శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో నివాసం ఉంటున్న రుద్ర స్రవంతి అనే శివభక్తురాలు కార్తీకమాసం ప్రారంభం రోజు నుంచి నేటి వరకు 11 వేలకు పైగా శివలింగ ప్రతిమలను తయారు చేయడం శివభక్తులకు కనువిందైన ఒక విశేషం అయింది.
ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన రుద్ర స్రవంతి.. భర్త వ్యాపారం రీత్యా నాయుడుపేటలో ఉంటున్నారు. ఆమె శివభక్తురాలు. ప్రత్యేకించి శివలింగ ప్రతిమలను తయారుచేయడం కోసమే ఆమె నాయుడుపేట పట్టణంలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు సమీపంలో బాలాజీ ఎనక్లేవ్లో నివాసం ఉంటూ గత ఐదేళ్లుగా ప్రతిమల తయారీతో శివారాధన చేస్తున్నారు. తండ్రి ప్రమాదంలో గాయపడి కోలుకున్న తరువాత ఆయన క్షేమం కోసం మరింత భక్తిభావంతో పరమశివుడిని ఆరాధిస్తున్నారు.
అష్టగంధంతో శివలింగ ప్రతిమలు
ఈసారి కాశీకి చెందిన ఓ ఆశ్రమ పీఠాధిపతి ఇచ్చిన అష్టగంధంతో గత నెల రోజులుగా శివలింగ ప్రతిమలను తయారు చేస్తున్నట్లు రుద్ర స్రవంతి తెలిపారు. గంధంతోపాటు పసుపు, విబూది, బంకమట్టి, పుట్టమట్టి మేళవింపుతో ప్రతిమలకు ఆమె రూపునిస్తున్నారు. ఎవరి సహాయమూ తీసుకోకుండా ఇంట్లోనే ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు రోజుకు 300 నుంచి 350 శివలింగ ప్రతిమలను తయారు చేస్తున్నారు. కార్తీక మాసమంతా ఉపవాసం ఉంటూ కేవలం ద్రవ పదార్థాలనే ఆహారంగా తీసుకుంటూ రోజుకు 12 గంటలకు పైగా శ్రమించి ప్రతిమల్ని చేస్తున్నారు. దాంతో ఇంట్లో ఎక్కడ చూసినా శివలింగ ప్రతిమలే దర్శనమిస్తున్నాయి. అంతేకాదు, ఇంటి ముఖద్వారం తెరుచుకున్న వెంటనే అనేక రుద్రాక్షలు ధరించి ఉన్న శివుడి ప్రతిమ కనిపిస్తుంది. ఆమె పూజ గదిలోనూ ఎక్కువగా శివుడు, శివలింగాల ప్రతిమలే ఉంటాయి.
నేడు ప్రాణ ప్రతిష్ట
ఇప్పటి వరకు పూర్తి చేసిన 11,111 శివలింగాల ప్రతిమలకు నేడు (కార్తీకమాసం చివరి సోమవారం) వేదపండితులతో ప్రత్యేక పూజలు చేయిస్తున్నట్లు రుద్ర స్రవంతి తెలిపారు. ఈ శివలింగాలను ఎవరికీ ఇచ్చేది ఉండదని, మొత్తం శివలింగాలను కలిపి మహా శివలింగం తయారు చేసి పూజలు చేసిన అనంతరం మూడు రోజుల తరువాత నవంబరు 28వ తేదీన నెల్లూరు జిల్లా పరిధిలోని మల్లాం గ్రామ సమీపంలో సముద్రతీరంలో నిమజ్జనం చేస్తామని ఆమె చెప్పారు. రుద్ర స్రవంతి తయారు చేస్తున్న ఈ శివలింగాలను రోజూ అనేక మంది భక్తులు ఇంటికి వచ్చి మరీ ఆసక్తిగా తిలకిస్తున్నారు.
– ఎస్.కె.రియాజ్‌బాబు, సాక్షి నాయుడుపేట
Comments
Please login to add a commentAdd a comment