Giriputrulu
-
ఆంధ్రా అధికారిని ఘెరావ్ చేసిన ఒడిశా ఎమ్మెల్యే
సాలూరు: ఆంధ్రాకు చెందిన అధికారిని ఒడిశా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఘెరావ్ చేశారు. గిరిపుత్రులు ఎదురుతిరగడంతో పలాయనం చిత్తగించారు. ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల్లోని పగులు చెన్నేరు పంచాయతీలో ఆంధ్రా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలనకు బుధవారం పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ వెళ్లారు. ఆంధ్రాలో కలిసిపోయేందుకు సుముఖత తెలిపిన పగులు చెన్నేరు, పట్టుచెన్నేరు పంచాయతీల ప్రజలతో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఒడిశా రాష్ట్రంలోని పొట్టంగి ఎమ్మెల్యే పీతం పాడి ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ పీవోను ప్రశ్నించారు. ఇది ఒడిశా భూభాగమని చెప్పారు. దీనికి పీవో సమాధానమిస్తూ.. ఇది రెండు రాష్ట్రాల వివాదాస్పద భూభాగమని, సుప్రీంకోర్టులో వివాదం నడుస్తోందని పేర్కొన్నారు. ఇది ఒడిశా భూభాగమని ఏమైనా ఆధారాలుంటే చూపించాలన్నారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినదించారు. ఇదంతా పరిశీలిస్తున్న గిరిజనసంఘ నాయకుడు చోడిపల్లి బీసు, గిరిపుత్రులు పీవోకు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యేపై తిరగబడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందజేస్తూ అండగా నిలుస్తోందని, తాము ఆంధ్రాలోనే ఉంటామని తేల్చి చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో గిరిపుత్రులను పీవో శాంతింపజేశారు. గిరిజనుల తిరుగుబాటుతో కంగుతున్న ఒడిశా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. -
పులకించిన భద్ర‘గిరి’
సాక్షి, భద్రాచలం: భద్రాచలం రామాలయ ప్రాంగణం గిరిపుత్రులతో జనసందోహంగా మారింది. శబరి మాత వంశీయుల గిరి ప్రదర్శనతో భద్రగిరి, రామాలయ మాడ వీధులు పులకించిపోయాయి. భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో శబరి స్మృతి యాత్ర ఉత్సవం బుధవారం వైభవోపేతంగా జరిగింది. వాల్మీకి జయంతి సందర్భంగా మొదట చిత్రకూట మండపం వద్దనున్న వాల్మీకి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఐటీడీఏ పీఓ, ఆలయ ఈఓ అయిన పమెల సత్పథి శబరి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం గావించి, హారతి సమర్పించారు. శబరి మాత చిత్రపటంతో గిరిజనులు సంప్రదాయ కోలాటాలు, రేలా నృత్యాలు, కొమ్ము, కోయ డ్యాన్సులతో గిరి ప్రదక్షిణ చేశారు. మార్గమధ్యలో ఉన్న తూము నర్సింహదాసు, భక్త రామదాసు, శబరి మాత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మేళతాళాలు, అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ శబరి నది నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జలాలతో ధ్వజస్తంభానికి అభిషేకం చేశారు. మహిళలు పసుపు, కుంకుమ ముగ్గులను వేసి బలిపీఠం కార్యక్రమాన్ని జరిపారు. వేడుక కోసం ప్రత్యేకంగా తెప్పించిన వివిధ రకాల పుష్పాలు, పండ్లతో గిరిజనులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. రామయ్యకు పుష్పార్చన.. శ్రీసీతారామచంద్రస్వామి వారికి పుష్పార్చన అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఉత్సవ మూర్తులను, శబరి మాత చిత్రపటాన్ని గర్భగుడి నుంచి ఊరేగింపుగా చిత్ర కూట మండపానికి తీసుకొచ్చారు. గిరిజన భక్తులు వేడుకగా ఫల, పుష్పాలను అక్కడికి తీసుకొచ్చారు. వీటిని స్వామివారి ఎదుట ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు అర్చకులు, వేద పండితులు ‘శ్రీరామ సంపుటి’(శ్రీరామ నామ జపం) నిర్వహిస్తూ స్వామికి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు ఉచ్ఛరించిన ‘శ్రీరామాయనమః’ నామ స్మరణతో బేడా మండపం మార్మోగింది. అనంతరం పుష్పాలు, ఫలాలతో సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రస్వామికి వైభవంగా అర్చన నిర్వహించారు. కోలాహలంగా గిరిపుత్రుల ప్రదర్శన.. శబరి చిత్రపటంతో గిరిజనులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. రామాలయం నుంచి బ్రిడ్జి సెంటర్‌కు, తర్వాత బస్టాండ్ మీదగా అంబేడ్కర్ సెంటర్ వరకు వెళ్లి అక్కడ కొమ్ము నృత్యాలు చేశారు. గిరిజనుల కొమ్ము, కోయ నృత్యాలు భక్తులను, పట్టణవాసులను ఆకట్టుకున్నాయి. వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన గిరిజనులకు దేవస్థానం ద్వారా ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించి, స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రావణ్‌కుమార్, డీఈ పాల్గొన్నారు. -
సారూ న్యాయం చేయండి..!
► గిరిపుత్రుల రోదన ►దబ్బగుంట జీవగెడ్డ భూమి, శ్మశాన వాటిక ఆక్రమణ ► జీవగెడ్డ ప్రవాహం దారిమళ్లింపు ►ఇకపై చెరువులు, భూములకు అందని జీవగెడ్డ ►కలెక్టర్ పరిశీలించాలని విన్నపం శృంగవరపుకోట రూరల్: ఎస్.కోట మండలం, బొడ్డవర పంచాయతీ శివారు దబ్బగుంట గ్రామం పక్కనుంచి ప్రవహిస్తున్న జీవగెడ్డ ప్రవాహాన్ని దారిమళ్లించి ఆ భూమిని ఆక్రమించడంతో పాటు దబ్బగుంట, జిల్లేల్లోవ గ్రామాల గిరిజనులు తాత ముత్తాతల కాలం నుంచి వాడుకుంటున్న శ్మశాన వాటిక భూమిని సైతం భారీ యంత్రాలతో చదును చేసేస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. దబ్బగుంట, జిల్లేల్లోవ గిరిజనులు కె.జమరాజు, యు.రాము, ఎస్.సన్నిబాబు, గెమ్మల సోములు, జె.గౌరీష్, దేముడు, చిన్నారావు, జి.గంగరాజు, భీమన్న తదితరులు బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భారీ యంత్రాలతో జీవగెడ్డ ప్రవాహాన్ని దారిమళ్లించి ఆ భూమిని యంత్రాలతో చదును చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తని విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సర్వే నంబర్లు 75, 76, 77, 78, 79 మీదుగా జీవగెడ్డ ప్రవహిస్తున్నట్టుగా రెవెన్యూ అధికారులు తెచ్చిన రికార్డులు, మ్యాపులో స్పష్టంగా ఉన్నాయన్నారు. అలాగే జీవగెడ్డ ప్రవాహం వెళ్తున్న పలు ప్రాంతాల్లో కల్వర్టులు కూడా నేటికీ ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు. అరుుతే గిరిజనుల డిమాండ్ మేరకు విచారణకు వచ్చిన రెవెన్యూ అధికారులు జీవగెడ్డ ప్రవాహ తీరుతెన్నులు మారుస్తున్న వైనంపై గానీ, పురాతన కాలం నుంచి గిరిజనులు వాడుతున్న మరుభూమి (శ్మశాన వాటిక) ఆక్రమణపై నోరుమెదపడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవగెడ్డ, దబ్బగుంట, జిల్లేల్లోవ గిరిజన గ్రామాల ప్రజలు వాడుతున్న శ్మశాన వాటిక భూమి ఆక్రమణ వెనుక ఉన్న పెత్తందార్లకు భయపడి రెవెన్యూ అధికారులు అన్యాయం చేస్తున్నారని గిరిజనులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టర్, ఆర్డీఓ వంటి ఉన్నతాధికారులు జీవగెడ్డ ప్రవాహ తీరును మళ్లించిన వైనంతో పాటు శ్మశాన వాటిక స్థల ఆక్రమణపై నిజానిజాలు పరిశీలించి న్యాయం చేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు.