నన్నారి మొక్కల సాగును పరిశీలిస్తున్న పీవో రవీంద్రరెడ్డి
(నల్లమల నుంచి సాక్షి ప్రతినిధి ఐ.ఉమామహేశ్వరరావు)
అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఆదివాసీ గిరిజనులు ఇప్పుడు నన్నారి (షర్బత్ తయారీకి ఉపయోగించేది)పై గురిపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇప్పుడు దీనికి బ్రాండ్ ఇమేజ్ కల్పించేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీశైలంలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నేతృత్వంలో నన్నారి (సుగంధి) ఉత్పత్తికి ఊతమిస్తోంది.
ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లోని నల్లమల అటవీ ప్రాంతంలో 171 గూడెంలలో నివసించే 27,857 మంది చెంచుల జీవనోపాధికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిజానికి అక్కడి చెంచులు నల్లమల అడవిపై ఆధారపడి సంచార జీవనం సాగిస్తుంటారు.
వీరికి అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు పంచడమే కాకుండా ఆ భూముల్లో సాగు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. చెంచులు వ్యవసాయ ఉత్పత్తులతోపాటు అటవీ ఫలసాయమైన నన్నారి, తేనె, ఉసిరి, కుంకుడు కాయలు, మాడపాకులు, ముష్టి గింజలు, చింతపండు వంటి వాటిని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కేంద్రాలకు మద్దతు ధరకు విక్రయించి కుటుంబాలను పోషించుకుంటున్నారు.
నన్నారి ఉత్పత్తికి ఊతం..
ఇక నన్నారి చెట్ల సాగు, ఉత్పత్తి, విక్రయాలకు శ్రీశైలం ఐటీడీఏ అనేక చర్యలు చేపడుతోంది. కర్నూలు జిల్లా డి.వనిపెంట చెంచుగూడెంలో 20 మంది చెంచు రైతులు 20 ఎకరాల్లో గత మూడేళ్లుగా నన్నారి సాగుచేస్తున్నారు. మరో 12 మంది 30 ఎకరాల మామిడి తోటల్లోను అంతర పంటగా నన్నారి సాగుచేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నారు.
ఐటీడీఏ ప్రోత్సాహంతో అనేక చెంచు కుటుంబాలు ఇళ్ల ముంగిటే ఈ మొక్కల సాగుచేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 2వేల కుటుంబాలు ఈ సాగుతో ఉపాధి పొందుతున్నాయి. మరో వంద ఎకరాల్లో సాగుకు ఐటీడీఏ అధికారులు కార్యాచరణ చేపట్టారు. నన్నారి గడ్డలు (ముడిసరుకు) కిలో రూ.450 నుంచి రూ.600 కొనుగోలు చేసి నన్నారి షర్బత్ తయారీకి వినియోగిస్తున్నారు.
మూడు జిల్లాల్లో 13 వికాస కేంద్రాలు
నిజానికి.. గిరిజనుల వద్ద వ్యాపారులు చౌకగా కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పద్ధతికి స్వస్తి పలికి గిరిజనులే మంచి ధరకు అమ్ముకునేలా అటవీ ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే నల్లమల బ్రాండ్ పేరుతో అటవీ ఉత్పత్తులను విక్రయించాలని సంకల్పించింది.
మూడు జిల్లాల్లో 13 ప్రధానమంత్రి వన్‌ధన్ వికాస కేంద్రాలు (ప్రకాశం–5, నంద్యాల–6, పల్నాడు–2) కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఒక్కో కేంద్రంలో 15 గ్రూపులు (300 మంది సభ్యులు) చొప్పున మొత్తం 13 వికాస కేంద్రాల్లో 3,900 మంది సభ్యులకు అవకాశం కల్పించారు. వీటి ద్వారా నన్నారితోపాటు వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఫలసాయాన్ని గిరిజనులు విక్రయించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ కేంద్రాలను అనుసంధానిస్తూ డోర్నాలలో ఐదు ఎకరాల్లో ట్రైబల్ పార్కు ఏర్పాటుచేసి గిరిజనుల ఉత్పత్తులను విక్రయించనున్నారు.
నన్నారితో షర్బత్ తయారీ శిక్షణ
వేసవిలో దాహార్తిని తీర్చడంతోపాటు శక్తినిచ్చే నన్నారి షర్బత్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం ఐటీడీఏ ఆధ్వర్వంలో ప్రస్తుతం 10 కేంద్రాల్లో వెయ్యి మందికిపైగా చెంచులకు నన్నారి శుద్ధి, షర్బత్ తయారీపై శిక్షణనిచ్చారు. అడవి నుంచి సేకరించిన నన్నారి వేర్లను ప్రాసెసింగ్ చేస్తారు. శుద్ధిచేసిన ఒక కిలో నన్నారి గడ్డలతో నీరు, పంచదార, నిమ్మ ఉప్పు, ప్రిజర్వేటివ్, కొద్దిపాటి రంగుతో 25 లీటర్ల నన్నారి పానీయం తయారవుతుంది. లీటరు షర్బత్ తయారీకి రూ.వంద అయితే దాన్ని రూ.150కి విక్రయిస్తారు.
నల్లమల బ్రాండ్‌తో విక్రయాలు
చెంచులు సేకరించే నన్నారి, తేనె, వనమూలికలతోపాటు ఇతర అటవీ ఉత్పత్తులను బ్రాండ్ నల్లమల పేరుతో విక్రయించేలా శ్రీశైలం ఐటీడీఏ పాలక మండలి ఇటీవల తీర్మానించింది. ఇప్పటికే నన్నారి షర్బత్ తయారీపై యువతకు శిక్షణనిచ్చాం. నన్నారి దుంపల (వేర్లు) శుద్ధికోసం రూ.3 లక్షల చొప్పున రెండు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేస్తున్నాం.
నన్నారి సాగును ప్రోత్సహించడంతోపాటు ఉద్యానవన సాగుకు ఊతమిస్తున్నాం. ఐదువేల మామిడి మొక్కలను పంపిణీ చేశాం. తిరుపతిలోని చినీ, నిమ్మ పరిశోధన స్థానం నుంచి స్వీట్ ఆరంజ్ (రంగపురి రకం) 3వేల మొక్కలను పంపిణీ చేశాం. 750 ఎకరాల్లో చెంచులు మిరప పండిస్తుండటంతో చిల్లీపౌడర్ (కారం) తయారుచేసే కేంద్రాన్ని డోర్నాలలో ఏర్పాటుచేస్తున్నాం.
యర్రగొండపాలెం, సున్నిపెంటలో వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్) ద్వారా యువతకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌తోపాటు ఫుడ్, గూడ్స్ ప్యాకింగ్‌పైన శిక్షణనిచ్చాం. చెంచుల అటవీ ఉత్పత్తుల ప్రాసెస్ చేసి విక్రయించేందుకు మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టాం.
– బి. రవీంద్రరెడ్డి, ప్రాజెక్టు అధికారి, శ్రీశైలం ఐటీడీఏ
Comments
Please login to add a commentAdd a comment