ఐటీడీఏలో ప్రొటోకాల్ ఉల్లంఘన
పార్వతీపురం టౌన్ : ‘‘మేమంటే అంతచులకనా...ప్రొటోకాల్ పాటించ రా, ఎమ్మెల్యే అంటే గౌరవంలేదా’’ అంటూ కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, అరకు ఎంపీ కొత్తపల్లి గీత శనివారం ఐటీడీఏ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా సమావేశం హాల్ నుంచి బయటకు వచ్చేశారు. పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో సబ్-ప్లాన్ పరిధిలోని అన్ని శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు ఎంపీ, ఎమ్మెల్యే ఐటీడీఏ కార్యాలయూనికి వచ్చారు. అయితే ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి కుర్చీని వేదిక కిందన, అధికారుల పక్కన వేశారు.
దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ...ఎస్టీ ప్రజాప్రతినిధులను ఇలా అవమానిస్తారంటూ సమీక్ష సమావేశం హాల్ నుంచి బయటకు వచ్చేశారు. ఆమెతో పాటు చినమేరంగి సర్పంచ్ శత్రుచర్ల పరీక్షిత్ రాజు నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఐటీడీఏ ఏపీఓ వసంతరావు ఎమ్మెల్యేను ప్రాధేయపడేందుకు వచ్చా రు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా ఎమ్మెల్యేతో పాటు సమావేశపు హాల్ నుంచి బయటికి వచ్చి, ఎమ్మెల్యేకు మద్ద తు తెలుపుతూ ఐటీడీఏ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. మిగతా ఐటీడీఏల కంటే ఇక్కడ పాలన భిన్నంగా సాగుతోందని, అధికారులు తమకు నచ్చినట్టు వ్యవహరిస్తున్నార ని ఆరోపించారు.
ఏపీఓ ఎంపీ, ఎమ్మెల్యేలకు సర్ధి చెప్పేందు కు యత్నించగా, గిరిజన ఎంపీ, ఎమ్మెల్యేలంటే అంత చులకనా...?, ప్రజా సమస్యల పట్ల సమీక్ష నిర్వహించేందుకొస్తే ఖాతరు లేదా...? అన్నారు. ఎంపీ తన ల్యాప్‌టాప్ నుంచిప్రొటోకాల్ జీఓను తీసి చూపించారు. ఇది కేవలం ప్రజాప్రతినిధులను అవమానపర్చడమే అన్నారు. పీఓ బయటికొచ్చి క్షమాపణ చెప్తేనే సమీక్ష సమావేశానికి వస్తామ ని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శుక్రవారం కురుపాంలో జరిగిన సర్పంచ్‌ల సమావేశానికి కూడా తన ను ఆహ్వానించలేదన్నారు. ఐటీడీఏ తమ సొంత జాగీరులా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఒకానొక సమయంలో నేలపై బైఠాయించి ఆందోళన చేసేందుకు సన్నద్ధమయ్యారు.
ఇంతలో పీఓ రజిత్ కుమార్ సైనీ తన చాంబర్ నుంచిబయటికొచ్చి ఎమ్మెల్యే, ఎంపీలకు సర్ధి చెప్పారు. ఎంపీ మాట్లాడుతూ సమీక్ష ఉంటుందని ముందుగానే సమాచారమిస్తే, అసలు అధికారులు రాలేదన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలంటే వైఎస్సార్ సీపీ నాయకులుగా చూస్తున్నారా...? సబ్-కలెక్టర్, తహశీల్దార్లు, ఎంపీడీఓలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆమె అడిగిన ప్రశ్నలకు పీఓ సామరస్యంగా సమాధానం చెప్పడంతో వారు శాంతించా రు. కాగా గతంలో కూడా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో జరిగిన ఐటీడీఏ పాలకవర్గం సమావేశంలో కూడా అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా రాజన్నదొరను అవమానించారు.