మాట్లాడుతున్న సోయం బాపూరావు
ఉట్నూర్(ఖానాపూర్): ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకూ ఆదివాసీలందరూ ఒక్కటై పోరాటం చేస్తారని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావ్ స్పష్టంచేశారు. మరో ఇంద్రవెల్లి ఘటన పునరావృతం కాకముందే ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఆదివాసీ నాయకులపై ఇటీవల నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం నుంచి ఉట్నూర్‌లోని ఐటీడీఏ వరకు సుమారు 19 కిలోమీటర్ల మేర ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిత్రు, ఆర్డీవో విద్యాసాగర్‌కు వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సోయం బాపూరావ్ మాట్లాడుతూ... ‘1976లో నాటి ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాయి. నాటి నుంచి అసలైన ఆదివాసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతోంది. షెడ్యూల్డ్ తెగలో గోండు, కోలాం, తోటి, నాయక్‌పోడ్, మన్నెవార్, కోయ, ప్రధాన్, ఆంద్ జాతులను రాజ్యాంగం ఆదివాసీలుగా గుర్తించి అభివృద్ధి ఫలాలు అందించాలని పేర్కొంది. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చిన నాటి నుంచి విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, ఆర్థిక ఫలాలు నిజమైన ఆదివాసీలకు అందకుండా పోతున్నాయి’అని అన్నారు. ఇటీవల ఆదివాసీ నాయకులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, జోడేఘాట్‌లో కుమ్రం భీం వర్ధంతి నిర్వహణలో విఫలమైన జిల్లా కలెక్టర్ చంపాలాల్, లంబాడీ అధికారులను సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తుంటే అధికారులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.
గిరిజనేతరులకు వ్యతిరేకం కాదు..
ఆదివాసీలు గిరిజనేతరులకు వ్యతి రేకం కాదని, తమ మనుగడ కోసం చేస్తు న్న ఉద్యమానికి గిరిజనేతరులు మద్దతు ఇవ్వాలని బాపూరావ్ పిలుపునిచ్చారు. తమ ఉద్యమానికి మద్దతు ఇస్తే గిరిజనేతరులకు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఏజెన్సీలో ఆదివాసీలు, గిరిజనేతరుల మధ్య చిచ్చుపెట్టడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. వచ్చేనెల 9న ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే ప్రధాన డిమాండ్‌తో హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నాగేశ్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మా బోజ్జు, ఆంద్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ముకాడే విష్ణు, గోడ్వాన రాయిసెంటర్ జిల్లా అధ్యక్షుడు మెస్రం దుర్గు, కోలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావ్, ఏఎస్‌యూ కుమురం భీం జిల్లా ఇన్‌చార్జి కోట్నాక్ గణపతి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి భూపతి, ప్రధాన్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు అర్క పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment