స్వామివారికి పుష్పార్చన చేస్తున్న అర్చకుడు, బుట్టల్లో పూలతో ప్రదక్షిణలు చేస్తున్న గిరిజన మహిళలు
సాక్షి, భద్రాచలం: భద్రాచలం రామాలయ ప్రాంగణం గిరిపుత్రులతో జనసందోహంగా మారింది. శబరి మాత వంశీయుల గిరి ప్రదర్శనతో భద్రగిరి, రామాలయ మాడ వీధులు పులకించిపోయాయి. భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో శబరి స్మృతి యాత్ర ఉత్సవం బుధవారం వైభవోపేతంగా జరిగింది. వాల్మీకి జయంతి సందర్భంగా మొదట చిత్రకూట మండపం వద్దనున్న వాల్మీకి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఐటీడీఏ పీఓ, ఆలయ ఈఓ అయిన పమెల సత్పథి శబరి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం గావించి, హారతి సమర్పించారు. శబరి మాత చిత్రపటంతో గిరిజనులు సంప్రదాయ కోలాటాలు, రేలా నృత్యాలు, కొమ్ము, కోయ డ్యాన్సులతో గిరి ప్రదక్షిణ చేశారు. మార్గమధ్యలో ఉన్న తూము నర్సింహదాసు, భక్త రామదాసు, శబరి మాత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మేళతాళాలు, అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ శబరి నది నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జలాలతో ధ్వజస్తంభానికి అభిషేకం చేశారు. మహిళలు పసుపు, కుంకుమ ముగ్గులను వేసి బలిపీఠం కార్యక్రమాన్ని జరిపారు. వేడుక కోసం ప్రత్యేకంగా తెప్పించిన వివిధ రకాల పుష్పాలు, పండ్లతో గిరిజనులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు.
రామయ్యకు పుష్పార్చన..
శ్రీసీతారామచంద్రస్వామి వారికి పుష్పార్చన అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఉత్సవ మూర్తులను, శబరి మాత చిత్రపటాన్ని గర్భగుడి నుంచి ఊరేగింపుగా చిత్ర కూట మండపానికి తీసుకొచ్చారు. గిరిజన భక్తులు వేడుకగా ఫల, పుష్పాలను అక్కడికి తీసుకొచ్చారు. వీటిని స్వామివారి ఎదుట ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు అర్చకులు, వేద పండితులు ‘శ్రీరామ సంపుటి’(శ్రీరామ నామ జపం) నిర్వహిస్తూ స్వామికి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు ఉచ్ఛరించిన ‘శ్రీరామాయనమః’ నామ స్మరణతో బేడా మండపం మార్మోగింది. అనంతరం పుష్పాలు, ఫలాలతో సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రస్వామికి వైభవంగా అర్చన నిర్వహించారు.
కోలాహలంగా గిరిపుత్రుల ప్రదర్శన..
శబరి చిత్రపటంతో గిరిజనులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. రామాలయం నుంచి బ్రిడ్జి సెంటర్‌కు, తర్వాత బస్టాండ్ మీదగా అంబేడ్కర్ సెంటర్ వరకు వెళ్లి అక్కడ కొమ్ము నృత్యాలు చేశారు. గిరిజనుల కొమ్ము, కోయ నృత్యాలు భక్తులను, పట్టణవాసులను ఆకట్టుకున్నాయి. వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన గిరిజనులకు దేవస్థానం ద్వారా ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించి, స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రావణ్‌కుమార్, డీఈ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment