శ్రీకాకుళం టౌన్ : జిల్లాలో సిమెంటు రోడ్ల నిర్మాణానికి గత ఏడాది ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఖర్చు చేయలేక పోయారు. ఇందుకు అనేక కారణాలు చూపారు. ఇప్పుటికైనా చిత్తశుద్ధితో వ్యవహరించి సిమెంటు రోడ్ల నిర్మాణ లక్ష్యం పూర్తి చేయండి.. అంటూ జిల్లా కలెక్టరు డాక్టర్ పి.లక్ష్మీనృసింహం పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన చాంబరులో డ్వామా పీడీ ఆర్.కూర్మనాథ్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ మోహనమురళీ, ఐటీడీఏ పీఓ వెంకటరావుతో సమావేశమయ్యారు.
సిమెంటు రోడ్ల నిర్మాణంపై పలు సూచనలు చేశారు. గతంలో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు సిమెంటు రోడ్లు నిర్మించకోలేక పోవడంతో సుమారు రూ.40 కోట్లు వెనక్కు పంపాల్సి వచ్చిందని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఈసారి లక్ష్యం 1200 కిలో మీటర్లు కాగా, ఇప్పటివరకు 221 కిలోమీటర్లు మాత్రమే పూర్తిచేశారని గుర్తు చేశారు. మిగిలిన లక్ష్యం పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు ఇసుక కొరత కారణంగా చూపించి, సిమెంటు రోడ్ల నిర్మాణంలో జాప్యం చేశారని, ఇప్పుడు నీరు కొరత ఉందని చెపుతున్నారని ఆయన ప్రస్తావించారు. సమావేశంలో జాయింట్ కలెక్టరు-2 పి.రజనీకాంతరావుతోపాటు డీఆర్‌ఓ కృష్ణభారతి పాల్గొన్నారు.
సకాలంలో సిమెంటు రోడ్లు పూర్తి చేయండి
Published Sat, Apr 30 2016 11:35 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement