
ఐటీడీఏ పీఓ కూర్మనాథ్, పొట్టంగి ఎమ్మెల్యే పీతం పాడిల మధ్య వాగ్వాదం
సాలూరు: ఆంధ్రాకు చెందిన అధికారిని ఒడిశా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఘెరావ్ చేశారు. గిరిపుత్రులు ఎదురుతిరగడంతో పలాయనం చిత్తగించారు. ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల్లోని పగులు చెన్నేరు పంచాయతీలో ఆంధ్రా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలనకు బుధవారం పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ వెళ్లారు. ఆంధ్రాలో కలిసిపోయేందుకు సుముఖత తెలిపిన పగులు చెన్నేరు, పట్టుచెన్నేరు పంచాయతీల ప్రజలతో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఒడిశా రాష్ట్రంలోని పొట్టంగి ఎమ్మెల్యే పీతం పాడి ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ పీవోను ప్రశ్నించారు. ఇది ఒడిశా భూభాగమని చెప్పారు. దీనికి పీవో సమాధానమిస్తూ.. ఇది రెండు రాష్ట్రాల వివాదాస్పద భూభాగమని, సుప్రీంకోర్టులో వివాదం నడుస్తోందని పేర్కొన్నారు.
ఇది ఒడిశా భూభాగమని ఏమైనా ఆధారాలుంటే చూపించాలన్నారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినదించారు. ఇదంతా పరిశీలిస్తున్న గిరిజనసంఘ నాయకుడు చోడిపల్లి బీసు, గిరిపుత్రులు పీవోకు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యేపై తిరగబడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందజేస్తూ అండగా నిలుస్తోందని, తాము ఆంధ్రాలోనే ఉంటామని తేల్చి చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో గిరిపుత్రులను పీవో శాంతింపజేశారు. గిరిజనుల తిరుగుబాటుతో కంగుతున్న ఒడిశా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment