మృత్యుఘంటికలు..! | tribals in danger | Sakshi
Sakshi News home page

మృత్యుఘంటికలు..!

Published Mon, Jul 18 2016 5:21 PM | Last Updated on Sat, Sep 15 2018 8:23 PM

మృత్యుఘంటికలు..! - Sakshi

మృత్యుఘంటికలు..!

  • ఏజెన్సీలో ప్రబలుతున్న 
  • జ్వరాలు, వ్యాధులు
  • ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వేతో 
  • వాస్తవాలు వెలుగులోకి..
  • అధికారిక లెక్కల ప్రకారం అతిసారతో ఇప్పటికే ముగ్గురు మృతి
  • ఉట్నూర్‌ : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్‌ వ్యాధులు, జ్వరాలు మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. గిరిజన తండాలు, గూడేలు మంచం పట్టాయి. రోజు రోజుకు ప్రబలుతున్న సీజనల్‌ వ్యాధులు అడవి బిడ్డల పాలిట శాపంగా మారుతున్నాయి. జ్వరాలు, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అధికార యంత్రాంగం ప్రచారం చేస్తుందే గానీ క్షేత్ర స్థాయిలో చర్యలు కనిపించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక ఉపశమన చర్యలే తప్ప శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వేలో వెలుగు చూస్తున్న నిజాలు, అధికారుల లెక్కలు చూస్తే ఏజెన్సీలోని పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
    సర్వేలో చేదు నిజాలు
    ఏజెన్సీలో సీజనల్, వ్యాధులు, జ్వరాలు అంచనా వేసి చర్యలు తీసుకునేందుకు ఏజెన్సీ వైద్యశాఖ జూన్‌ 15 నుంచి మొదటి విడతలో భాగంగా ఏజెన్సీలోని దంతన్‌పల్లి, ఇంద్రవెల్లి, పిట్టబోంగరం, నార్నూర్, ఝర్రి, గాదిగూడ, సిర్పూర్‌(యు), లింగపూర్, జైనూర్, కెరమెరి, తిర్యాణి, రోంపల్లి, గిన్నెధరి, అడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వే నిర్వహించింది. రెండో విడతలో భాగంగా జూలై 1 నుంచి ఏజెన్సీలోని 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వే చేపట్టారు.
     
    ఈ సర్వే ద్వారా ఏజెన్సీలో వాస్తవ పరిస్థితి బయట పడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం.. జూన్‌ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో 3,996 వైద్యశిబిరాలు ఏర్పాటు చేసిన అధికారులు 1,29,973 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 2,455 అతిసార కేసులు నమోదు కాగా.. 22,247 మందిS జ్వరాలతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు మలేరియా పాజిటివ్‌ కేసులు 501 నమోదు కాగా.. సర్వే కాలంలో 68 కేసులు నమోదయ్యాయని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అతిసారతో ముగ్గురు మృతిచెందినట్లు అధికార లెక్కలు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
    ఏటేటా తాత్కాలిక చర్యలే..
    వర్షాకాలం వచ్చిందంటే చాలు గిరిజన ప్రాంతంలో వ్యాధులు, జ్వరాలు గిరిజనులను చుట్టుముడుతుంటాయి. ప్రతీసారి అధికార యంత్రాంగం తాత్కాలిక ఉపశమానానికి చర్యలు తీసుకోవడం తప్ప శాశ్వత నివారణ మార్గాలు అన్వేషించడం లేదు. అడవి బిడ్డలకు తగినంత పౌష్టికాహరం లభించకపోవడం, హిమోగ్లోబిన్‌ శాతం సరిపడా లేకపోవడంతో చిన్నపాటి జ్వరాలకే ప్రాణాలు కోల్పోతున్నారు. గిరిజనులకు పౌష్టికాహరం అదించేందకు ఏర్పాటు చేసిన పోషకాహర కేంద్రాలు మూలనపడుతున్నాయి. గిరిజన గ్రామాల్లో పారిశుధ్యం లోపించడం, తాగునీటి వనరుల్లో క్లోరినేషన్‌ చేపట్టేవారు లేకపోవడం గిరిజనుల పాలిట శాపంగా మారుతోంది.
     
    ఇటీవల కురిసిన వర్షాలతో బావులు, ఇతర నీటి వనరుల్లోకి కొత్త నీరు చేరడం.. ఆ నీటిని గిరిజనులు తాగుతుండడంతో అతిసార ప్రబలుతోంది. శనివారం సిర్పూర్‌(యు) మండలం దేవుడిపల్లిలో 40 గిరిజనులు వాంతులు, విరేచనాలతో అతిసార బారిన పడ్డారు. ఏజెన్సీలో 235 గ్రామపంచాయితీలు ఉన్నాయి. క్లోరినేషన్, పారిశుధ్యం నివారణకు ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నుంచి ప్రతీ గ్రామ పంచాయతీకి శానిటేషన్‌ నిధులు రూ.10 వేలు, అన్‌టైడ్‌ నిధులు రూ.10 వేలు చొప్పున విడుదల చేస్తున్నా.. వాటిని∙సంబంధిత బాధ్యులు ఖాతాల్లో నుంచి డ్రా చేయకుండా చివరికి నకిలీ బిల్లులు సృష్టించి కాజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కెరమెరి, తిర్యాణి, వాంకిడి మండలాల్లో గిరిజనులకు 1800 దోమతెరలు అందించడంతోపాటు ఏజెన్సీ మొత్తంగా మరో పది వేల దోమతెరలు అందించాలని ఐటీడీఏ నిర్ణయం తీసుకున్నా.. వాటి సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది.S  
    కానరాని వైద్య సౌకర్యాలు 
    గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయి వైద్య సౌకర్యాలు కల్పించడం లేదు. స్థానికంగా ఉంటూ గిరిజనులకు వైద్యం అందించాలని ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా చాలామంది వైద్యసిబ్బంది దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో సకాలంలో సరైన వైద్యం అదండం లేదు. ఏజెన్సీ పరిధిలోని 31 పీహెచ్‌సీల్లో 73 మంది వైద్యాధికారులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో 13 మంది వైద్యాధికారులకు పీజీలు రావడంతో వారు పీహెచ్‌సీల నుంచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు వెళ్లిపోతే ఏజెన్సీ పీహెచ్‌సీల్లో వైద్యం అందించాడానికి 47 మంది వైద్యాధికారులు మాత్రమే ఉంటారు. మెరుగైన వైద్యం అదించేందుకు గతంలో ఐటీడీఏ ప్రారంభించిన పిన్‌ పాయింట్‌ కార్యక్రమం పడకేసింది.
     
    కొన్నేళ్లుగా వ్యాధులు, జ్వరాల పరిస్థితులను అంచనా వేస్తూ తగిన చర్యలు తీసుకోవడానికి ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపించడమే తప్ప.. సర్వేలో వెల్లడైన అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించి శాశ్వత నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ప్రస్తుతం ఏజెన్సీలోని నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిర్పూర్‌(యు), జైనూర్‌ సమస్యాత్మక మండలాల్లో ఐటీడీఏ ప్రత్యేకంగా పారిశుధ్యం నివారణకు ఎంపీడీవో, ఈవోపీఆర్డీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆరు వాహనాలు ఏర్పాటు చేసి ప్రతి వాహనంలో పది సిబ్బందిని నియమించి వారంలో మండలంలోని అన్ని గ్రామాల్లో చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేసినా ఆశించిన ఫలితాలు రావడం లేదనే విమర్శలున్నాయి. 
    చర్యలు తీసుకుంటున్నాం.. 
    జ్వరాలు, వ్యాధుల నివారణకు తగిన చర్యలు చేపతున్నాం. వైద్యాధికారులతోపాటు వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు గిరిజన గ్రామాల్లో సందర్శించి చర్యలు తీసుకునేలా కార్యాచరణ చేపట్టాం. ఏజెన్సీలోని 1567 గిరిజన గ్రామాల్లో కీటక వ్యాధుల నివారణకు, 1049 గిరిజన గ్రామాల్లో నీటి కాలుష్యంతో వ్యాప్తి చెందే వ్యాధులు, జ్వరాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి అమలు చేస్తున్నాం. అన్ని పీహెచ్‌సీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాం. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం.
    – ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అదనపు వైద్యాధికారి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement