Sub divisions
-
ఐటీడీఏ ఇంజనీరింగ్ సబ్ డివిజన్లు తరలింపు
ఏటూరునాగారం : సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధి ఇంజనీరింగ్ విభాగంలోని మూడు సబ్ డివిజన్లను కొత్తగా ఏర్పడనున్న జిల్లాలకు తరలించనున్నారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో భాగంగా ఐటీడీఏలోని గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ విభాగాన్ని తరలించేందుకు కావాల్సిన ఫైళ్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పస్రాలోని సబ్ డివిజన్‌ను హన్మకొండకు, ఏటూరునాగారం సబ్‌డివిజన్‌ను జయశంకర్ జిల్లాకు, కొత్తగూడలోని సబ్ డివిజన్‌ను మహబూబాబాద్‌కు తరలించనున్నారు. ఈ మేరకు దసరా రోజు కొత్త కార్యాలాయాలకు కావాల్సిన సమాచారం, రికార్డులతో సిద్ధంగా ఉండాలనే ఆదేశాలు రావడంతో ఆయా సబ్ డివిజన్ల ఇంజనీరింగ్ అధికారులు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డుల అసిస్టెంట్లతోపాటు ఇత్తర సిబ్బంది సమాయత్తమయ్యారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయంలోని రికార్డులను సంవత్సరాల వారీగా నమోదు చేసుకొని దస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. కేవలం నెల రోజుల వ్యవధి ఉండడంతో అధికారులు ఉరుకులు పరుగుల మీద ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రాల్లో సబ్ డివిజన్లు.. గతంలో సబ్ డివిజన్ ఈఈ కార్యాలయానికి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో సబ్ డివిజనల్ కార్యాలయాలు, ఏటూరునాగారం మండల కేంద్రంలో డివిజన్ కార్యాలయం ఉండేలా చర్యలు చేపడుతున్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడే ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం మూడు ముక్కలు కావడంతో ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈఈ, డీఈఈ కార్యాలయం ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల సమస్య పరిష్కారం కోసం వచ్చే వారికి సులువుగా ఉండేది. ఇప్పుడు కార్యాలయాలు జిల్లా కేంద్రాలకు తరలించడంతో కాంట్రాక్టర్లలో గుబులు మొదలైంది. ఏది ఏమైనప్పటికీ డీఈఈ కార్యాలయాలను జిల్లా కేంద్రానికి తరలించేందుకు అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. -
పోలీస్ కమిషనరేట్‌కు ఓకే..!
సాక్షి, గుంటూరు: గుంటూరు పోలీస్ కమిషనరేట్‌కు ప్రభుత్వ ఆమోదం లభించింది. కమిషనరేట్ పరిధిలోకి ఏయే సబ్డివిజన్లు తీసుకురావాలనే అంశంపై సమగ్ర నివేదికతో కూడిన ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు సమాచారం. గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల్లో ఏయే పోలీస్స్టేషన్లు కమిషనరేట్ పరిధిలోకి వస్తే బాగుంటుందనే విషయాలను చర్చించి ప్రతిపాదనలు పంపాలంటూ గురువారం గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు పి.హెచ్.డి.రామకృష్ణ, రాజేష్‌కుమార్‌లకు డీజీపీ లేఖ కూడా రాసినట్లు తెలిసింది. మూడు, నాలుగు రోజుల్లో ప్రతిపాదనలు పంపాలంటూ ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో నూతన రాజధాని నిర్మాణం జరగనున్న ప్రాంతానికి జిల్లా కేంద్రంగా ఉంటున్న గుంటూరు నగరంలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. రాజధాని నిర్మాణం జరగనున్న తుళ్ళూరు, మంగళగిరిలో రెండు సబ్డివిజన్లు ఏర్పాటు చేసి పలు పోలీస్స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. గతంలో ఎస్పీలు తుళ్ళూరు, అమరావతి, పెదకూరపాడును ఒక సబ్‌డివిజన్, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండను ఒక సబ్‌డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం మాత్రం రాజధాని నిర్మాణం జరగనున్న తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లితో పాటు తాడికొండను కలిపి సబ్‌డివిజన్‌గా ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే దీనిపై గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలతో పలు మార్లు చర్చించిన డీజీపీ గుంటూరు పోలీస్ కమిషనరేట్ ఆమోదం కోరుతూ ప్రభుత్వానికి నివేదించారు. పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుపై డీజీపీ నుంచి గురువారం ఎస్పీలకు లేఖ రావడంతో ఇక ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లేనని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. డీజీపీ ఆదేశాలతో శనివారం ఇద్దరు ఎస్పీలు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మూడు ప్రతిపాదనలు... గుంటూరు పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో పోలీస్ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు.కొన్ని నెలలుగా ఈ వ్యవహారం పరిశీలనలో ఉండటంతో ఇప్పటికే పోలీస్ కమిషనరేట్‌పై జిల్లా ఉన్నతాధికారులు కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. కమిషనరేట్ పరిధిలో కమిషనర్‌గా డీఐజీ స్థాయి అధికారి, ఇద్దరు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలు, వివిధ విభాగాలకు మరి కొందరు ఏసీపీలు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అధికారుల పరిశీలనలో ఉన్న ప్రతిపాదనల వివరాలు... 1. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధితోపాటు తుళ్ళూరు, అమరావతి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, తాడేపల్లి పోలీస్స్టేషన్లను కలిపి గుంటూరు పోలీస్ కమిషనరేట్‌గా ఏర్పాటు చేయాలి. 2. గుంటూరు అర్బన్ జిల్లా పరిధితోపాటు రూరల్ జిల్లా పరిధిలోని తుళ్ళూరు, అమరావతి, పెదకూరపాడు పోలీస్ స్టేషన్లను కలిపి కమిషనరేట్‌గా ఏర్పాటు చేయాలి. 3. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధితోపాటు గుంటూరు నగరానికి చుట్టు పక్కల ఉన్న 16 మండలాలను కలిపి అతిపెద్ద కమిషనరేట్‌గా ఏర్పాటు చేయాలి. -
‘దీర్ఘకాలిక’ డీఎస్పీలందరికీ స్థానచలనం!
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖలో దీర్ఘకాలికంగా సబ్ డి విజన్లను అంటిపెట్టుకున్న డీఎస్పీలకు స్థానచలనం కలగనుంది. రెండేళ్లకుపైగా సబ్డివిజన్లలో ఉన్నవారు, వరుసగా రెండుసార్లు సబ్ డివిజన్లలో పోస్టింగ్‌లు పొందిన డీఎస్పీల జాబితాను పోలీసుశాఖ సిద్ధంచేసింది. రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్నవారి జాబితా ఒకటి, రెండేళ్లకన్నా ఎక్కువగా సబ్డివిజన్లలో ఉన్నవారి జాబితా మరొకటి రెడీ చేశారు. రాజకీయ సిఫారసులతో వరుసగా కీలక స్థానాల్లో కొనసాగుతున్న డీఎస్పీలను అప్రధానమైన పోస్టులకు బదిలీ చేసేందుకు పోలీసు ప్రధాన కార్యాలయం ప్రణాళిక రూపొందించింది. అదే సమయంలో దీర్ఘకాలికంగా అప్రధానమైన(శాంతిభద్రతల బాధ్యతలు కానివి) పోస్టుల్లో కొనసాగుతున్న వారందరికీ సబ్ డివిజన్ పోస్టులు అందించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. ఈ మేరకు జాబితాలు సిద్ధమయ్యాయి. రాజకీయ నేతలతో సత్సంబంధాలు, ఇతరత్రా పలుకుబడి కలిగినవారు మాత్రమే కీలకమైన సబ్ డివిజన్లలో తిష్టవేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నెలన్నర క్రితం డీజీపీ బాధ్యతలను చేపట్టిన ప్రసాదరావు పోలీసుశాఖపై ఉన్న ఆ అపవాదును తొలగించే దిశగా ప్రయత్నాలు చేపట్టారు. పూర్తిస్థాయి డీజీపీగా యూపీఎస్సీ నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఆయన డీఎస్పీల బదిలీలపై దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా దీర్ఘకాలికంగా కొనసాగుతున్న డీఎస్పీల జాబితాలను, అలాగే అప్రధాన పోస్టుల్లో రెండేళ్లు, ఆపైగా కొనసాగుతున్న వారి జాబితాలను పంపాలంటూ పోలీసుశాఖలోని అన్ని విభాగాలను ఆదేశిస్తూ ఒక సర్క్యులర్ పంపారు. ఈ నేపథ్యంలో సీఐడీ, ఏసీబీ, ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఏపీఎస్పీ విభాగాల్లో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న డీఎస్పీల జాబితా పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న డీజీపీల సమావేశానికి వెళ్లిన ప్రసాదరావు ఆదివారం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. దీంతో వచ్చేవారంలో భారీస్థాయిలో డీఎస్పీల బదిలీలు ఉంటాయని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ద్వారా డీఎస్పీల బదిలీలకోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు సమాచారం.