సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలోని పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఈ కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలిస్తున్నారు. ఇటీవల బిల్లు చెల్లింపులు చేసిన నాడు-నేడు, గ్రామసచివాలయ పనులకు సంబంధించిన ఎం.బుక్ లు, బిల్లు చెల్లింపులను, వాస్తవ పనులతో సరిపోల్చుతున్నారు. మరో వైపు ఆమదాలవలస రోడ్లు, భవనాల శాఖ డీఈ కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. గత రెండేళ్ల కాలంలో జరిగిన పనులు, బిల్లు చెల్లింపులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పలు విభాగాలలో సోదాలు నిర్వహించి రికార్డులను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఆత్మకూరులోని రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసి రికార్డులు పరిశీలిస్తున్నారు. రికార్డుల పరిశీలన అనంతరం వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు విశాఖ పట్నం జిల్లాలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్‌లోని జాయింట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ అదనపు ఎస్పీ షకీలా భాను, డీఎస్పీ రామచంద్రవరావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.
చదవండి: ఏసీబీ వలలో ‘ఔషధ’ ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment