కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం
చంద్రబాబు పర్యటనపై జేసీ సమీక్ష
చింతూరు : జిల్లాలో చింతూరు కేంద్రంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీడీఏ కార్యాలయం ఈ నెల 13న ప్రారంభం కానుంది. దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. ఐటీడీఏతో పాటు ట్రెజరీ కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారని చెప్పారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై జేసీ చింతూరులో డివిజన్, విలీన మండలాల అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసే ప్రదర్శనలో వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉపాధిహామీ ద్వారా చేపట్టిన ఫారంపాండ్, ఊటకుంట, సీసీ రహదారి పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారని తెలిపారు. ఉపాధి హామీ పథకం కూలీలతో ముఖ్యమంత్రి చర్చాగోష్టి నిర్వహిస్తారని, గ్రామ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలను సీఎం పరిశీలించే అవకాశముందని జేసీ తెలిపారు.
శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు సంబంధించి శిలాఫలకాలను ఏర్పాటుతోపాటు ట్రైకార్ ద్వారా ఉపకరణాల పంపిణీ, బ్యాంకు లింకేజీలను సిద్ధం చేయాలని ఆదేశించారు. విలీన మండలాల సమస్యలతోపాటు, పోలవరం పునరావాస సమస్యలపై కూడా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. జీసీసీకి చెందిన పెట్రోలుబంకు, గోడౌనుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని, గురుకుల పాఠశాల ఆవరణలో బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని, ఉపాధిహామీ, వెలుగు శాఖల ఆధ్వర్యాన భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని ఆదేశించారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలను ముఖ్యమంత్రి సందర్శించి విద్యార్థులతో ఇష్టాగోష్టి నిర్వహించే అవకాశముందని జేసీ తెలిపారు. అనంతరం ఆయన బహిరంగ సభ వేదిక, ఐటీడీఏ నిర్మాణ పనులు, హెలిప్యాడ్ ఏర్పాటు ప్రదేశాలను పరిశీలించారు. జీసీసీ కార్యాలయం వద్ద దీపం పథకం గ్యాస్ కనెక్షన్‌లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి, డ్వామా పీడీ ఎ.నాగేశ్వరరావు, అడిషనల్ డీఎంహెచ్‌వో ప్రసాద్‌బాబు, డీఎస్‌వో ఉమామహేశ్వరరావు, గిరిజన సంక్షేమ ఈఈ నాగేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ లక్ష్మీపతి, ఏపీడీ శంకర్‌నాయక్, జెడ్పీటీసీ సభ్యులు కన్యకా పరమేశ్వరి, అరుణ, ఎంపీపీ చిచ్చడి మురళి తదితరులు పాల్గొన్నారు.
చింతూరు ఐటీడీఏ 13న ప్రారంభం
Published Thu, Apr 7 2016 1:06 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
Advertisement
Advertisement