ఉత్తేజం.. ఉత్సాహం | Good Health With Daily Exercise | Sakshi
Sakshi News home page

ఉత్తేజం.. ఉత్సాహం

Published Sat, Feb 23 2019 8:28 AM | Last Updated on Sat, Feb 23 2019 8:28 AM

Good Health With Daily Exercise - Sakshi

విజయనగరం మున్సిపాలిటీ: ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఒత్తిడి పెరిగిపోతోంది. వేళాపాళా లేని ఆహారపుటలవాట్లతో ఆరోగ్యం పాడవుతోంది. నిద్ర లేమితో ఏకాగ్రత లోపిస్తోంది. వాటన్నిటి నుంచి బయటపడే తారక మంత్రం వ్యాయామం. రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో నడిచేవారు కొందరైతే.. అందుబాటులో ఉన్న జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసే వారు మరికొందరు. ఒక్క రోజు కొద్దిగా వ్యాయామం చేస్తే చాలు కొందరు అలసిపోతుంటారు. మళ్లీ కోలుకోవడానికి రెండు, మూడు రోజులు కావలసిందే. దీంతో విరామం ఇచ్చేస్తారు. ఫలితంగా ఒంటి నొప్పులు మొదలవుతాయి. అలా వారం, రెండు వారాలు సెలవులు ప్రకటిస్తారు. కొన్ని మెలకువలు పాటిస్తే ఎలాంటి సమస్యల్లేకుండా వ్యాయామాన్ని కొనసాగించవచ్చు.

మైదానాల్లో వ్యాయామాలు
విజయనగరం రాజీవ్‌ క్రీడా మైదానం, అయోధ్య మైదానం, విజ్జి స్టేడియంలో రోజూ వందల సంఖ్యలో పట్టణ వాసులు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్, జాకింగ్, ఇతర వ్యాయామాలు చేస్తుంటారు. వీరితో పాటు కాలనీలు, ప్రధాన మార్గాల వెంబడి కొందరు నడుస్తుంటారు. గతంలో పోల్చుకుంటే ఇటీవల కాలంలో పట్టణ ప్రజల జీవన సరళిలో గణనీయమైన మార్పు వచ్చింది.

అంతరాయాలు లేని నిద్రతో..
శరీరానికి, మనసుకు తగిన విశ్రాంతి లభించేది నిద్రలోనే. జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. వ్యాయామం చేసేవారు రోజూ 6నుంచి 8గంటలు ఎలాంటి అంతరాయాలు లేకుండా నిద్రపోవాలి. రోజూ ఒక నిర్ణీత సమయం నిద్రకు కేటాయించాలి. దీనివల్ల శరీరం అలసటకు గురవకుండా ఉంటుంది. మర్నాడు కొత్త శక్తిని పుంజుకుంటారు.

పౌష్టికాహారం
వర్కవుట్స్, జిమ్‌లో కసరత్తులు, నడక చేసే వారు సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. వ్యాయామం వల్ల శరీరంలో శక్తి నిల్వలు తగ్గిపోతాయి. తిరిగి పొందాలంటే విటమిన్లు, ఖనిజాలు అవసరమవుతాయి. రోజువారీ తీసుకునే ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. కిలో శరీర బరువుకు 2 నుంచి 2.5 గ్రాముల ప్రోటీన్లు అవసరం. సూక్ష్మ పోషకాలు 150 శాతం ఉండాలి. కొందరు వ్యాయామం తీవ్రంగా చేస్తూ అలసిపోతుంటారు. ఇలా చేయడం వల్ల రోజూ కొనసాగించడం సాధ్యం కాదు. వారంలో ఒకటి రెండు రోజు లు సాధారణ వ్యాయామాలు చేయాలి. తీవ్రతను తగ్గిస్తూ ఉండాలి. దీనివల్ల మర్నాడు కాస్త ఎక్కువగా చేయడానికి సరిపడా శక్తి వస్తుంది.

ధ్యానంతో ఉల్లాసం
ఏ పరిస్థితులనైనా ప్రశాంతంగా, ప్రణాళికతో ఎదుర్కొంటే ఒత్తిడి దరిచేరదు. ధ్యానం ఇందుకు ఉపకరిస్తుంది. ఇక రోజూ ఉల్లాసంగా ఉంటే మానసిక ఆనందం కలిగి ఎక్కువ శ్రమ పడ్డామనే భావన పోతుంది. కుటుంబంతో సినిమాలు, పార్కుకు వెళ్లడం, విహార యాత్రలు చేయడం ఇందుకు దోహదపడతాయి.

మంచి నిద్రతో మేలు
వ్యాయామం అలసట నుంచి కోలుకోవాలంటే చక్కని నిద్ర ఉండాలి. సరైన సమయానికి పోషకాహారం తీసుకోవాలి. ఎంతసేపు, ఎలాంటి కసరత్తులు చేశామనే దానిపై ఆధారపడి సమతుల ఆహారం తీసుకోవాలి. కండరాలకు ఎంత శ్రమ కలిగిస్తామో విశ్రాంతిలో అంత మరమ్మతులు జరుగుతాయి. సాధారణంగా వారంలో ఆరు రోజులు కసరత్తులు చేయాలని సూచిస్తాం. ఒక రోజు విశ్రాంతి ఇస్తే ఆ సమయంలో జీవక్రియలు బాగా జరుగుతాయి. 21 రోజులకు ఒకసారి వర్కవుట్‌లో మార్పులు చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి.- ధనుంజయ్, ఫిట్‌నెస్‌ శిక్షకుడు, విజయనగరం.

ఒంటరి నడక మంచిది
బరువు తగ్గాలనుకునే వారు ఒంటరిగా నడిస్తేనే ఎక్కువ క్యాలరీలు తగ్గుతాయి. స్నేహితులతో కలిసి వెళ్ళినా.. నడిచినప్పుడు మాట్లాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. మొక్కుబడిగా నడవడం వల్ల మార్పు ఏమీ కనిపించదు. ప్రారంభంలో నిదానంగా  చేస్తూ.. రోజు రోజుకు నడక వేగం, నడిచే దూరం పెంచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలసట అనిపిస్తే.. కాసేపు ఆగి నడక వేగాన్ని క్రమక్రమంగా పెంచుకోవాలి. ఒంటరిగా నడవటం వల్ల కొంత ప్రశాంతతో పాటు వేగంగా నడుస్తారు.– కె.కృష్ణ, వాకర్స్‌ క్లబ్‌ ప్రతినిధి, కంటోన్మెంట్‌.

దినచర్యలో నడక భాగం
రోజూ నడవటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బరువు త్వరగా తగ్గాలనుకునే వారు, ఒత్తిడి నుంచి బయట పడాలనుకునే వారు నడక కోసం క్రమం తప్పకుండా రోజూ అర్ధగంటైనా  కేటాయించాలి. దినచర్యలో నడక ఓ భాగం కావాలి. రోజూ నడిస్తే శరీర బరువులో తప్పనిసరిగా మార్పు తీసుకొస్తుంది. మధుమేహ వ్యాధిని సైతం నియంత్రణలో ఉంచుకోవచ్చు.  – శివరామకృష్ణ, వాకర్, విజయనగరం

ఆహార నియమాలు పాటించాలి
నడకతో పాటు ఆహార నియామాల్లో కొద్ది మార్పులు చేస్తే శరీర బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. ఆహారం తీసుకోవడం, సమయపాలన పాటించడం, ఎక్కువ కొవ్వు పదార్థాలను తీసుకోకపోవటం మంచిది. పండ్లు, తాజా కూరగాయలు రోజు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.– డాక్టర్‌ భార్గవ్, విజయనగరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement