సాక్షి, గుంటూరు: గుంటూరు పోలీస్ కమిషనరేట్‌కు ప్రభుత్వ ఆమోదం లభించింది. కమిషనరేట్ పరిధిలోకి ఏయే సబ్‌డివిజన్లు తీసుకురావాలనే అంశంపై సమగ్ర నివేదికతో కూడిన ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు సమాచారం.
గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల్లో ఏయే పోలీస్‌స్టేషన్లు కమిషనరేట్ పరిధిలోకి వస్తే బాగుంటుందనే విషయాలను చర్చించి ప్రతిపాదనలు పంపాలంటూ గురువారం గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు పి.హెచ్.డి.రామకృష్ణ, రాజేష్‌కుమార్‌లకు డీజీపీ లేఖ కూడా రాసినట్లు తెలిసింది. మూడు, నాలుగు రోజుల్లో ప్రతిపాదనలు పంపాలంటూ ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
రాష్ట్ర విభజన నేపథ్యంలో నూతన రాజధాని నిర్మాణం జరగనున్న ప్రాంతానికి జిల్లా కేంద్రంగా ఉంటున్న గుంటూరు నగరంలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే.
రాజధాని నిర్మాణం జరగనున్న తుళ్ళూరు, మంగళగిరిలో రెండు సబ్‌డివిజన్‌లు ఏర్పాటు చేసి పలు పోలీస్‌స్టేషన్‌లను అప్‌గ్రేడ్ చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు.
గతంలో ఎస్పీలు తుళ్ళూరు, అమరావతి, పెదకూరపాడును ఒక సబ్‌డివిజన్, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండను ఒక సబ్‌డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం మాత్రం రాజధాని నిర్మాణం జరగనున్న తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లితో పాటు తాడికొండను కలిపి సబ్‌డివిజన్‌గా ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిసింది.
ఇప్పటికే దీనిపై గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలతో పలు మార్లు చర్చించిన డీజీపీ గుంటూరు పోలీస్ కమిషనరేట్ ఆమోదం కోరుతూ ప్రభుత్వానికి నివేదించారు.
పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుపై డీజీపీ నుంచి గురువారం ఎస్పీలకు లేఖ రావడంతో ఇక ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లేనని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
డీజీపీ ఆదేశాలతో శనివారం ఇద్దరు ఎస్పీలు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
మూడు ప్రతిపాదనలు...
గుంటూరు పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో పోలీస్ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు.కొన్ని నెలలుగా ఈ వ్యవహారం పరిశీలనలో ఉండటంతో ఇప్పటికే పోలీస్ కమిషనరేట్‌పై జిల్లా ఉన్నతాధికారులు కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది.
కమిషనరేట్ పరిధిలో కమిషనర్‌గా డీఐజీ స్థాయి అధికారి, ఇద్దరు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలు, వివిధ విభాగాలకు మరి కొందరు ఏసీపీలు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
అధికారుల పరిశీలనలో
ఉన్న ప్రతిపాదనల వివరాలు...
1. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధితోపాటు తుళ్ళూరు, అమరావతి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లను కలిపి గుంటూరు పోలీస్ కమిషనరేట్‌గా ఏర్పాటు చేయాలి.
2. గుంటూరు అర్బన్ జిల్లా పరిధితోపాటు రూరల్ జిల్లా పరిధిలోని తుళ్ళూరు, అమరావతి, పెదకూరపాడు పోలీస్ స్టేషన్లను కలిపి కమిషనరేట్‌గా ఏర్పాటు చేయాలి.
3. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధితోపాటు గుంటూరు నగరానికి చుట్టు పక్కల ఉన్న 16 మండలాలను కలిపి అతిపెద్ద కమిషనరేట్‌గా ఏర్పాటు చేయాలి.
పోలీస్ కమిషనరేట్‌కు ఓకే..!
Published Sat, Dec 13 2014 3:11 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement