Nannari Sarbath
-
'నన్నారి'కి నల్లమల బ్రాండ్!
(నల్లమల నుంచి సాక్షి ప్రతినిధి ఐ.ఉమామహేశ్వరరావు) అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఆదివాసీ గిరిజనులు ఇప్పుడు నన్నారి (షర్బత్ తయారీకి ఉపయోగించేది)పై గురిపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇప్పుడు దీనికి బ్రాండ్ ఇమేజ్ కల్పించేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీశైలంలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నేతృత్వంలో నన్నారి (సుగంధి) ఉత్పత్తికి ఊతమిస్తోంది. ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లోని నల్లమల అటవీ ప్రాంతంలో 171 గూడెంలలో నివసించే 27,857 మంది చెంచుల జీవనోపాధికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిజానికి అక్కడి చెంచులు నల్లమల అడవిపై ఆధారపడి సంచార జీవనం సాగిస్తుంటారు. వీరికి అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంచడమే కాకుండా ఆ భూముల్లో సాగు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. చెంచులు వ్యవసాయ ఉత్పత్తులతోపాటు అటవీ ఫలసాయమైన నన్నారి, తేనె, ఉసిరి, కుంకుడు కాయలు, మాడపాకులు, ముష్టి గింజలు, చింతపండు వంటి వాటిని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కేంద్రాలకు మద్దతు ధరకు విక్రయించి కుటుంబాలను పోషించుకుంటున్నారు. నన్నారి ఉత్పత్తికి ఊతం.. ఇక నన్నారి చెట్ల సాగు, ఉత్పత్తి, విక్రయాలకు శ్రీశైలం ఐటీడీఏ అనేక చర్యలు చేపడుతోంది. కర్నూలు జిల్లా డి.వనిపెంట చెంచుగూడెంలో 20 మంది చెంచు రైతులు 20 ఎకరాల్లో గత మూడేళ్లుగా నన్నారి సాగుచేస్తున్నారు. మరో 12 మంది 30 ఎకరాల మామిడి తోటల్లోను అంతర పంటగా నన్నారి సాగుచేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఐటీడీఏ ప్రోత్సాహంతో అనేక చెంచు కుటుంబాలు ఇళ్ల ముంగిటే ఈ మొక్కల సాగుచేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 2వేల కుటుంబాలు ఈ సాగుతో ఉపాధి పొందుతున్నాయి. మరో వంద ఎకరాల్లో సాగుకు ఐటీడీఏ అధికారులు కార్యాచరణ చేపట్టారు. నన్నారి గడ్డలు (ముడిసరుకు) కిలో రూ.450 నుంచి రూ.600 కొనుగోలు చేసి నన్నారి షర్బత్ తయారీకి వినియోగిస్తున్నారు. మూడు జిల్లాల్లో 13 వికాస కేంద్రాలు నిజానికి.. గిరిజనుల వద్ద వ్యాపారులు చౌకగా కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పద్ధతికి స్వస్తి పలికి గిరిజనులే మంచి ధరకు అమ్ముకునేలా అటవీ ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే నల్లమల బ్రాండ్ పేరుతో అటవీ ఉత్పత్తులను విక్రయించాలని సంకల్పించింది. మూడు జిల్లాల్లో 13 ప్రధానమంత్రి వన్‌ధన్ వికాస కేంద్రాలు (ప్రకాశం–5, నంద్యాల–6, పల్నాడు–2) కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఒక్కో కేంద్రంలో 15 గ్రూపులు (300 మంది సభ్యులు) చొప్పున మొత్తం 13 వికాస కేంద్రాల్లో 3,900 మంది సభ్యులకు అవకాశం కల్పించారు. వీటి ద్వారా నన్నారితోపాటు వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఫలసాయాన్ని గిరిజనులు విక్రయించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ కేంద్రాలను అనుసంధానిస్తూ డోర్నాలలో ఐదు ఎకరాల్లో ట్రైబల్ పార్కు ఏర్పాటుచేసి గిరిజనుల ఉత్పత్తులను విక్రయించనున్నారు. నన్నారితో షర్బత్ తయారీ శిక్షణ వేసవిలో దాహార్తిని తీర్చడంతోపాటు శక్తినిచ్చే నన్నారి షర్బత్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం ఐటీడీఏ ఆధ్వర్వంలో ప్రస్తుతం 10 కేంద్రాల్లో వెయ్యి మందికిపైగా చెంచులకు నన్నారి శుద్ధి, షర్బత్ తయారీపై శిక్షణనిచ్చారు. అడవి నుంచి సేకరించిన నన్నారి వేర్లను ప్రాసెసింగ్ చేస్తారు. శుద్ధిచేసిన ఒక కిలో నన్నారి గడ్డలతో నీరు, పంచదార, నిమ్మ ఉప్పు, ప్రిజర్వేటివ్, కొద్దిపాటి రంగుతో 25 లీటర్ల నన్నారి పానీయం తయారవుతుంది. లీటరు షర్బత్ తయారీకి రూ.వంద అయితే దాన్ని రూ.150కి విక్రయిస్తారు. నల్లమల బ్రాండ్‌తో విక్రయాలు చెంచులు సేకరించే నన్నారి, తేనె, వనమూలికలతోపాటు ఇతర అటవీ ఉత్పత్తులను బ్రాండ్ నల్లమల పేరుతో విక్రయించేలా శ్రీశైలం ఐటీడీఏ పాలక మండలి ఇటీవల తీర్మానించింది. ఇప్పటికే నన్నారి షర్బత్ తయారీపై యువతకు శిక్షణనిచ్చాం. నన్నారి దుంపల (వేర్లు) శుద్ధికోసం రూ.3 లక్షల చొప్పున రెండు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేస్తున్నాం. నన్నారి సాగును ప్రోత్సహించడంతోపాటు ఉద్యానవన సాగుకు ఊతమిస్తున్నాం. ఐదువేల మామిడి మొక్కలను పంపిణీ చేశాం. తిరుపతిలోని చినీ, నిమ్మ పరిశోధన స్థానం నుంచి స్వీట్ ఆరంజ్ (రంగపురి రకం) 3వేల మొక్కలను పంపిణీ చేశాం. 750 ఎకరాల్లో చెంచులు మిరప పండిస్తుండటంతో చిల్లీపౌడర్ (కారం) తయారుచేసే కేంద్రాన్ని డోర్నాలలో ఏర్పాటుచేస్తున్నాం. యర్రగొండపాలెం, సున్నిపెంటలో వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్) ద్వారా యువతకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌తోపాటు ఫుడ్, గూడ్స్ ప్యాకింగ్పైన శిక్షణనిచ్చాం. చెంచుల అటవీ ఉత్పత్తుల ప్రాసెస్ చేసి విక్రయించేందుకు మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టాం. – బి. రవీంద్రరెడ్డి, ప్రాజెక్టు అధికారి, శ్రీశైలం ఐటీడీఏ -
మారేడు తెచ్చి.. నన్నారి షర్బత్ చేసి..
ప్రకృతినే నమ్ముకున్న గిరిజనులు వాటినే ఆధారం చేసుకుని మంచి ఆహార ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ప్రతి ఏడాది వేసవి సమీపిస్తే అడవిలో మారేడును సేకరించి నన్నారి షర్బత్ తయారీకి పూనుకుంటారు. అనుకున్నదే తడవుగా ఒక సంఘంగా ఏర్పడి విరివిగా షర్బత్‌ను తయారుచేసి విక్రయిస్తున్నారు. వేసవి నేపథ్యంలో రసాయనాలు లేకుండా తయారు చేస్తున్న సన్నారి షర్బత్‌కు డిమాండ్ పెరిగింది. దీంతోపాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేస్తున్న గిరిజనులు ఆర్థిక పరిపుష్టికి అడుగులు వేస్తున్నారు. సాక్షి, నెల్లూరు : జిల్లాలోని రాపూరు మండలంలో నన్నారి షర్బత్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన గిరిజనులు దీనినే ఉపాధిగా మార్చుకున్నారు. స్థానిక వెలుగొండల్లో దొరికే అటవీ ఫలసాయాన్ని సేకరించి నన్నారీని తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసి ఆదాయం గడిస్తున్నారు. ప్రకృతి వనరులతో తయారు చేసే నన్నారి షర్బత్‌లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని ద్వారా శరీర ఉష్ణోగ్రత్త తగ్గుతుంది. సంఘటితంగా ఏర్పడి వెలుగొండలను ఆనుకుని ఉన్న రాపూరు మండలంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. స్థానికంగా ఉన్న అటవీనే నమ్ముకుని జీవించే గిరిజన మహిళలు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. దశాబ్దకాలంలోనే గిరిజనులు సంఘటితంగా ఏర్పడి గ్రామస్థాయి సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆపై శ్రీ లక్ష్మీ నరసింహ యానాది మండల సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. ఆపై వారి జీవన విధానం మెరుగు పరుచుకునేందుకు ప్రధాన మంత్రి వన్‌ధన్ యోజన కార్యక్రమం ఏర్పాటుచేసి తద్వారా మెరుగైన జీవనోపాధులు కల్పించుకోవడం జరిగింది. వెలుగొండల్లో ముడిసరుకు సేకరించి.. వెలుగొండల్లో విరివిగా కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరిస్తారు. 275 మంది గిరిజన సభ్యులు వన్‌ధన్ వికాస కేంద్రం(వీడీవీకే) ఏర్పాటు చేసుకుని అటవీ ఫలసాయం సేకరణ చేస్తున్నారు. వీరికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఐటీడీఏ శాఖల ఆధ్వర్యంలో గిరిజనులకు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి కావలసిన శిక్షణ కార్యక్రమాలు, తయారీ, మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టారు. ఉసిరితో.. అలాగే జనవరి నుంచి మార్చి నెల వరకు వెలుగొండ అడవుల్లో ఉసిరి కాయల సేకరణ జరుగుతుంది. ఈ సీజన్లో దాదాపు 20 టన్నుల ఉసిరి కాయలను సేకరిస్తుంటారు. దాదాపు 150 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. సేకరించిన ఉసిరికాయలను కేజీ రూ.30ల చొప్పున దళారులు గిరిజనుల వద్ద నుంచి కొనుగోలు చేస్తుంటారు. విలువ ఆధారిత ఉత్పత్తిలో భాగంగా ఉసిరి కాయలతో ఉసిరి క్యాండీలు చేయడం వలన, మూడు కేజీల ఉసిరికాయలతో ఒక కేజీ క్యాండీలను తయారీ చేస్తారు. వీటి విలువ మార్కెట్లో రూ.500గా ఉంది. ఈ ఉసిరి క్యాండీల తయారీలో దాదాపు 30 మంది గిరిజనులు శిక్షణ పొందారు. చక్కెర పాకంలో ఉడకబెట్టిన ఉసిరి కాయలను నానబెట్టడం ద్వారా ఈ క్యాండీలను తయారు చేస్తారు. తయారీ ఖర్చు పోగా, మిగిలిన ఆదాయాన్ని సమంగా పంచుకుంటూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. అలాగే నిమ్మకాయ ఊరగాయల తయారీ, స్వచ్ఛమైన తేనె సేకరణ చేసి విక్రయాలు చేస్తున్నారు. ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం గిరిజనులు తయారు చేసిన అటవీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ ఉత్పత్తులను పెంచలకోన నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో మార్కెటింగ్ చేసేలా స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సాయం చేశారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ ద్వారా అటవీ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుత మార్కెట్లో కూడా పెంచలకోన నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఎటువంటి కల్తీ లేని అటవీ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి రావడంతో ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ ఫలసాయంతో మండలంలోని దాదాపు 1,590 పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. విలువపెంచి విక్రయాలు అడవుల్లో సేకరించే కలపేతర అటవీ ఉత్పత్తులకు ముడిసరుకులు విక్రయిస్తే అంతగా ఆదాయం వచ్చేది కాదు. ముడిసరుకులను బయటకు వెళ్లి వస్తువుల విలువలను పెంచి అమ్మడం ద్వారా మంచి ఆదాయం వస్తుంది. ఒక కేజీ కుంకుళ్లు అమ్మితే రూ.20 వస్తుంది. అదే విత్తనాలను వేరు చేసి అమ్మితే కేజీ రూ.140 వస్తుంది. ఉసిరి కేజీ అమ్మితే రూ.30 వస్తుంది అదే ఆమ్ల క్యాండీలుగా చేసి అమ్మితే కేజీ రూ.500 వరకు వస్తుంది. మారేడు కూడా కేజీ రూ.350 వస్తుంది అదే నన్నారి షర్బత్ చేసి అమ్మితే రూ.2500 వస్తుంది. ఇలా లాభదాయకంగా ఉంది. – వెలుగు సుబ్బయ్య, వన్‌ధన్ వికాస కేంద్రం అధ్యక్షుడు అందరం సంపాదిస్తున్నాం వన్‌ధన్ వికాస కేంద్రం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పని దొరుకుతోంది. ఇంట్లోని వారంతా సంపాదిస్తుండడంతో ఆనందంగా జీవిస్తున్నాం. డీఆర్డీఏ, ఐటీడీఏ, జీసీసీ వారు మాకు శిక్షణ ఇచ్చి ఆర్థికంగా ఎదిగేందుకు సాయం చేశారు. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. – గాలి శ్రీనివాసులు, వన్‌ధన్ వికాస కేంద్రం కార్యదర్శి నన్నారి తయారీ ఇలా.. శ్రీ లక్ష్మీనరసింహ యానాది మండల సమాఖ్యలోని సభ్యుల్లో దాదాపుగా 30 మంది నన్నారి షర్బత్ తయారీలో నిష్ణాతులుగా ఉన్నారు. అలాగే 150 మంది నన్నారి షర్బత్‌కు కావల్సిన మారేడు గడ్డలను సేకరించి ప్రాసెసింగ్ చేస్తుంటారు. గాలి వెంకటేశ్వర్లు, గాలి శ్రీనివాసులు, వెలుగు సుబ్బయ్య, యాకసిరి జయరామయ్య, నారాయణ, నల్లు శివ మొదలగు వారు ఈ నన్నారి షర్బత్‌ను తయారు చేస్తుంటారు. జనవరి నుంచి జూన్ నెల వరకు నన్నారి షర్బత్ తయారీ మీద గిరిజనులు దృష్టి పెడుతుంటారు. దీనికి కావల్సిన మారేడు గడ్డలను వెలిగొండ అడవుల్లో జనవరి నుంచి మే నెల వరకు సేకరిస్తారు. ఈ సీజన్లో దాదాపుగా 10 నుంచి 15 టన్నుల వరకు మారేడు గడ్డలను సేకరిస్తారు. సాధారణంగా ఒక కేజీ గడ్డల విలువ రూ.400 ఉండగా ఒక కేజీ నుంచి 30 లీటర్ల నన్నారి షర్బత్‌ను తయారు చేయవచ్చు. మార్కెట్లో ఒక లీటర్ రూ.160 ఉండగా కేజీ మారేడుతో దాదాపుగా రూ.4,800 ఆదాయం వస్తుంది. ఇలా 15 టన్నులకు రూ.72 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అందులో తయారీకి కావల్సిన ఇతర దినుసుల ఖర్చు, తయారీ ఖర్చు, లేబర్ వంటి వాటిని తీసేయగా మిగిలిన ఆదాయాన్ని సమంగా పంచుకుంటూ ఆర్థికంగా పురోగమిస్తున్నారు. -
షర్బత్ మార్కెట్లో నన్నారి జోరు!
- 20 రోజుల్లో రూ. 20 లక్షల అమ్మకాలు - అనూహ్య డిమాండ్‌తో జీసీసీ తబ్బిబ్బు సాక్షి, విశాఖపట్నం: రాయలసీమ జిల్లాల్లో ప్రాచుర్యం పొందిన ప్రకృతి సిద్ధ షర్బత్ ‘నన్నారి’... కూల్‌డ్రింక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. మార్కెట్లోకి విడుదలైందో లేదో... విపరీతమైన డిమాండ్‌తో శీతల పానీయాల కంపెనీలకు సవాల్ విసురుతోంది. కేవలం 20 రోజుల్లో రూ.20 లక్షల అమ్మకాలతో ఈ షర్బత్ రికార్డు సృష్టించింది. మారేడు గెడ్డల వేళ్ల నుంచి ఉత్పత్తి చేసే ఈ పానీయాన్ని గిరిజన సహకార సంస్థ ఈ నెల 3వ తేదీన మార్కెట్లోకి విడుదల చేసింది. ఐదవ తేదీ నుంచి అమ్మకాలు మొదలుపెట్టగా... కేవలం 20 రోజుల్లో రాష్ర్టవ్యాప్తంగా 20 వేల బాటిల్స్‌ను విక్రయించారు. ఒకో బాటిల్ రూ.100 విలువ చేసే నన్నారి కోసం... మార్కెట్లోకి విడుదల చేసే సమయానికే సుమారు 10 వేల బాటిల్స్‌కు ఆర్డర్లు వచ్చాయి. పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదల చేశాక ఊహించని రీతిలో డిమాండ్ రావటంతో దానికి అనుగుణంగా జీసీసీ సరఫరా చేయలేకపోతోంది. చిత్తూరులో ప్రస్తు తం ఉన్న తేనె శుద్ధి కర్మాగార సముదాయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యూనిట్ ద్వారా రోజుకు వెయ్యి బాటిల్స్ షర్బత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఏడాదికి 50 వేల బాటిళ్ల వరకు ఉత్పత్తి చేయాలని తొలుత సంకల్పించారు. ఇందుకోసం 100 క్వింటాళ్ల మారేడు గెడ్డలు అవసరమవుతాయని అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో 20 రోజుల్లోనే 20వేల బాటిల్స్ అమ్ముడుపోవటంతో వేసవి సీజన్ ముగిసే నాటికి మరో 30 వేల బాటిల్స్‌కు పైగా అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన సీజన్లలోనూ ఇదే రీతిలో డిమాండ్ ఉండే అవకాశాలుండడంతో ప్రస్తుతం గిరిజనుల నుంచి సేకరిస్తున్న 200 క్వింటాళ్ల మారేడు గెడ్డలను పూర్తిగా ఈ ఏడాదే నన్నారి షర్బత్ తయారీకి ఉపయోగించాలన్న ఆలోచనలో జీసీసీ ఉంది. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. మార్కెట్లో లభించే శీతల పానీయాలతో పోలిస్తే కృత్రిమమైన రంగులు కలుపకుండా సహజసిద్ధమైన మారేడు గెడ్డల నుంచి ఉత్పత్తి అవుతుండడం, అనేక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి దోహదపడే ఆయుర్వేద గుణాలుండడంతో వీటికి ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడిందని జీసీసీ వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్పీఎస్ రవి ప్రకాష్ తెలిపారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రితో పాటు ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో షర్బత్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని ‘సాక్షి’కి తెలిపారు. 750 ఎంఎల్ సామర్థ్యం గల ఒక బాటిల్‌ను నీటిలో కలుపుకొని సుమారు 100 గ్లాసుల వరకు సరఫరా చేసేందుకు వీలుంటుందన్నారు.