హిజ్రాలకు ఐటీడీఏ చేయూత
కురుపాం: కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాలకు చెందిన హిజ్రాలకు పార్వతీపురం ఐటీడీఏ ఆసరాగా నిలుస్తోంది. ఐటీడీఏ సౌజన్యంతో ఐఆర్‌పీడబ్ల్యూఏ సంస్థ నిర్వహణలో రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ఉచిత టైలరింగ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆగస్టు 29న మొదలైన బ్యాచ్‌లో 43 మంది హిజ్రాలకు కురుపాం మండల కేంద్రంలో శిక్షణ ప్రారంభించారు. హిజ్రాలకు స్వయం ఉపాధి శిక్షణలు, అవకాశాలు లేకపోవడం వల్ల బిక్షాటన చేస్తున్న సంగతి తెలిసిందే.
దీంతో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాలకు చెందిన హిజ్రాలంతా ఏకమై ఐటీడీఏ పీఓకు, కలెక్టర్‌కు కలిసి తమ ఇబ్బందులు చెప్పుకొని తమల్ని సమాజంలో థర్డ్ జెండర్‌గా ప్రభుత్వం గుర్తించిందని తమల్ని ఆదుకోవాలని విన్నవించుకున్నారు. ఈ మేరకు ఐటీడీఏ పీఓ రజిత్‌కుమార్ సైనీ కురుపాం నియోజకవర్గంలోనే సుమారు 450 మంది వరకు హిజ్రాలు ఉన్నట్టు గుర్తించారు. వీరికి స్వయం ఉపాధి వైపు చైతన్యపరిచి ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే 45 రోజుల పాటు 28 రకాలకు చెందిన టైలరింగ్ శిక్షణ, వసతి, భోజనం సౌకర్యం కల్పించి ట్రైనింగ్ సర్టిఫికేట్, హిజ్రా లు తమ ఆదాయాన్ని తామే సంపాదించుకొనేందుకు కుట్టుమిషన్ ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీనిపై హిజ్రాలంతా ఆనందం వ్యక్తం
చేస్తున్నారు.
వినియోగించుకుంటాం
ఐటీడీఏ మా హిజ్రాలకు ఉచితంగా ఇస్తున్న టైలరింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం అవుతాం. అలాగే ఐటీడీఏ పీఓకు మేమంతా రుణపడి ఉంటాం.
- కె.గీతావెంకట్‌రాణి,
మెస్ ఇన్‌చార్జి గోర్లి గిరిజన గ్రామం
మరిన్ని శిక్షణలు ఇప్పించాలి
ఐటీడీఏ స్పందించి నియోజకవర్గంలోని ఉన్న హిజ్రాలందరికీ మరిన్ని స్వయం ఉపాధి శిక్షణలను ఇప్పించి ఆదుకోవాలి. ఇలాంటి శిక్షణల వలన మేం ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం.
- బి.శృతి,
తాడికొండ గిరిజన గ్రామం