
సాక్షి, గుంటూరు : జిల్లా పోలీసు శాఖలో కీలక పోస్టులు ఖాళీ అయ్యాయి. అర్బన్ జిల్లాలో ఏఎస్పీ అడ్మిన్, క్రైమ్ ఏఎస్పీ, ఏఆర్ డీఎస్పీ, ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ, ఎస్బీ సీఐ–1, రూరల్ జిల్లాలో ఎస్బీ డీఎస్పీ, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ, ఏఆర్ ఆర్‌ఐ, ఏవో పోస్టులు గత కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్నాయి. ఇటీవల కాలంలో జరిగిన బదిలీల్లో ఇక్కడి జిల్లా అధికారులు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అయితే వారి స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఈ పరిస్థితి పోలీసింగ్‌పైన, పోలీసు పరిపాలనపైనా పడుతోంది.
ఏఎస్పీ పోస్టులు ఖాళీ..
అర్బన్ జిల్లాలో ఏఎస్పీ క్రైమ్, ఏఎస్పీ అడ్మిన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ అడ్మిన్‌గా పని చేస్తున్న వై.టి. నాయుడు ఇటీవల బదిలీ అయ్యారు. క్రైమ్ ఏఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు గత ఆగస్టులో పదవీ విరమణ పొందారు. నెల రోజుల అనంతరం ఈ నెల 4న వెయిటింగ్‌లో ఉన్న ఏఎస్పీ ఎం. శ్రీనివాస్‌ను క్రైమ్ ఏఎస్పీగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయన నేటికీ వచ్చి జాయిన్ అవ్వలేదు. అర్బన్ ఏఆర్ డీఎస్పీ పోస్టు చాలా రోజులుగా ఖాళీగా ఉంటోంది. ఆర్‌ఐ అడ్మిన్, ఆర్‌ఐ వెల్ఫేర్‌లతోనే బందోబస్తు, ఏఆర్ కానిస్టేబుళ్ల డ్యూటీలు, పరిపాలన తదిర వ్యవహారలను నెట్టుకొస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ సీతరామయ్యను ఇటీవల మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా బదిలీ చేశారు. ఆ స్థానంలోకి కొత్త అధికారిని నియమించలేదు. దీంతో మహిళా పోలీస్ స్టేషన్, ఎస్సీ, ఎస్టీ డీఎస్పీగా, ఏఎస్పీ అడ్మిన్‌గా అదనపు బాధ్యతలను సీతరామయ్య చూసుకుంటున్నారు. అర్బన్ ఎస్‌బీ సీఐ–1 పోస్టు కూడా చాలా రోజులుగా ఖాళీగా ఉంది. ఇక్కడ పని చేస్తున్న రాజశేఖర్‌రెడ్డిని కొత్తపేట సీఐగా బదిలీ చేశారు. అనంతరం ఆ స్థానంలో ఎవరిని కేటాయించలేదు.
నిఘా విభాగం అస్తవ్యస్తం..
స్పెషల్ బ్రాంచి(ఎస్బీ) పోలీసింగ్‌లో అత్యంత కీలకం. జిల్లాలో ఎక్కడ ఏం జరుగుతుందో క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా ముందుగానే పసిగట్టి జిల్లా బాస్‌కు సమాచారం ఎస్‌బీ చేరవేస్తుంది. శాంతిభద్రతలు ఎక్కడ ఎలా ఉన్నాయో శోధిస్తుంది. ఈ విభాగంలో సీనియర్ అధికారులు ఉంటే క్షేత్రస్థాయిలో తమ అనుభవాలను జోడించి శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు బాస్‌కు వెన్నుముకలా వ్యవహరిస్తారు. సుమారు మూడు నెలల క్రితం ఎస్‌బీ డీఎస్పీగా పని చేస్తున్న వెంకటనారాయణ బదిలీపై హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లారు. అనంతరం ఇక్కడికి కొత్త డీఎస్పీని కేటాయించలేదు. ఈ విభాగంలో సీఐ–2 పోస్టు కూడా ఖాళీగానే ఉంది. ప్రస్తుతం ఒక సీఐ మాత్రమే రూరల్ ఎస్‌బీని నడిపిస్తున్నారు. సీనియర్ డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో రూరల్ ఎస్‌బీ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రూరల్ జిల్లా ఏవో శివకుమార్ సుమారు మూడు నెలల క్రితం పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించలేదు. డీసీఆర్బీ డీఎస్పీ గోలి లక్ష్మయ్యకు ఏవోగా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో ఈయన ఎక్కువ సమయం ఏవో విధులకే కేటాయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో డీసీఆర్బీలో పర్యవేక్షణ కొరవడిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూరల్ మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ధర్మేంద్రబాబు గత జూలైలో కృష్ణా జిల్లాకు బదిలీ అయ్యారు. అనంతరం ఇక్కడ డీఎస్పీని కేటాయించలేదు. దీంతో సీఐతో మహిళా పోలీస్ స్టేషన్ నడుపుతున్నారు. డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉండటంతో రూరల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని తెలుస్తోంది. దీనికి తోడు సిబ్బంది గ్రూపులుగా విడిపోయి గొడవలు పడుతున్నట్టు పోలీస్ శాఖలో చర్చ నడుస్తోంది.
ఉన్నతాధికారులపైనే భారం..
అర్బన్, రూరల్ జిల్లాలో కీలకమైన ఏఎస్పీ, డీఎస్పీ, సీఐల పోస్టులు కొన్ని నెలలుగా ఖాళీగా ఉండటంతో పోలీస్ బాస్‌లే వీటి పర్యవేక్షణ చూసుకోవాల్సి వస్తోంది. సీనియర్ అధికారులు లేకపోవడంతో ఈ మొత్తం భారం ఎస్పీలపైనే పడుతోంది. సీఎం, ప్రతిపక్ష నేత, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర వీఐపీలు, వీవీఐపీలు నివాసం ఉంటూ నిత్యం పర్యటించే జిల్లాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉండటం ఎస్పీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.
డీజీపీ, ఐజీలు దృష్టి సారించాలి...
రాజధాని జిల్లాలో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో కేసుల విచారణ, బందోబస్తు, పరిపాలన మొదలైన వ్యవహారాలపై ప్రభావం పడుతోంది. కావున డీజీపీ, ఐజీలు ఖాళీగా ఉన్న కీలక పోస్టులపై దృష్టి సారించి వీలైనంత త్వరగా ఆయా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. లేని పక్షంలో శాంతిభద్రతలపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment