సాక్షి, రాజమండ్రి :పుష్కరాల పనుల కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కింద కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు ఇచ్చే నిధులను వెచ్చిస్తామని గతంలో కలెక్టర్ నీతూ ప్రసాద్ చేసిన ప్రకటన వివాదాస్పదమవుతోంది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పుష్కరాల కోసం రూ.వంద కోట్లు వెచ్చిస్తామని రాజమండ్రిలో నాలుగు నెలల క్రితం ప్రకటించారు. ‘ఈ నిధులు సరిపోతాయా?’ అని అటు అధికారులు చప్పరించగా ఇటు మీడియాలో విమర్శనాత్మక కథనాలు వచ్చాయి. దాంతో ఈ నిధులతో పాటు ఈ ఏడాది వచ్చే సీఎస్‌ఆర్ నిధులను కూడా పుష్కర పనులకు వెచ్చిస్తామని సెప్టెంబర్ 26న రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలోని వివిధ కార్పొరేట్ సంస్థలు సీఎస్‌ఆర్‌గా ఇచ్చే సుమారు రూ.25 కోట్లను పుష్కర పనులకు వెచ్చిస్తామని తెలిపారు.
ఆడిట్‌లో తప్పని అడ్డంకులు
కాగా పుష్కరాలకు సీఎస్‌ఆర్ నిధులు వెచ్చిస్తే ఆడిట్ పరమైన అభ్యంతరాలు ఎదురవుతాయని పలు కార్పొరేట్ సంస్థలు అభిప్రాయ పడుతున్నాయి. నిబంధనల ప్రకారం సీఎస్‌ఆర్ నిధులను శాస్త్రీయ దృక్పథంతో, సామాజిక సేవా కార్యక్రమాలకు మాత్రమే వెచ్చించాలి. అందుకు విరుద్ధంగా ఒక మత సంబంధ కార్యకలాపాలకు ఖర్చు చేస్తే అభ్యంతరాలు వస్తాయని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కువ మొత్తంలో సీఎస్‌ఆర్ నిధులను వెచ్చిస్తున్న ఓఎన్‌జీసీ, గెయిల్ వంటి పెద్ద సంస్థల అధికారులు కూడా ఇదే అంశంపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకువె ళ్లేందుకు ఆ సంస్థల అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
సర్కారు ఇచ్చేది అంతంత మాత్రమే..
పుష్కరాలకు ప్రభుత్వం పుష్కలంగా నిధులు ఇవ్వజాలదని ప్రస్తుత పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. ‘సీఎం సారు వస్తారు.. పుష్కరాలకు దండిగా నిధులు ప్రకటించి, దిశానిర్దేశం చేస్తా’రని భావించిన జిల్లా జనానికి ఈ నెల మూడున రాజమండ్రిలో సీఎం చేపట్టిన పుష్కర సమీక్ష తీవ్ర నిరాశ మిగిల్చింది. ఏర్పాట్లు భారీ అంటూనే, నిధులు నామమాత్రమే అన్న సంకేతాలిచ్చి చంద్రబాబు వెళ్లి పోయారు. ఈ తరుణంలో మంత్రి వర్గ ఉపసంఘం ప్రకటించినట్టు డిసెంబర్‌లో పనులు ఏవిధంగా ప్రారంభిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాజమండ్రిలో చేపడుతున్న రోడ్ల మరమ్మతులే జిల్లాలో పుష్కర పనులన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పుష్కరాల పనులకు సీఎస్‌ఆర్ నిధులు గణనీయమైన భాగం కాగలవన్న అభిప్రాయం బలపడుతోంది. మరి.. ఈ సొమ్ముల వినియోగానికి ఎలాంటి అడ్డంకులు వస్తాయో లేక అంతా అధికారులు అనుకున్నట్టే జరుగుతుందో చూడాలి.
రెండేళ్లుగా లెక్కలు లేవు..
జిల్లాలో గెయిల్, ఓఎన్‌జీసీ వంటి సంస్థలు కలెక్టర్ ద్వారా ఖర్చు చేసిన సీఎస్‌ఆర్ నిధులకు రెండేళ్లుగా సరైన జమా ఖర్చులు చెప్పడం లేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. నిధుల వెచ్చింపునకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లుకూడా దాఖలు కాక పోవడంతో ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని సమాచారం. ఈ తరుణంలో కలెక్టర్ కొత్త ప్రతిపాదనపై కంపెనీలు తర్జన భర్జన పడుతున్నాయి.
పుష్కరాలకు సీఎస్‌ఆర్ నిధులపై అభ్యంతరాలు
Published Fri, Dec 12 2014 12:59 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
Advertisement
Advertisement