గిరిజన ఉత్పత్తులకు 'బ్రాండింగ్‌' | Branding for tribal products | Sakshi
Sakshi News home page

గిరిజన ఉత్పత్తులకు 'బ్రాండింగ్‌'

Published Mon, Feb 21 2022 4:27 AM | Last Updated on Mon, Feb 21 2022 8:08 AM

Branding for tribal products - Sakshi

ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో గిరిజనులు సేకరించిన రాజ్మా

సాక్షి ప్రతినిధి, కర్నూలు: అడవి బిడ్డల కష్టాన్ని హైజాక్‌ చేస్తున్న దళారులకు రాష్ట్ర ప్రభుత్వం చెక్‌ పెడుతోంది. గిరిజనుల కష్టం వృథా కాకుండా వారు సేకరిస్తున్న 105 రకాల ఉత్పత్తులకు ‘బ్రాండింగ్‌’ కల్పించి, వాటిని గిరిజన సహకార సంస్థ ద్వారా మార్కెట్‌లో విక్రయిస్తోంది. ఇవి అరుదుగా దొరికే రకాలు, స్వచ్ఛమైన ఉత్పత్తులు కావడంతో మార్కెట్లో వీటికి మంచి గిరాకీ ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్పత్తులకు సంబంధించి రూ.34 కోట్ల టర్నోవర్‌ జరుగుతోంది. వచ్చే ఏడాది దీని విలువ ఏకంగా 40–50 శాతం పెరగనుంది. ఈ పరిణామాలు అడవిబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపడమే కాక వారికి ఆర్థిక దన్నుగా నిలుస్తున్నాయి.  

మార్కెటింగ్‌ సొసైటీల ఏర్పాటు         
నల్లమల ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ. వీరి అభివృద్ధి కోసం గిరిజన సహకార సంస్థ (జీసీసీ)ను 1987లో నంద్యాలలో స్థాపించారు. శ్రీశైలంలో ఐటీడీఏ ఏర్పడిన తర్వాత దీంతో కలిసి పనిచేసేందుకు 1989లో జీసీసీని శ్రీశైలానికి తరలించారు. రాష్ట్ర విభజన తర్వాత శ్రీశైలం డివిజన్‌లో నంద్యాల, ప్రకాశం జిల్లా దోర్నాలలో రెండు గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్‌ సొసైటీలు ఏర్పాటుచేశారు. ఇవికాకుండా పాడేరు, చింతపల్లి, రంపచోడవరంలోనూ సొసైటీలున్నాయి.

వీటి పరిధిలోని మండలాల్లో గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. తేనె, చింతపండు, త్రిఫల చూర్ణం, నన్నారి, అలోవిరా, జాస్మిన్, నీమ్‌ ఇంటర్నేషనల్‌ సబ్బులు, ఉసిరి, శీకాకాయ, కుంకుడు కాయలు, వీటిద్వారా తయారుచేసిన షాంపులు, రాజ్మా చిక్కుళ్లతో పాటు 105 రకాల ఉత్పత్తులు సేకరిస్తున్నారు. ఇందులో కర్నూలు, ప్రకాశం జిల్లాలోనే 58 రకాల ఉత్పత్తులు సేకరిస్తున్నారు. ఇవన్నీ ఎలాంటి కల్తీ లేకుండా లభించే స్వచ్ఛమైన అటవీ ఉత్పత్తులు. వీటిని ప్రాసెసింగ్‌ చేసి ప్యాకింగ్‌ చేసి ‘జీసీసీ’ పేరుతో బ్రాండింగ్‌ చేస్తున్నారు.

ఇంకొన్ని ఉత్పత్తుల ద్వారా సబ్బులు, షాంపులతో పాటు అరకు కాఫీ, వైశాఖీ కాఫీపొడి తయారుచేస్తున్నారు. వీటి కోసం హైదరాబాద్, తిరుపతి, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నంలో ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి నేరుగా మార్కెట్లకు విక్రయిస్తున్నారు. వీటి బ్రాండింగ్‌తో పాటు మార్కెటింగ్‌ విశాఖపట్నంలోని జీసీసీ ఆధ్వర్యంలో జరుగుతోంది. బ్రాండింగ్, వాటి ధర, ఉత్పత్తికి సంబంధించిన పూర్తి వివరాలు ప్యాకెట్‌పై ముద్రిస్తున్నారు. కల్తీ లేని స్వచ్ఛమైన ఉత్పత్తులు కావడంతో మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వీటికి ఎక్కువ డిమాండ్‌ ఏర్పడుతోంది.  

 తుట్టె నుంచి తేనెను సేకరిస్తున్న దృశ్యం  

ఉపాధి అవకాశాలు మెరుగు 
ఇటీవల వీటికి గిరాకీ పెరుగుతుండడంతో గిరిజనులు కూడా ఎక్కువగా అటవీ ఉత్పత్తులు సేకరిస్తున్నారు. అంతేకాక, వారి పొలాల్లో ఇతర పంటలు పండించి వాటిని సొసైటీకి ఇస్తున్నారు. దీంతో వీరికి కూడా ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. రాష్ట్రంలో అటవీ ఉత్పత్తులపై ఆధారపడే గిరిజనులు 3.78 లక్షల మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరు సేకరిస్తున్న ఉత్పత్తులను ప్రభుత్వం వినియోగదారులకు అందుబాటులోకి తేవడం ద్వారా కల్తీలేని స్వచ్ఛ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తోంది. సూపర్‌ మార్కెట్లలో జీసీసీ బ్రాండ్‌ ఉత్పత్తులు భారీగా సేల్‌ అవుతున్నాయి. కొన్ని ఉత్పత్తులు లభించడంలేదు కూడా.  

గిరిజనుల కోసం నిత్యావసర డిపోలు 
గిరిజనుల ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో పాటు వీరికి అవసరమయ్యే వస్తువులు వినియోగించేలా నంద్యాల, ప్రకాశం జిల్లాలోని దోర్నాల సొసైటీలతో పాటు ఇతర సొసైటీలలో నిత్యావసర డిపోలు ఏర్పాటుచేశారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం, చక్కెర, కందిపప్పుతో పాటు జీసీసీ బ్రాండ్‌ పసుపు, కారం, చింతపండు, కాఫీ, సబ్బులు, షాంపులు, తదితర వస్తువులు ఇక్కడ అందిస్తారు. అలాగే, ఐటీడీఏ పరిధిలో కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 100 గిరిజన హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. వీటికి కావల్సిన ఆహార వస్తువులు, కాస్మోటిక్స్, శానిటరీ వస్తువులు కూడా శ్రీశైలం ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేసి సరఫరా చేస్తారు. దీంతో పాటు వీరి అభివృద్ధి కోసం 171 చెంచుగూడేల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఫలితంగా గిరిజనుల ఆర్థిక స్థోమత పెరిగి సంతోషంగా జీవిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement