- తరలింపునకు మైనర్ ఇరిగేషన్ శాఖ ఆదేశం !
- హన్మకొండకు ములుగు డివిజన్ తరలింపు
- ఐటీడీఏలోనే ఉండాలని పీఓ ప్రయత్నాలు
భూపాలపల్లికి స్పెషల్ ఎంఐ డివిజన్
Published Wed, Aug 31 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
వరంగల్ : ఏటూరునాగారం ఐటీడీఏలోని స్పెషల్ ఎంఐ డివిజన్ భూపాలపల్లికి తరలించాలని మైనర్ ఇరిగేషన్ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాల పునర్విభజనతో నీటిపారుదల శాఖలో కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. జిల్లాలో వరంగల్, ములుగు, మహబూబాబాద్‌తో పాటు ఏటూరునాగారం ఐటీడీఏలో స్పెషన్ ఎంఐ డివిజన్లు ఉన్నాయి. ములుగులోని డివిజన్ కార్యాలయాన్ని భూపాలపల్లికి, అదే రెవెన్యూ డివిజ న్ పరిధిలోని ఏటూరునాగారం ఐటీడీఏలో ఉన్న స్పెషల్ ఎంఐ డివిజన్‌ను వరంగల్‌కు తరలించాలని అధికారులు ప్రతిపాదించారు. నాలు గు జిల్లాలుగా ఏర్పడితే ఇప్పటికే మహబూబాబాద్‌లో ఒకటి, హన్మకొండలో వరంగల్ డివిజ న్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. కొత్తగా ఏర్పడే భూపాలపల్లికి ములుగు, వరంగల్‌కు స్పెషల్ ఎంఐ డివిజన్‌ను తరలిస్తే బాగుంటుం దని జిల్లా అధికారులు భావించారు. అయితే ములుగులోని డివిజన్‌ను వరంగల్‌కు, ఏటూరునాగారంలోని స్పెషల్ ఎంఐ డివిజన్‌ను భూపాలపల్లికి తరలించాలని తాజాగా ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగానికి సూచించినట్లు తెలిసింది.
ఐటీడీఏలోనే ఉంచాలని పీఓ లేఖ..
ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన రైతుల అభివృద్ధికి ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎంఐ డివిజన్‌లో యథావిధిగా కొనసాగించాలని కోరుతూ పీఓ అమయ్‌కుమార్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఏజెన్సీ ప్రాంతాలను సాధారణ ఎంఐ డివిజన్లలో కొనసాగిస్తే గిరిజన ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని ఆదివాసీ సంఘాల నాయకులు అంటున్నారు. స్పెషల్ ఎంఐ ఉంటే ప్రత్యేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇచ్చే అవకాశాలున్నాయి. జనగామ నియోజకవర్గంలోని మండలాలను యాదాద్రి, సిద్దిపేట జిల్లాల్లో విలీనం చేయడం వల్ల వరంగల్ డివిజన్ కార్యాయంపై పని భారం తగ్గినట్లే. అందువల్ల నాలుగు జిల్లాలుగా ఏర్పడినా, వరంగల్‌లోని డివిజన్ కార్యాలయం రెండు జిల్లాల్లోని అభివృద్ధి పనులను పర్యవేక్షించే అవకాశాలను జిల్లా యంత్రాంగం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నూతనంగా ఏర్పాటయ్యే జిల్లాల్లో ఈఈలే బాస్‌లని, నాలుగు జిల్లాలకు ఎస్ ఈ కార్యాలయం పనులు పర్యవేక్షిస్తుందని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement