సాక్షి ప్రతినిధి, విజయనగరం :ఐటీడీఏ పరిధిలో గల ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆరోగ్య, పౌష్టికాహార కేంద్రాల కోసం రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన బొమ్మలు (ఆటవస్తువులు) నేటికీ కేంద్రాలకు చేరలేదు. వాటి కోసం ఖర్చు పెట్టిన సుమారు రూ.36 లక్షలు ఏమయ్యాయో ఎవరికీ తెలియడం లేదు. వీటిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సంబంధిత రికార్డుల్ని సమర్పించాలని సెర్ఫ్ అడిషనల్ సీఈఓ మురళి జారీ చేసిన ఉత్తర్వులకు స్పందనేంటో అంతు చిక్కడం లేదు. ఇప్పుడా కేంద్రాల్ని మూసేయమని ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు తెలిసిందే. అదే జరిగితే ఆ రూ.36లక్షలు పక్కదారి పట్టినట్టేనా? అక్రమార్కుల్ని వదిలేసినట్టేనా? ఇప్పుడా అనుమానం సంబంధిత వర్గాల్లో కలుగుతోంది.
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం ఐటీడీఏ పరిధిలో గల గ్రామాల్లో ఆరోగ్య, పౌష్టికాహార కేంద్రాలను సెర్ఫ్ ఏర్పాటు చేసింది. గ్రామైక్య సంఘాలకు వీటి నిర్వహణ బాధ్యతల్ని అప్పగించింది. ఆయా కేంద్రాలకు పలు సౌకర్యాలను కల్పించింది. గర్భిణులు, బాలింతల పౌష్టికాహారంపై అవగాహన కల్పించేందుకు టీవీలు ఇతరత్రా వస్తువులను సమకూర్చింది. ఇందులో భాగంగానే 2013 ఏప్రిల్‌లో చిన్నారులకు ఆట వస్తువులను సమకూర్చేందుకు నిర్ణయించింది. వాటి కోసం ఐటీడీఏ పీఓగా అంబేద్కర్ ఉన్న సమయంలో ట్రైబల్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ యూనిట్ అధికారులు టెండర్లను పిలిచారు. తక్కువ కోట్ చేశారని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రామకృష్ణ ఏజెన్సీకి ఆట వస్తువుల సరఫరా బాధ్యతల్ని అప్పగించారు. ఒక్కొక్క కేంద్రానికి 25 రకాల ఆట వస్తువుల్ని రూ.14,702లకు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఈ విధంగా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో గల 213 కేంద్రాలకు రూ.36లక్షలతో ఆట వస్తువుల్ని సమకూర్చేందుకు ఇండెంట్ ఇచ్చారు. అయితే, ఆ ఆట వస్తువులు ఒప్పందం మేరకు కేంద్రాలకు చేరలేదు. వీటిలో అక్రమాలు జరిగాయని అప్పట్లో ఆరోపణలొచ్చాయి.
ఈ నేపథ్యంలో 2014 జనవరి 27న సెర్ఫ్ అడిషనల్ సీఈఓ ఎ.మురళి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఆట వస్తువుల ప్రొక్యూర్‌మెంట్‌లో అవకతవకలు జరిగినట్టు తమ దృష్టికొచ్చిందని, వాటికి సంబంధించిన రికార్డులు, గ్రామైక్య సంఘాల తీర్మానాలను స్టేట్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ యూనిట్(ఎస్‌పీఎంయూ)కి అదే నెల 30వ తేదీ నాటికి అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఆ ఉత్తర్వులు ఎంత వరకు అమలుకు నోచుకున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. అసలు అడిషనల్ సీఈఓ ఆదేశించినట్టుగా రికార్డులు సమర్పించారా? ఒకవేళ సమర్పిస్తే అవతవకల నిగ్గు తేల్చారా? తేలితే బాధ్యులపై తీసుకున్న చర్యలేంటి? లేదంటే అడిషనల్ సీఈఓ ఆదేశాలను భేఖాతర్ చేసి రికార్డులే సమర్పించలేదా? అన్న విషయంపై ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదు. ఈ ఉత్తర్వుల విషయాన్ని పక్కన పెడితే ఆ 25రకాల ఆట వస్తువులు నేటికీ సంబంధిత 213 కేంద్రాలకు చేరలేదు. దాదాపు రెండేళ్లు గడుస్తున్నా చేరకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు మరిచిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే రూ.36 లక్షలు పక్కదారి పట్టినట్టు అయ్యింది.
విశేషమేమిటంటే ఇప్పుడా కేంద్రాలను మూసేయాలని సెర్ఫ్ నిర్ణయించినట్టు తెలిసింది. ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు తెలియవచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్న సమయంలో ఆరోగ్య, పౌష్టికాహారం కేంద్రాలెందుకని, వృథా ప్రయాస తప్ప మరేది లేదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మూసేయాలన్న నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. అదే జరిగితే కేంద్రాలకు ఆటవస్తులువు సరఫరాకాని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ లెక్కన అవకతవకలకు పాల్పడిన వ్యక్తుల్ని వదిలేసినట్టేనా? వాటి కొనుగోలు కోసం కేటాయించిన రూ.36 లక్షలు గోల్‌మాల్ జరిగినట్టేనా? అనే అనుమానం ఇప్పుడందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇదే విషయమై ట్రైబల్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ యూనిట్(టీపీఎంయూ) ఏపీడీ మురళిని ‘సాక్షి’ మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.
వినండి బొమ్మల గోల కనండి ఐకేపీ లీల !
Published Tue, Mar 3 2015 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM
Advertisement