సాక్షి, రాజమండ్రి/రంపచోడవరం :ఖమ్మం జిల్లా నుంచి పోలవరం ముంపు మండలాలు విలీనం అనంతరం జరిగిన తొలి ఐటీడీఏ తొలి పాలకవర్గ సమావేశంలో నాలుగు మండలాల సమస్యలే వేదికయ్యాయి. గ్రామాల్లో చదువు కుంటుపడింది. వైద్యం అందడం లేదు. కనీసం రవాణా సదుపాయం కరువైంది. మాస్టార్లు బడి వైపునకు చూడడం లేదు. పిల్లలు చదువులు మానేస్తున్నారు.. ఇలా చింతూరు, వీఆర్ పురం, కూనవరం మండలాల నుంచి వచ్చి ప్రజాప్రతినిధులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ‘మీకు ఏ లోటూ రానివ్వం.. మీ అభివృద్ధి అంతా మేం చూసుకుంటాం అంటేనే మీలో కలిసేందుకు ఇష్ట పడ్డాం. అధికారులు వచ్చి పోతున్నారు గానీ అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదు’ అంటూ అధికారులపై ధ్వజమెత్తారు.
రంపచోడవరం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం శనివారం ఐటీడీఏ సమావేశపు హాలులో ఐటీడీఏ చైర్మన్, కలెక్టర్ నీతూ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది.
సమావేశానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. మంత్రుల వద్ద విలీన మండలాల ప్రతినిధులు తమ గోడు వినిపించారు. కూనవరం మండలంలో ఆరు పాఠశాలలకు టీచర్లు లేరని, కేవలం అడమిక్ ఇనస్ట్రక్లర్లుతో బోధన సాగిస్తున్నారన్నారు. టాయిలెట్లు లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారని కూనవరం జెడ్పీటీసీ సభ్యురాలు కన్నెక పరమేశ్వరి వివరించారు. డ్రాపౌట్స్ బాల బాలికల కోసం ఏర్పాటు చేసిన కస్తూరిబా విద్యాలయంలో చిన్నారులకు రక్షణ లేకుండాపోయిందన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఆప్షన్ ఇచ్చిన ఉపాధ్యాయులు బదిలీల వంకతో పాఠాలు చెప్పడం మానేశారు. హాస్టల్‌ల్లో యూనిఫారాలు, కాస్మోటిక్స్ ఇవ్వడం లేదు, కనీసం విద్యార్థులకు చెప్పులు కూడా ఇవ్వడం లేదని మూడు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
అభివృద్ధికి సహకరించాలి
విలీన అనంతరం తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, నాలుగు మండలాల్లో 62 పంచాయతీలు సమస్యలతో ఏపీ ప్రభుత్వ సహకారం కోసం ఎదురు చూస్తున్నాయని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అధికారులను కోరారు. ప్రస్తుతం విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రం పేరుతో ధ్రువపత్రాలు ఇస్తున్నారని, దీనివల్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారన్నారు.
9న విలీన ప్రాంతాల సమస్యలపై
ప్రత్యేక సమావేశం
విలీన మండలాల్లోని సమస్యల పరి ష్కారానికి డిసెంబర్ 9న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. నెల్లిపాక మండలం ఎడబాకలో యువజన శిక్షణ కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మండలానికి ఒక ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలోగా విలీన గ్రామాల సమస్యలపై సర్వే చేసి నివేదిక సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిశోర్‌బాబు ఆదేశించారు. పాఠశాలల్లో బెంచీలు, ఇతర సామగ్రికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్టు జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు ప్రకటించారు. శాసన మండలి విప్ చైతన్యరాజు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్సీ రత్నాబాయి, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, పెందుర్తి వెంకటేష్, జేసీ ముత్యాలరాజు, పీఓ చంద్రుడు, అధికారులు పాల్గొన్నారు.
సమస్యల గళం
Published Sun, Nov 30 2014 1:08 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
Advertisement
Advertisement