రాజాంలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.
ఐటీడీఏ పీఓ బంధువులు ఇండ్లలో ఏసీబీ దాడులు
Published Tue, Nov 1 2016 11:30 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
రాజాం : రాజాం నగరపంచాయతీ పరిధిలోని అమ్మవారి కాలనీలో సీతంపేట ఐటీడీఏ పీఓ జల్లేపల్లి వెంకటరావుకు చెందిన బంధువుల ఇళ్లల్లో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రాజమండ్రి ఏసీబీ సీఐ సూర్యమోహన్‌రావుతోపాటు సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇక్కడనివాసం ఉంటున్న జల్లేపల్లి వెంకటరావు సోదరుడు శ్రీనివాసరావుకు వరసకు మామ అయిన ఎల్.సత్యన్నారాయణ ఇంటితోపాటు మరో ఇంట్లో సోదాలు నిర్వహించారు.
జల్లేపల్లి వెంకటరావు బంధువులకు చెందిన 1.50 కోట్లు అక్రమాస్తులకు సంబంధించిన దస్త్రాలను గుర్తించడంతోపాటురెండు ఇళ్లు, ఒక కల్యాణమండపం ఉన్నట్లు గుర్తించామని సీఐ విలేకరులకు తెలిపారు. దాడులు జరుగుతాయని ముందుగా గుర్తించిన వీరంతా ఇండ్లకు తాళాలువేసి వెళ్లిపోగా కొద్దిసేపటి తరువాత బంధువులను రప్పించి సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. వెంకటరావు భార్య పేరుతోపాటు ఆయన బంధువుల పేరుమీద ఉన్న ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లను సేకరించి ఉన్నతాధికారులకు అందజేస్టున్నట్లు తెలిపారు. ధర్యాప్తు అనంతరం అసలు విషయాలు బయటపడతాయని ఈ సందర్భంగా సీఐ విలేకరులకు తెలిపారు.
అలజడి.
ఇదిలా ఉండగా జల్లేపల్లి వెంకటరావు గతంలో రాజాంతోపాటు సంతకవిటి, వంగర మండలాల్లో తహశీల్దార్‌గా విధులునిర్వహించారు. ఆయన బంధువుల ఇళ్లల్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయని తెలియడంతో మూడు మండలాల్లోని రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో ఆయనతో కలసి విధులు నిర్వహించిన రెవెన్యూ అధికారులు ఏం జరుగుతుందోనని ఆరా తీశారు. ఇటీవల రాజాంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఏసీబీ దాడులు అధికమవడం, రెవెన్యూ అధికారులను టార్గెట్ చేయడంతో రాజాం నియోజకవర్గం మొత్తం హాట్‌టాపిక్‌గా మారింది. రెవెన్యూ అధికారులు మరింత అప్రమత్తం అవడంతోపాటు ఏసీబీ అధికారులు సోదాలుపై చర్చించుకోవడం మొదలైంది.
Advertisement