ఐటీడీఏ ఇంజనీరింగ్ సబ్ డివిజన్లు తరలింపు
Published Sat, Sep 17 2016 12:56 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
ఏటూరునాగారం : సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధి ఇంజనీరింగ్ విభాగంలోని మూడు సబ్ డివిజన్లను కొత్తగా ఏర్పడనున్న జిల్లాలకు తరలించనున్నారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో భాగంగా ఐటీడీఏలోని గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ విభాగాన్ని తరలించేందుకు కావాల్సిన ఫైళ్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పస్రాలోని సబ్ డివిజన్‌ను హన్మకొండకు, ఏటూరునాగారం సబ్‌డివిజన్‌ను జయశంకర్ జిల్లాకు, కొత్తగూడలోని సబ్ డివిజన్‌ను మహబూబాబాద్‌కు తరలించనున్నారు. ఈ మేరకు దసరా రోజు కొత్త కార్యాలాయాలకు కావాల్సిన సమాచారం, రికార్డులతో సిద్ధంగా ఉండాలనే ఆదేశాలు రావడంతో ఆయా సబ్ డివిజన్‌ల ఇంజనీరింగ్ అధికారులు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డుల అసిస్టెంట్లతోపాటు ఇత్తర సిబ్బంది సమాయత్తమయ్యారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయంలోని రికార్డులను సంవత్సరాల వారీగా నమోదు చేసుకొని దస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. కేవలం నెల రోజుల వ్యవధి ఉండడంతో అధికారులు ఉరుకులు పరుగుల మీద ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జిల్లా కేంద్రాల్లో సబ్ డివిజన్లు..
గతంలో సబ్ డివిజన్ ఈఈ కార్యాలయానికి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో సబ్ డివిజనల్ కార్యాలయాలు, ఏటూరునాగారం మండల కేంద్రంలో డివిజన్ కార్యాలయం ఉండేలా చర్యలు చేపడుతున్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడే ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం మూడు ముక్కలు కావడంతో ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈఈ, డీఈఈ కార్యాలయం ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల సమస్య పరిష్కారం కోసం వచ్చే వారికి సులువుగా ఉండేది. ఇప్పుడు కార్యాలయాలు జిల్లా కేంద్రాలకు తరలించడంతో కాంట్రాక్టర్లలో గుబులు మొదలైంది. ఏది ఏమైనప్పటికీ డీఈఈ కార్యాలయాలను జిల్లా కేంద్రానికి తరలించేందుకు అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నారు.
Advertisement
Advertisement