nellore district court
-
పచ్చని సంసారంలో చిచ్చురేపిన మద్యం
నెల్లూరు (క్రైమ్): పచ్చని సంసారంలో మద్యం చిచ్చు రేపింది. ఉరేసుకుని భార్య, రైలు కింద పడి భర్త ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన నెల్లూరు నగరం ఎన్టీఆర్నగర్లో శనివారం జరిగింది. అభం శుభం తెలియని ఇద్దరు బిడ్డలు అనాథలయ్యారు. దంపతులు బలవన్మరణం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఏం జరిగిందో తెలియక మృతుల కుమారులిద్దరూ అటు ఇటూ తిరుగుతూ ఉండడం చూపరులను కంట తడి పెట్టించింది. ఎన్టీఆర్ నగర్‌కు చెందిన కె. నాగరాజు(23), సురేఖ (19) నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఎంతో అన్యోన్యంగా ఉంటున్నా రు. వారికి మూడేళ్లు, పదకొండు నెలల కుమారులు ఉన్నారు. నాగరాజు మార్బుల్స్, టైల్స్ పనులు చేసుకుంటుండగా, సురేఖ మాగుంట లేఅవుట్లోని ఓ బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు సంతోషంగా సాగుతున్న వీరి కాపురాన్ని మద్యం విచ్ఛిన్నం చేసింది. మద్యానికి బానిసైన నాగరాజు సంపాదించిందతా మద్యానికి ఖర్చు చేయడంతో పాటు అప్పులు చేశాడు. దీంతో కుటుంబ భారం సురేఖపై పడింది. ఆమె తాను సంపాదించిన మొత్తంలో కొంత కుటుంబ పోషణకు ఖర్చు చేసి మిగిలిన దాంతో అప్పులు తీర్చింది. పలుమార్లు మద్యం మానేయమని, అప్పులు చేయొద్దని భర్తను ప్రాధేయపడింది. అయినా అతని తీరులో మార్పు రాలేదు. కొద్ది రోజులుగా పుట్టింటికి వెళ్లి నగదు తీసుకురావాలని భార్యపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో వారి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఈ నేపథ్యంలో శనివారం నాగరాజు పని నిమిత్తం బయటకు వెళ్లగా సురేఖ తన ఇంట్లోనే ఉరేసుకుంది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలు సుకున్న ఆమె తల్లిదండ్రులు గీత, సురేష్ హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకుని ఆమెను కిందకు దించారు. ఆమెను నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సురేఖ మృతి చెందిందని నిర్ధారించారు. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న నాగరాజు హాస్పిటల్ వద్దకు వెళ్లి కన్నీరు మున్నీరయ్యారు. భార్య లేని జీవితం వ్యర్థమంటూ రోదించాడు. ఇక తాను బతకలేనంటూ అక్కడి నుంచి పరుగున వెళ్లి విజయమహాల్ రైల్వే గేటు సమీపంలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. గంటల వ్యవధిలోనే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం అందరి హృదయాలను కలిచి వేసింది. సురేఖ ఆత్మహత్య ఘటనపై సమాచారం అందుకున్న బాలాజీనగర్ ఎస్ఐ విజయ్‌శ్రీనివాస్, నెల్లూరు తహసీల్దార్ హాస్పిటల్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి దీప్తి ఫిర్యాదు మేరకు బాలాజీనగర్ ఎస్ఐ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. నాగరాజు ఆత్మహత్య ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
నెల్లూరు జిల్లా: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి దగ్గర జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు గాయపడిన వారిని హుటాహుటినా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమా? అతివేగమా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ బోల్తాబస్సు క్లీనర్ మృతి పలువురు విద్యార్థులకు గాయాలు.హుటాహుటిన గాయపడిన విద్యార్థులను కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, ప్రమాదానికిగల కారణాలు పూర్తి… pic.twitter.com/x5CKlHCjen— Telugu Scribe (@TeluguScribe) July 2, 2024 -
‘బాబు మోసాన్ని వివరిస్తాం.. జగన్ మంచిని గుర్తు చేస్తాం’
సాక్షి, నెల్లూరు జిల్లా: రేపటి(గురువారం) నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నెల్లూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయనతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్ది, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్ది పాల్గొన్నారు. చంద్రబాబు చిన్నాభిన్నం చేసిన వ్యవస్థను సీఎం జగన్ గాడిలో పెట్టారని, అధికారంలోకి రాగానే నాలుగు లక్షల 93 వేల మందికి ఉద్యోగాలు అందించామని మంత్రి తెలిపారు. వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఆరో స్థానానికి ఏపీ చేరుకుందన్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం నాడు-నేడు ద్వారా 11 వే 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ‘నాలుగేళ్లలో నాలుగు ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్లను నిర్మించామని మంత్రి కాకాణి అన్నారు. ‘‘మేనిఫెస్టోను మాయం చేసి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. ప్రజలకు చేసిన మంచిని వారికి తెలియజేసేందుకు ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.డీబీటీ ద్వారా ప్రజలకు అందిన సాయాన్ని ప్రజలకు వివరిస్తాం. పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొంటుంది. టీడీపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించి.. జగన్ చేసిన మంచిని గుర్తు చేస్తాం. వైఎస్సార్సీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట నడిచిన పార్టీ నేతల ఇంటికి వెళ్లి.. వారిని పరామర్శిస్తాం. మాది రైతు ప్రభుత్వం..రైతులకు అండగా ఉంటాం.. 2024లో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం అందరూ గట్టిగా పని చేయాలని మంత్రి కాకాణి పిలుపునిచ్చారు. చదవండి: సొంత జిల్లాకు సీఎం జగన్.. రెండు రోజుల పర్యటన -
రైలు పట్టాలపై మృత్యు ఘోష
ప్రమాదవశాత్తు పట్టాలు దాటే క్రమంలో కొందరు..ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కలహాలతో మరికొందరు..రైల్లో నుంచి జారిపడి ఇంకొందరు ప్రాణాలు విడుస్తున్నారు. ఇలా నిత్యం ఏదోక రూపంలో రైలు పట్టాలపై మృత్యు ఘోష వినిపిస్తోంది. రైలు ప్రమాదాల్లో గుర్తించిన మృతదేహాలు బంధువులకు చేరుతున్నా..గుర్తింపులేనివి కుటుంబ సభ్యుల కడచూపునకు నోచుకోకపోవడం విషాదకరం. నెల్లూరు(క్రైమ్): నెల్లూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో 444 కిలోమీటర్ల మేర రైలు మార్గం విస్తరించి ఉంది. నిత్యం సుమారు 120 రైళ్ల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. రైల్వే ప్రయాణికులు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం..ప్రమాదాల నివారణ చర్యల్లో రైల్వే అధికారుల ఉదాసీనత వెరసి నిత్యం ఏదోక చోట నిండు ప్రాణాలు రైలు చక్రాల కింద నలుగుతున్నాయి. రైలు ప్రమాదాల్లో ఎలాగోలా గుర్తించిన మృతదేహాలు బంధువులకు చేరుతున్నా...గుర్తింపులేనివి అనాథ శవాలుగా మిగిలిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు మాసాంతం వరకు నెల్లూరు రైల్వే సబ్‌డివిజన్ పరిధిలో రైలు పట్టాలపై జారిపడి, బలవన్మరణం, సహజ రూపాల్లో 229 మంది మృతి చెందారు. దీనిని బట్టి చూస్తే నెలకు సగటున 28 మందికిపైగా రైలు పట్టాలపై మృత్యువాత పడుతున్నారు. నెల్లూరు రైల్వే సబ్‌డివిజన్ పరిధిలోని చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు పరిధిలో చిన్న, పెద్ద రైల్వేస్టేషన్లు కలిపి 55 ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతిరోజూ ఏదోక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రైలు పట్టాలు దాటుతూ, రైల్లో నుంచి జారిపçడి, రైలు కిందపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమేపి పెరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు మాసాంతం వరకు రైల్లో నుంచి ప్రమాదవశాత్తు జారిపడి 107మంది మృతి చెందారు. ప్రేమ విఫలమై, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో 110 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 12 మంది అనారోగ్యం, ఇతర కారణాలతో మృతి చెందారు. మొత్తంగా వివిధ కారణాలతో 229 మంది మృతి చెందారు. అందులో 122 మంది వివరాలు లభ్యం కాగా వారి మృతదేహాలను రైల్వే పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన 107 మంది వివరాలు లభ్యం కాకపోవడంతో అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించారు. గుర్తింపు కష్టతరం.. నెలకు సగటన 28 మంది రైలు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు. వారి మృతదేహాలు ఛిద్రమై గుర్తుపట్టలేని విధంగా మారుతుంటాయి. అనేక సందర్భాల్లో మృతదేహాలు రైలుపట్టాల పక్కనున్న ముళ్ల పొదలు, పిచ్చిమొక్కల మధ్యన పడితే కొన్నిరోజుల వరకు ఎవరూ గుర్తించలేరు. అలాంటి పరిస్థితుల్లో మృతదేహాల గుర్తింపు, తరలింపు మరింత దారుణంగా ఉంటుంది. అయిన వారు సైతం మృతదేహాలను గుర్తుపట్టడం కష్టతరమే. నిబంధనల ప్రకారం గుర్తుతెలియని మృతదేహాలను 72గంటల పాటు మార్చురీలో భద్రపరచాల్సి ఉంటుంది. అప్పటికీ మృతుడి సంబం«దీకులు ఎవ్వరూ రాకపోతే రైల్వే పోలీసులే దగ్గరుండి ఖననం చేయిస్తారు. సంబంధీకుల కడసారి చూపునకు కూడా నోచుకోక ఎంతోమంది అనాథలుగా కాలగర్భంలో కలిసిపోతున్నారు. అధికశాతం ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణంగా నిలుస్తోంది. కదిలే రైలు నుంచి ఎక్కడం, దిగడం, ఫుట్‌బోర్డు ప్రయాణం, అటు, ఇటు గమనించకుండా అజాగ్రత్తగా రైలుపట్టాలు దాటడం, తదితరాలు కారణాలుగా నిలుస్తున్నాయి. కొనఊపిరితో ఉన్న కాపాడలేని పరిస్థితి సాధారణంగా రహదారిపై జరుగుతున్న ప్రమాదాలు అందరికి కనిపిస్తుంటాయి. రోడ్డు ప్రమాదం జరిగితే ఆయ్యో అంటూ ప్రజలు పరుగులు తీసి అవసరమైన సాయం అందిస్తారు. కానీ రైలు పట్టాలపై జరిగే ఘటనలు చాలా వరకు ఎవ్వరికి కనిపించవు. ప్రమాదవశాత్తు కొందరు.జీవితంపై విరక్తి చెంది మరికొందరు ఇలా ఎందరో రైలు చక్రాల కింద నలిగి తనువు చాలిస్తున్నారు. రైలు పట్టాలపై జరిగే ప్రమాదాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. లోకో పైలెట్, కీమెన్లు, ట్రాక్మెన్లు స్టేషన్‌మాస్టర్ దృష్టికి తీసుకొస్తే ఆయన రైల్వే పోలీసులకు సమాచారం అందిస్తారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేస్తారు. లోకోపైలెట్, కీమెన్లు, ట్రాక్మెన్లు గుర్తించకపోతే అంతే సంగతులు. జనసంచారం కలిగిన ప్రాంతాల్లో రైలు ప్రమాదంలో తీవ్రగాయాలైన వారికి సకాలంలో వైద్యసేవలు అందించే అవకాశం ఉంది. జన సంచారం లేని ప్రాంతాల్లో తీవ్రగాయాల పాలైన వారిని కాపాడుకోలేని పరిస్థితి. కొన ఊపిరితో ఉన్నా ఎవరూ చూడక, వైద్య అందక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. -
మారేడు తెచ్చి.. నన్నారి షర్బత్ చేసి..
ప్రకృతినే నమ్ముకున్న గిరిజనులు వాటినే ఆధారం చేసుకుని మంచి ఆహార ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ప్రతి ఏడాది వేసవి సమీపిస్తే అడవిలో మారేడును సేకరించి నన్నారి షర్బత్ తయారీకి పూనుకుంటారు. అనుకున్నదే తడవుగా ఒక సంఘంగా ఏర్పడి విరివిగా షర్బత్‌ను తయారుచేసి విక్రయిస్తున్నారు. వేసవి నేపథ్యంలో రసాయనాలు లేకుండా తయారు చేస్తున్న సన్నారి షర్బత్‌కు డిమాండ్ పెరిగింది. దీంతోపాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేస్తున్న గిరిజనులు ఆర్థిక పరిపుష్టికి అడుగులు వేస్తున్నారు. సాక్షి, నెల్లూరు : జిల్లాలోని రాపూరు మండలంలో నన్నారి షర్బత్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన గిరిజనులు దీనినే ఉపాధిగా మార్చుకున్నారు. స్థానిక వెలుగొండల్లో దొరికే అటవీ ఫలసాయాన్ని సేకరించి నన్నారీని తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసి ఆదాయం గడిస్తున్నారు. ప్రకృతి వనరులతో తయారు చేసే నన్నారి షర్బత్‌లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని ద్వారా శరీర ఉష్ణోగ్రత్త తగ్గుతుంది. సంఘటితంగా ఏర్పడి వెలుగొండలను ఆనుకుని ఉన్న రాపూరు మండలంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. స్థానికంగా ఉన్న అటవీనే నమ్ముకుని జీవించే గిరిజన మహిళలు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. దశాబ్దకాలంలోనే గిరిజనులు సంఘటితంగా ఏర్పడి గ్రామస్థాయి సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆపై శ్రీ లక్ష్మీ నరసింహ యానాది మండల సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. ఆపై వారి జీవన విధానం మెరుగు పరుచుకునేందుకు ప్రధాన మంత్రి వన్‌ధన్ యోజన కార్యక్రమం ఏర్పాటుచేసి తద్వారా మెరుగైన జీవనోపాధులు కల్పించుకోవడం జరిగింది. వెలుగొండల్లో ముడిసరుకు సేకరించి.. వెలుగొండల్లో విరివిగా కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరిస్తారు. 275 మంది గిరిజన సభ్యులు వన్‌ధన్ వికాస కేంద్రం(వీడీవీకే) ఏర్పాటు చేసుకుని అటవీ ఫలసాయం సేకరణ చేస్తున్నారు. వీరికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఐటీడీఏ శాఖల ఆధ్వర్యంలో గిరిజనులకు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి కావలసిన శిక్షణ కార్యక్రమాలు, తయారీ, మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టారు. ఉసిరితో.. అలాగే జనవరి నుంచి మార్చి నెల వరకు వెలుగొండ అడవుల్లో ఉసిరి కాయల సేకరణ జరుగుతుంది. ఈ సీజన్లో దాదాపు 20 టన్నుల ఉసిరి కాయలను సేకరిస్తుంటారు. దాదాపు 150 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. సేకరించిన ఉసిరికాయలను కేజీ రూ.30ల చొప్పున దళారులు గిరిజనుల వద్ద నుంచి కొనుగోలు చేస్తుంటారు. విలువ ఆధారిత ఉత్పత్తిలో భాగంగా ఉసిరి కాయలతో ఉసిరి క్యాండీలు చేయడం వలన, మూడు కేజీల ఉసిరికాయలతో ఒక కేజీ క్యాండీలను తయారీ చేస్తారు. వీటి విలువ మార్కెట్లో రూ.500గా ఉంది. ఈ ఉసిరి క్యాండీల తయారీలో దాదాపు 30 మంది గిరిజనులు శిక్షణ పొందారు. చక్కెర పాకంలో ఉడకబెట్టిన ఉసిరి కాయలను నానబెట్టడం ద్వారా ఈ క్యాండీలను తయారు చేస్తారు. తయారీ ఖర్చు పోగా, మిగిలిన ఆదాయాన్ని సమంగా పంచుకుంటూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. అలాగే నిమ్మకాయ ఊరగాయల తయారీ, స్వచ్ఛమైన తేనె సేకరణ చేసి విక్రయాలు చేస్తున్నారు. ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం గిరిజనులు తయారు చేసిన అటవీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ ఉత్పత్తులను పెంచలకోన నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో మార్కెటింగ్ చేసేలా స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సాయం చేశారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ ద్వారా అటవీ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుత మార్కెట్లో కూడా పెంచలకోన నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఎటువంటి కల్తీ లేని అటవీ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి రావడంతో ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ ఫలసాయంతో మండలంలోని దాదాపు 1,590 పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. విలువపెంచి విక్రయాలు అడవుల్లో సేకరించే కలపేతర అటవీ ఉత్పత్తులకు ముడిసరుకులు విక్రయిస్తే అంతగా ఆదాయం వచ్చేది కాదు. ముడిసరుకులను బయటకు వెళ్లి వస్తువుల విలువలను పెంచి అమ్మడం ద్వారా మంచి ఆదాయం వస్తుంది. ఒక కేజీ కుంకుళ్లు అమ్మితే రూ.20 వస్తుంది. అదే విత్తనాలను వేరు చేసి అమ్మితే కేజీ రూ.140 వస్తుంది. ఉసిరి కేజీ అమ్మితే రూ.30 వస్తుంది అదే ఆమ్ల క్యాండీలుగా చేసి అమ్మితే కేజీ రూ.500 వరకు వస్తుంది. మారేడు కూడా కేజీ రూ.350 వస్తుంది అదే నన్నారి షర్బత్ చేసి అమ్మితే రూ.2500 వస్తుంది. ఇలా లాభదాయకంగా ఉంది. – వెలుగు సుబ్బయ్య, వన్‌ధన్ వికాస కేంద్రం అధ్యక్షుడు అందరం సంపాదిస్తున్నాం వన్‌ధన్ వికాస కేంద్రం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పని దొరుకుతోంది. ఇంట్లోని వారంతా సంపాదిస్తుండడంతో ఆనందంగా జీవిస్తున్నాం. డీఆర్డీఏ, ఐటీడీఏ, జీసీసీ వారు మాకు శిక్షణ ఇచ్చి ఆర్థికంగా ఎదిగేందుకు సాయం చేశారు. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. – గాలి శ్రీనివాసులు, వన్‌ధన్ వికాస కేంద్రం కార్యదర్శి నన్నారి తయారీ ఇలా.. శ్రీ లక్ష్మీనరసింహ యానాది మండల సమాఖ్యలోని సభ్యుల్లో దాదాపుగా 30 మంది నన్నారి షర్బత్ తయారీలో నిష్ణాతులుగా ఉన్నారు. అలాగే 150 మంది నన్నారి షర్బత్‌కు కావల్సిన మారేడు గడ్డలను సేకరించి ప్రాసెసింగ్ చేస్తుంటారు. గాలి వెంకటేశ్వర్లు, గాలి శ్రీనివాసులు, వెలుగు సుబ్బయ్య, యాకసిరి జయరామయ్య, నారాయణ, నల్లు శివ మొదలగు వారు ఈ నన్నారి షర్బత్‌ను తయారు చేస్తుంటారు. జనవరి నుంచి జూన్ నెల వరకు నన్నారి షర్బత్ తయారీ మీద గిరిజనులు దృష్టి పెడుతుంటారు. దీనికి కావల్సిన మారేడు గడ్డలను వెలిగొండ అడవుల్లో జనవరి నుంచి మే నెల వరకు సేకరిస్తారు. ఈ సీజన్లో దాదాపుగా 10 నుంచి 15 టన్నుల వరకు మారేడు గడ్డలను సేకరిస్తారు. సాధారణంగా ఒక కేజీ గడ్డల విలువ రూ.400 ఉండగా ఒక కేజీ నుంచి 30 లీటర్ల నన్నారి షర్బత్‌ను తయారు చేయవచ్చు. మార్కెట్లో ఒక లీటర్ రూ.160 ఉండగా కేజీ మారేడుతో దాదాపుగా రూ.4,800 ఆదాయం వస్తుంది. ఇలా 15 టన్నులకు రూ.72 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అందులో తయారీకి కావల్సిన ఇతర దినుసుల ఖర్చు, తయారీ ఖర్చు, లేబర్ వంటి వాటిని తీసేయగా మిగిలిన ఆదాయాన్ని సమంగా పంచుకుంటూ ఆర్థికంగా పురోగమిస్తున్నారు. -
5 కోట్ల కరెన్సీ నోట్లు.. కిలోల కొద్దీ బంగారు, వెండితో అమ్మవారి అలంకరణ
నెల్లూరు(బృందావనం): కోట్ల రూపాయల కొత్త కరెన్సీ రెపరెపల తోరణాలు.. కిలోల కొద్ది బంగారు, వెండి బిస్కెట్లు.. విద్యుద్దీప కాంతుల నడుమ సింహపురి సీమలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందుతున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నుడా చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆర్యవైశ్య సంఘీయులు, భక్తుల సహకారంతో ఐదోరోజు సోమవారం శ్రీవాసవికన్యకాపరమేశ్వరి అమ్మవారిని, ఆలయాన్ని రూ.ఐదు కోట్ల రూపాయల కొత్త కరెన్సీ నోట్లు, రూ.3.5కోట్ల విలువైన ఏడు కిలోల బంగారు బిస్కెట్లు, రూ.3.5 కోట్ల విలువైన 60 కిలోల వెండిబిస్కెట్లు, ఆభరణాలతో అలంకరించారు. (చదవండి: ఏపీపీఎస్సీలో 190 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు) ఇందుకోసం మహబూబునగర్ జిల్లా బందరుకు చెందిన వేమూరిచంద్రశేఖర్ నేతృత్వంలో 120 మంది నిపుణులు పనిచేసి అమ్మణ్ణి ఆలయానికి మరింత శోభను సంతరింపజేశారని ముక్కాల ద్వారకానాథ్ వివరించారు. ఈ సందర్భంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు బారులుతీరారు. (చదవండి: కర్రల సమరం: ‘గట్టు’ మీద ఒట్టు! ) -
రాష్ట్రంలో పలుచోట్ల ఏసీబీ సోదాలు
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలోని పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఈ కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలిస్తున్నారు. ఇటీవల బిల్లు చెల్లింపులు చేసిన నాడు-నేడు, గ్రామసచివాలయ పనులకు సంబంధించిన ఎం.బుక్ లు, బిల్లు చెల్లింపులను, వాస్తవ పనులతో సరిపోల్చుతున్నారు. మరో వైపు ఆమదాలవలస రోడ్లు, భవనాల శాఖ డీఈ కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. గత రెండేళ్ల కాలంలో జరిగిన పనులు, బిల్లు చెల్లింపులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పలు విభాగాలలో సోదాలు నిర్వహించి రికార్డులను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఆత్మకూరులోని రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసి రికార్డులు పరిశీలిస్తున్నారు. రికార్డుల పరిశీలన అనంతరం వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు విశాఖ పట్నం జిల్లాలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని జాయింట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ అదనపు ఎస్పీ షకీలా భాను, డీఎస్పీ రామచంద్రవరావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. చదవండి: ఏసీబీ వలలో ‘ఔషధ’ ఉద్యోగులు -
శివ స్రవంతి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో నివాసం ఉంటున్న రుద్ర స్రవంతి అనే శివభక్తురాలు కార్తీకమాసం ప్రారంభం రోజు నుంచి నేటి వరకు 11 వేలకు పైగా శివలింగ ప్రతిమలను తయారు చేయడం శివభక్తులకు కనువిందైన ఒక విశేషం అయింది. ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన రుద్ర స్రవంతి.. భర్త వ్యాపారం రీత్యా నాయుడుపేటలో ఉంటున్నారు. ఆమె శివభక్తురాలు. ప్రత్యేకించి శివలింగ ప్రతిమలను తయారుచేయడం కోసమే ఆమె నాయుడుపేట పట్టణంలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు సమీపంలో బాలాజీ ఎనక్లేవ్లో నివాసం ఉంటూ గత ఐదేళ్లుగా ప్రతిమల తయారీతో శివారాధన చేస్తున్నారు. తండ్రి ప్రమాదంలో గాయపడి కోలుకున్న తరువాత ఆయన క్షేమం కోసం మరింత భక్తిభావంతో పరమశివుడిని ఆరాధిస్తున్నారు. అష్టగంధంతో శివలింగ ప్రతిమలు ఈసారి కాశీకి చెందిన ఓ ఆశ్రమ పీఠాధిపతి ఇచ్చిన అష్టగంధంతో గత నెల రోజులుగా శివలింగ ప్రతిమలను తయారు చేస్తున్నట్లు రుద్ర స్రవంతి తెలిపారు. గంధంతోపాటు పసుపు, విబూది, బంకమట్టి, పుట్టమట్టి మేళవింపుతో ప్రతిమలకు ఆమె రూపునిస్తున్నారు. ఎవరి సహాయమూ తీసుకోకుండా ఇంట్లోనే ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు రోజుకు 300 నుంచి 350 శివలింగ ప్రతిమలను తయారు చేస్తున్నారు. కార్తీక మాసమంతా ఉపవాసం ఉంటూ కేవలం ద్రవ పదార్థాలనే ఆహారంగా తీసుకుంటూ రోజుకు 12 గంటలకు పైగా శ్రమించి ప్రతిమల్ని చేస్తున్నారు. దాంతో ఇంట్లో ఎక్కడ చూసినా శివలింగ ప్రతిమలే దర్శనమిస్తున్నాయి. అంతేకాదు, ఇంటి ముఖద్వారం తెరుచుకున్న వెంటనే అనేక రుద్రాక్షలు ధరించి ఉన్న శివుడి ప్రతిమ కనిపిస్తుంది. ఆమె పూజ గదిలోనూ ఎక్కువగా శివుడు, శివలింగాల ప్రతిమలే ఉంటాయి. నేడు ప్రాణ ప్రతిష్ట ఇప్పటి వరకు పూర్తి చేసిన 11,111 శివలింగాల ప్రతిమలకు నేడు (కార్తీకమాసం చివరి సోమవారం) వేదపండితులతో ప్రత్యేక పూజలు చేయిస్తున్నట్లు రుద్ర స్రవంతి తెలిపారు. ఈ శివలింగాలను ఎవరికీ ఇచ్చేది ఉండదని, మొత్తం శివలింగాలను కలిపి మహా శివలింగం తయారు చేసి పూజలు చేసిన అనంతరం మూడు రోజుల తరువాత నవంబరు 28వ తేదీన నెల్లూరు జిల్లా పరిధిలోని మల్లాం గ్రామ సమీపంలో సముద్రతీరంలో నిమజ్జనం చేస్తామని ఆమె చెప్పారు. రుద్ర స్రవంతి తయారు చేస్తున్న ఈ శివలింగాలను రోజూ అనేక మంది భక్తులు ఇంటికి వచ్చి మరీ ఆసక్తిగా తిలకిస్తున్నారు. – ఎస్.కె.రియాజ్బాబు, సాక్షి నాయుడుపేట -
అదే బీజేపీ నినాదం : కిషన్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు : జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు ఓ చారిత్రాత్మక నిర్ణయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇంతవరకూ ఏ ప్రభుత్వం సాహసం చేయలేని పనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసి చూపిస్తున్నారని ప్రశంసించారు. ఆర్టికల్ 370 సందర్భంగా బీజేపీ ఆధ్యర్యంలో నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన విజయోత్సవర ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశ సమగ్రతకు బీజేపీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని తెలిపారు. ఒకే దేశం, ఒకే ఒకే జెండా ఉండాలన్నదే మోదీ ఆకాంక్ష అన్నారు. ఆర్టికల్ 370ని నెహ్రూ ప్రభుత్వం బలవంతంగా దేశ ప్రజలపై రుద్దిందని, దాని వల్ల దేశంలో తీవ్రవాదం పెరిగిందన్నారు. కశ్మీర్ కోసం పాకిస్తాన్‌తో ఇప్పటి వరకు 4 యుద్ధాలు చేశామని గుర్తు చేశారు. ఆర్టికల్370 రద్దు చేస్తే పాకిస్తిన్‌కు ఎందుకు నొప్పి అని ప్రశ్నించారు. ఈ విషయంలో పాకిస్తాన్‌ను ఏకానిని చేసి ప్రపంచ దేశాలన్నింటిని మన వైపుకు తిప్పుకున్నామని చెప్పారు. ఒకే దేశం-ఒకే ఎన్నికలు ఇదే బాజేపీ నినాదం అయని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
ఉలిక్కిపడ్డ నెల్లూరు
జిల్లా కోర్డు ఆవరణలో బాంబు పేలుడుతో భయపడ్డ జనం పోలీసు యంత్రాంగం అప్రమత్తం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం జరిగిన బాంబు పేలుడు ఘటనతో నెల్లూరు ప్రజలు ఉలిక్కిపడ్డారు. కక్షిదారుల మధ్య గొడవల కారణంగానే ఈ సంఘటన జరిగిందా? లేక నగరంలో అలజడి సృష్టించడానికి జరిగిన విద్రోహక చర్యా? అన్న అనుమానాల నేపథ్యంలో పోలీసు యంత్రాగం విభిన్న కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసింది. పేలుడు సమాచారం తెలిసిన వెంటనే ఎస్పీ విశాల్ గున్నీ గుంటూరు నుంచి హుటాహుటిన ఇక్కడికి వచ్చారు. సంఘటన స్థలంలో లభించిన వస్తువులను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. నెల్లూరు(క్రైమ్): జిల్లా కోర్టు ఆవరణ(మూడో అదనపు జూనియర్ జడ్జి కోర్టు ఎదురుగా గల గోడవద్ద)లో సోమవారం మధ్యాహ్నం 3.15 గంటలకు గుర్తుతెలియని దుండగులు బాంబు పేల్చారు. పేలుడు దాటికి గోడకు, సమీపంలోని చెట్టుకు, గోడ అవతలివైపున రంధ్రాలయ్యాయి. దుండగులు అరలీటర్ సామర్థ్యం కల్గిన ప్రెజర్ కుక్కర్‌ను టిఫిన్ బ్యాగ్‌లో అమర్చి 9వోల్ట్స్ బ్యాటరీలను వినియోగించి పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బ్లాస్ట్‌లో అమోనియం నైట్రేట్‌ను వినియోగించినట్లు సమాచారం. బ్లాస్టింగ్ జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ తరహా ఘటనలను ఐఈడీ(ఇంప్రవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)గా పోలీసులు తెలిపారు. భిన్న కోణాల్లో దర్యాప్తు నిత్యం వందలాదిమంది కక్షిదారులు, న్యాయవాదులు కోర్టుకు వస్తున్న నేపథ్యంలో బాంబు ఘటనతో సోమవారం జిల్లా కోర్టు ఆవరణలోని అన్నీ కోర్టుల్లో ఏయే కేసులు విచారణ సాగింది అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కేసుల తీవ్రతను బట్టి కేసుల్లోని బాధితులు? ముద్దాయిలు ఎవరైనా ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉండవచ్చునన్న కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. తీవ్రవాద సంస్థ అల్ ఉమా హస్తం ఉన్నట్టు కూడా అనుమానిస్తున్నారు. అదనపు ఎస్పీలు శరత్‌బాబు, సూరిబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర్లు, మేయర్ అబ్దుల్ అజీజ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటన నేపథ్యంలో పోలీసు యంత్రాగం జిల్లా వ్యాప్తంగా లాడ్జీలు, హోటల్స్, రైల్వే, బస్ స్టేషన్లతో పాటు వాహన తనిఖీలను నిర్వహించింది. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : విశాల్‌గున్నీ, ఎస్పీ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ఇది విద్రోహక చర్య కాదు. ఎవరో కావాలనే ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉండవచ్చు. బక్రీదు సందర్భంగా జిల్లాలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశాం. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు తారసపడినా? అనుమానాస్పదంగా వాహనాలు నిలిపి ఉంచినా వెంటనే 9440796300, 9447096384, 9440796303, డయల్ 100కు సమాచారం అందించాలి. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తాం. కోర్టు ఆవరణలో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తాం.