పుష్కర శంఖారావం పూరిస్తారా!
సాక్షి, రాజమండ్రి :వచ్చే ఏడాది జూన్ 14న గోదావరి పుష్కరాలకు తెర లేవనుంది. ఈ మహాపర్వానికి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుష్కరాలపై చేయనున్న సమీక్ష ప్రాధాన్యం సంతరించుకొంది. ఆయన పుష్కరాల శంఖారావం పూరిస్తారని ఉభయ గోదావరి జిల్లాలవాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్కరాల ప్రారంభానికి పూర్తిగా మరో ఏడు నెలల సమయం కూడా లేదు. అయినప్పటికీ ఇప్పటివరకూ అధికారికంగా పనులు ప్రారంభం కాలేదు. పుష్కరాలపై నియమించిన కేబినెట్ సబ్ కమిటీ వారం క్రితం హైదరాబాద్‌లో సమావేశమై పనులు డిసెంబర్‌లో ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం వస్తూండడంతో పుష్కరాల పనులు ప్రారంభిస్తారని అందరూ భావిస్తున్నారు. అయితే సీఎం సమీక్షకు పుష్కరాలపై పూర్తి ప్రతిపాదనలు తీసుకురావాలని అధికారులను కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి సమీక్షకేపరిమితమవుతారా, లేక పనుల దిశగా కీలక ప్రకటన చేస్తారా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
ఇతర సమస్యల మాటేమిటో!
కాగా జిల్లాకు సంబంధించిన వివిధ సమస్యలపై సీఎం స్పందించాలని పలువురు కోరుతున్నారు.
రాజమండ్రిలో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికి ఇంకా స్థల సేకరణ పూర్తి కాలేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తాత్కాలికంగా తరగతులు ప్రారంభించేందుకు ఒక ప్రత్యేక బృందం జిల్లాలో పర్యటించింది. కానీ ఈ వ్యవహారం నేటికీ కొలిక్కి రాలేదు.
రాజమండ్రిలో సీటీఆర్‌ఐకి చెందిన సుమారు 22 ఎకరాల స్థలాన్ని వ్యవసాయ కళాశాలకు కేటాయిస్తున్నట్టు గతంలో కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఆ స్థలం స్వాధీనంపై ఇంతవరకూ అడుగు ముందుకు పడలేదు.ఆసియాలోనే రెండో అతి పెద్ద వంతెనగా పేరొందిన రాజమండ్రి - కొవ్వూరు రోడ్డు కం రైలు వంతెన నానాటికీ శిథిలమవుతోంది. రోడ్డుపై పడుతున్న గోతులను ఆర్‌అండ్‌బీ అధికారులు తాత్కాలికంగా పూడుస్తున్నారే తప్ప శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడం లేదు. వంతెన నిర్మాణ కంపెనీని సంప్రదించి రోడ్డు పైభాగాన్ని పునర్నిర్మిస్తామని అధికారులు చెప్పినా అది ఆచరణలోకి రాలేదు.
ోదావరిపై బ్రిటిష్ కాలంలో నిర్మించిన హేవలాక్ వంతెన ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. దీనిని పర్యాటకంగా తీర్చిదిద్దాలన్న డిమాండ్ మూడేళ్లుగా వస్తోంది. కానీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు. పుష్కరాల సందర్భంగానైనా ఈ వంతెనను రైల్వే శాఖ నుంచి స్వాధీనం చేసుకొని, అభివృద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.రాజమండ్రి, కాకినాడ నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని గతంలో ముఖ్యమంత్రి చెప్పారు. ఆ దిశగా ఇప్పుడు ఏదైనా ప్రకటనైనా చేస్తారేమోనని పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్కరాల నాటికి రాజమండ్రిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ వస్తోంది.