకీయ ఒత్తిడిల కారణంగా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రతీ ఆశ్రమ పాఠశాలలో సీసీ నిఘా ఏర్పాటు కావడంతో ఆశ్రమాల్లో చోటు చేసుకునే అక్రమాలకు అడ్డుకట్ట పడడంతో విధులకు ఎగనామం పెట్టే సిబ్బంది క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో విద్యార్థులకు మేలు జరగనుంది.

నిరంతర పర్యవేక్షణకు అవకాశం
ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల విషయంలో మాకు ఎలాంటి సమాచారం లేదు. గిరిజన సంక్షేమ శాఖ కార్యాల యం నుంచి నేరుగా ఏర్పాటు చేస్తున్నారు. ఆశ్రమాల్లో సీసీల ఏర్పాటు ద్వారా పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణకు అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనంతో పాటు నాణ్యమైన విద్య అందనుంది. సీసీల నిఘాతో గిరిజన విద్యార్థులకు అన్ని రకాలుగా మేలు జరగనుంది.
– పోషం, గిరిజన సంక్షేమశాఖ, డీటీడీవో, ఐటీడీఏ

జిల్లాలవారీగా ఆశ్రమ పాఠశాలలు

జిల్లా పేరు            ఆశ్రమ, వసతి గృహాలు    విద్యార్థులు
ఆదిలాబాద్‌                   54                       19,706
కుమురంభీం                46                        12,327
మంచిర్యాల                 17                          3,359
నిర్మల్‌                       17                          4,940 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement