ప్రకృతినే నమ్ముకున్న గిరిజనులు వాటినే ఆధారం చేసుకుని మంచి ఆహార ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ప్రతి ఏడాది వేసవి సమీపిస్తే అడవిలో మారేడును సేకరించి నన్నారి షర్బత్ తయారీకి పూనుకుంటారు. అనుకున్నదే తడవుగా ఒక సంఘంగా ఏర్పడి విరివిగా షర్బత్‌ను తయారుచేసి విక్రయిస్తున్నారు. వేసవి నేపథ్యంలో రసాయనాలు లేకుండా తయారు చేస్తున్న సన్నారి షర్బత్‌కు డిమాండ్ పెరిగింది. దీంతోపాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేస్తున్న గిరిజనులు ఆర్థిక పరిపుష్టికి అడుగులు వేస్తున్నారు.
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని రాపూరు మండలంలో నన్నారి షర్బత్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన గిరిజనులు దీనినే ఉపాధిగా మార్చుకున్నారు. స్థానిక వెలుగొండల్లో దొరికే అటవీ ఫలసాయాన్ని సేకరించి నన్నారీని తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేసి ఆదాయం గడిస్తున్నారు. ప్రకృతి వనరులతో తయారు చేసే నన్నారి షర్బత్‌లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని ద్వారా శరీర ఉష్ణోగ్రత్త తగ్గుతుంది.
సంఘటితంగా ఏర్పడి
వెలుగొండలను ఆనుకుని ఉన్న రాపూరు మండలంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. స్థానికంగా ఉన్న అటవీనే నమ్ముకుని జీవించే గిరిజన మహిళలు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. దశాబ్దకాలంలోనే గిరిజనులు సంఘటితంగా ఏర్పడి గ్రామస్థాయి సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆపై శ్రీ లక్ష్మీ నరసింహ యానాది మండల సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. ఆపై వారి జీవన విధానం మెరుగు పరుచుకునేందుకు ప్రధాన మంత్రి వన్‌ధన్ యోజన కార్యక్రమం ఏర్పాటుచేసి తద్వారా మెరుగైన జీవనోపాధులు కల్పించుకోవడం జరిగింది.
వెలుగొండల్లో ముడిసరుకు సేకరించి..
వెలుగొండల్లో విరివిగా కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరిస్తారు. 275 మంది గిరిజన సభ్యులు వన్‌ధన్ వికాస కేంద్రం(వీడీవీకే) ఏర్పాటు చేసుకుని అటవీ ఫలసాయం సేకరణ చేస్తున్నారు. వీరికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఐటీడీఏ శాఖల ఆధ్వర్యంలో గిరిజనులకు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి కావలసిన శిక్షణ కార్యక్రమాలు, తయారీ, మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టారు.
ఉసిరితో..
అలాగే జనవరి నుంచి మార్చి నెల వరకు వెలుగొండ అడవుల్లో ఉసిరి కాయల సేకరణ జరుగుతుంది. ఈ సీజన్లో దాదాపు 20 టన్నుల ఉసిరి కాయలను సేకరిస్తుంటారు. దాదాపు 150 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. సేకరించిన ఉసిరికాయలను కేజీ రూ.30ల చొప్పున దళారులు గిరిజనుల వద్ద నుంచి కొనుగోలు చేస్తుంటారు. విలువ ఆధారిత ఉత్పత్తిలో భాగంగా ఉసిరి కాయలతో ఉసిరి క్యాండీలు చేయడం వలన, మూడు కేజీల ఉసిరికాయలతో ఒక కేజీ క్యాండీలను తయారీ చేస్తారు. వీటి విలువ మార్కెట్లో రూ.500గా ఉంది. ఈ ఉసిరి క్యాండీల తయారీలో దాదాపు 30 మంది గిరిజనులు శిక్షణ పొందారు. చక్కెర పాకంలో ఉడకబెట్టిన ఉసిరి కాయలను నానబెట్టడం ద్వారా ఈ క్యాండీలను తయారు చేస్తారు. తయారీ ఖర్చు పోగా, మిగిలిన ఆదాయాన్ని సమంగా పంచుకుంటూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. అలాగే నిమ్మకాయ ఊరగాయల తయారీ, స్వచ్ఛమైన తేనె సేకరణ చేసి విక్రయాలు చేస్తున్నారు.
ఆన్‌లైన్ మార్కెటింగ్ సదుపాయం
గిరిజనులు తయారు చేసిన అటవీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ ఉత్పత్తులను పెంచలకోన నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో మార్కెటింగ్ చేసేలా స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సాయం చేశారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ ద్వారా అటవీ ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా మార్కెటింగ్ చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో కూడా పెంచలకోన నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఎటువంటి కల్తీ లేని అటవీ ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి రావడంతో ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ ఫలసాయంతో మండలంలోని దాదాపు 1,590 పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.
విలువపెంచి విక్రయాలు
అడవుల్లో సేకరించే కలపేతర అటవీ ఉత్పత్తులకు ముడిసరుకులు విక్రయిస్తే అంతగా ఆదాయం వచ్చేది కాదు. ముడిసరుకులను బయటకు వెళ్లి వస్తువుల విలువలను పెంచి అమ్మడం ద్వారా మంచి ఆదాయం వస్తుంది. ఒక కేజీ కుంకుళ్లు అమ్మితే రూ.20 వస్తుంది. అదే విత్తనాలను వేరు చేసి అమ్మితే కేజీ రూ.140 వస్తుంది. ఉసిరి కేజీ అమ్మితే రూ.30 వస్తుంది అదే ఆమ్ల క్యాండీలుగా చేసి అమ్మితే కేజీ రూ.500 వరకు వస్తుంది. మారేడు కూడా కేజీ రూ.350 వస్తుంది అదే నన్నారి షర్బత్ చేసి అమ్మితే రూ.2500 వస్తుంది. ఇలా లాభదాయకంగా ఉంది.
– వెలుగు సుబ్బయ్య, వన్‌ధన్ వికాస కేంద్రం అధ్యక్షుడు
అందరం సంపాదిస్తున్నాం
వన్‌ధన్ వికాస కేంద్రం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పని దొరుకుతోంది. ఇంట్లోని వారంతా సంపాదిస్తుండడంతో ఆనందంగా జీవిస్తున్నాం. డీఆర్‌డీఏ, ఐటీడీఏ, జీసీసీ వారు మాకు శిక్షణ ఇచ్చి ఆర్థికంగా ఎదిగేందుకు సాయం చేశారు. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం.
– గాలి శ్రీనివాసులు, వన్‌ధన్ వికాస కేంద్రం కార్యదర్శి
నన్నారి తయారీ ఇలా..
శ్రీ లక్ష్మీనరసింహ యానాది మండల సమాఖ్యలోని సభ్యుల్లో దాదాపుగా 30 మంది నన్నారి షర్బత్ తయారీలో నిష్ణాతులుగా ఉన్నారు. అలాగే 150 మంది నన్నారి షర్బత్‌కు కావల్సిన మారేడు గడ్డలను సేకరించి ప్రాసెసింగ్ చేస్తుంటారు. గాలి వెంకటేశ్వర్లు, గాలి శ్రీనివాసులు, వెలుగు సుబ్బయ్య, యాకసిరి జయరామయ్య, నారాయణ, నల్లు శివ మొదలగు వారు ఈ నన్నారి షర్బత్‌ను తయారు చేస్తుంటారు.
జనవరి నుంచి జూన్ నెల వరకు నన్నారి షర్బత్ తయారీ మీద గిరిజనులు దృష్టి పెడుతుంటారు. దీనికి కావల్సిన మారేడు గడ్డలను వెలిగొండ అడవుల్లో జనవరి నుంచి మే నెల వరకు సేకరిస్తారు. ఈ సీజన్‌లో దాదాపుగా 10 నుంచి 15 టన్నుల వరకు మారేడు గడ్డలను సేకరిస్తారు. సాధారణంగా ఒక కేజీ గడ్డల విలువ రూ.400 ఉండగా ఒక కేజీ నుంచి 30 లీటర్ల నన్నారి షర్బత్‌ను తయారు చేయవచ్చు. మార్కెట్లో ఒక లీటర్ రూ.160 ఉండగా కేజీ మారేడుతో దాదాపుగా రూ.4,800 ఆదాయం వస్తుంది. ఇలా 15 టన్నులకు రూ.72 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అందులో తయారీకి కావల్సిన ఇతర దినుసుల ఖర్చు, తయారీ ఖర్చు, లేబర్ వంటి వాటిని తీసేయగా మిగిలిన ఆదాయాన్ని సమంగా పంచుకుంటూ ఆర్థికంగా పురోగమిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment