ఆరోపణలు...
పచ్చ అరటి మొక్కల పంపిణీ దగ్గర నుంచి డ్రిప్ మెటీరియల్ కొనుగోలు వరకూ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేయకముందే దాదాపు లక్షా 10 వేల మొక్కలు చనిపోవడమే దీనికి నిదర్శనం. ఈ వ్యవహారం పై విచారణ జరపాలని ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, రాజన్నదొర కోరగా, కేంద్రమంత్రి అశోక్ గజపతి ఆదేశించారు.
పార్వతీపురం : ఐటీడీఏ పరిధిలో సాగు కోసం గిరిజన రైతులకు పంపిణీ చేసిన 1.53 లక్షల టిష్యూకల్చర్ బనానా (టి.సి.బనానా, పచ్చ అరటి) మొక్క ల్లో, సుమారు 1.10 లక్షల మొక్కలు నాటకముందే చచ్చిపోయాయి. ఒక్కొక్క మొక్కను రూ.12ల చొప్పున, మొత్తం 1.53 లక్షల మొక్కలు కొనుగోలు చేసిన అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే వాటిని రైతులకు పంపిణీ చేశారు. తొందరపాటు నిర్ణయాలతో ఐటీడీఏ హార్టి కల్చర్ అధికారులు లక్షలాదిరూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
లబ్ధిదారుల ఎంపిక కూడా జరపగకముందే 1.53 లక్షల మొక్కలను లారీలతో తెప్పించిన అధికారులు, అసలు టి.సి.బనానా ఈ ప్రాంతానికి అనుకూలమైనదా...? కాదా...? రైతులకు డ్రిప్ ఉందా...? అనే ఆలోచన లేకుండా...హడావుడిగా నోటికొచ్చిన పేర్లతో లబ్ధిదారుల జాబితాను తయారు చేసి పంపిణీ చేసేశారు. రూ.10 లు విలువ చేసే ఒక్కొక్క మొక్కను రూ.12లకు నకిలీ బిల్లుతో పేమెంట్స్ జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలంలో ఐదెకరాలలో వేసేందుకు ఐదుగురు రైతులకు 7,200 మొక్కలు పంపిణీ చేయగా, దాదాపు 5వేల మొక్కలు నాటక ముందే చనిపోయాయి. కురుపాం మండలంలో 6.5ఎకరాలలో వేసేందుకు ఐదుగురు రైతులకు 9,360 మొక్కలు పంపిణీ చేయగా, సుమారు ఏడు వేల మొక్కలు చనిపోయాయి. జియ్యమ్మవలస మండలంలో 6.5ఎకరాలలో వేసేందుకు పది మంది రైతులకు 9,360 మొక్కలు పంపిణీ చేయగా, అందులో 8,500మొక్కల వరకు చనిపోయాయి.
కొమరాడ మండలంలో 28 ఎకరాలలో వేసేందుకు 27 మంది రైతులకు 40,680 మొక్కలు పంపిణీ చేయగా, అందులో 37 వేలు వరకు చనిపోయాయి. ఇక పార్వతీపురం, మక్కువ మండలాలలో వరుసగా 9, 21 ఎకరాలలో వేసేందుకు 8, 18 మంది రైతులకు 12,960, 30,240 మొక్కలు పంపిణీ చేయగా అవి నాటక ముందే చనిపోయాయి. ఆయా మండలాలలో ఒక్క మొక్క కూడా రైతులు నాట లేదు. పాచిపెంట మండలంలో రెండెకరాలకు గాను ఇద్దరు రైతులకు 2,880 మొక్కలు పంపిణీ చేయగా సుమారు 600 మొక్కలు వరకు చనిపోయాయి.
సాలూరు మండలంలో 29 ఎకరాలలో వేసేందుకు 20 మంది రైతులకు 40,320 మొక్కలు పంపిణీ చేయగా, అందులో సుమారు 10వేల మొక్కలు చనిపోయాయి. ఇలా ఎనిమిది మండలాలలో నాటకుండానే దాదాపు 1.10లక్షల మొక్కలు చనిపోయాయి. దీని వల్ల రూ.13.20 లక్షల ప్రజాధనం వృథా అయింది.
అంతా నాసిరకం..
ఇదిలా ఉండగా ఎనిమిది మండలాలకు గాను నాలుగు మండలాలలో మాత్రమే అది కూడా 30 ఎకరాలలో డ్రిప్ వేశారు. రైతులకు పంపిణీ చేసిన డ్రిప్ మెటిరీయల్ నాసిరకానివి కావడంతో వేసిన వారానికే పైపులు లీకులొస్తున్నాయని సాలూరు మండలం మరిపిల్లికి చెందిన జన్ని చిన్నారావు, సాలూరు బూర్జి గ్రామానికి చెందిన కొండగొర్రి నాగు తదితర రైతులు తెలిపారు. ఒక్కో డ్రిప్ నకు దాదాపు రూ.70వేలు వరకు వ్యయం చేసినట్లు సమాచారం. వీటి నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు(ఏపీ ఎంఐపీ) అధికారులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
చచ్చిపోయిన మొక్కలు, నాణ్యతా ప్రమాణాలు చూడకుండా రైతులకు అప్పగించిన డ్రిప్ వల్ల వచ్చిన లక్షలాది రూపాయల నష్టానికి ఎవరు బాధ్యులనేదానిపై సంబంధిత అధికారులు గిరిజన ప్రజలకు సమాధానమివ్వాలని వైఎస్సార్ సీపీ కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గతంలో డిమాండ్ చేశారు. లక్ష్యం నెరవేరకుండానే సొమ్ము ఖర్చుయిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టి.సి.బనానా ఐటీడీఏకు పరిచయం చేసిన ఫీల్డు ఆఫీసరు మొదలుకొని, పందిరి పెండాల్స్‌కు వైర్‌ను కొనుగోలు చేసే రిటైల్ ఐరన్ షాపు, స్వీట్ కార్న్ విత్తనాలు సరఫరా చేసే ఫీల్డు ఆఫీసరు తదితరుల అనకాపల్లికి చెందిన వారు కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారిది కూడా అనకాపల్లి కావడం విశేషం.
చచ్చిపోయిన లక్ష్యం!
Published Sat, Jul 25 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM
Advertisement
Advertisement