సారూ న్యాయం చేయండి..!
► గిరిపుత్రుల రోదన
►దబ్బగుంట జీవగెడ్డ భూమి, శ్మశాన వాటిక ఆక్రమణ
► జీవగెడ్డ ప్రవాహం దారిమళ్లింపు
►ఇకపై చెరువులు, భూములకు అందని జీవగెడ్డ
►కలెక్టర్ పరిశీలించాలని విన్నపం
శృంగవరపుకోట రూరల్: ఎస్.కోట మండలం, బొడ్డవర పంచాయతీ శివారు దబ్బగుంట గ్రామం పక్కనుంచి ప్రవహిస్తున్న జీవగెడ్డ ప్రవాహాన్ని దారిమళ్లించి ఆ భూమిని ఆక్రమించడంతో పాటు దబ్బగుంట, జిల్లేల్లోవ గ్రామాల గిరిజనులు తాత ముత్తాతల కాలం నుంచి వాడుకుంటున్న శ్మశాన వాటిక భూమిని సైతం భారీ యంత్రాలతో చదును చేసేస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. దబ్బగుంట, జిల్లేల్లోవ గిరిజనులు కె.జమరాజు, యు.రాము, ఎస్.సన్నిబాబు, గెమ్మల సోములు, జె.గౌరీష్, దేముడు, చిన్నారావు, జి.గంగరాజు, భీమన్న తదితరులు బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భారీ యంత్రాలతో జీవగెడ్డ ప్రవాహాన్ని దారిమళ్లించి ఆ భూమిని యంత్రాలతో చదును చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తని విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
సర్వే నంబర్లు 75, 76, 77, 78, 79 మీదుగా జీవగెడ్డ ప్రవహిస్తున్నట్టుగా రెవెన్యూ అధికారులు తెచ్చిన రికార్డులు, మ్యాపులో స్పష్టంగా ఉన్నాయన్నారు. అలాగే జీవగెడ్డ ప్రవాహం వెళ్తున్న పలు ప్రాంతాల్లో కల్వర్టులు కూడా నేటికీ ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు. అరుుతే గిరిజనుల డిమాండ్ మేరకు విచారణకు వచ్చిన రెవెన్యూ అధికారులు జీవగెడ్డ ప్రవాహ తీరుతెన్నులు మారుస్తున్న వైనంపై గానీ, పురాతన కాలం నుంచి గిరిజనులు వాడుతున్న మరుభూమి (శ్మశాన వాటిక) ఆక్రమణపై నోరుమెదపడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జీవగెడ్డ, దబ్బగుంట, జిల్లేల్లోవ గిరిజన గ్రామాల ప్రజలు వాడుతున్న శ్మశాన వాటిక భూమి ఆక్రమణ వెనుక ఉన్న పెత్తందార్లకు భయపడి రెవెన్యూ అధికారులు అన్యాయం చేస్తున్నారని గిరిజనులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టర్, ఆర్డీఓ వంటి ఉన్నతాధికారులు జీవగెడ్డ ప్రవాహ తీరును మళ్లించిన వైనంతో పాటు శ్మశాన వాటిక స్థల ఆక్రమణపై నిజానిజాలు పరిశీలించి న్యాయం చేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు.