shivalingam
-
హిందువులకు అప్పగించండి: వీహెచ్‌పీ
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదును అంతకుముందున్న ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించినట్లు ఏఎస్ఐ సర్వే మరోసారి రూఢీ చేసినందున ఆ ప్రాంతాన్ని హిందువులకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) కోరింది. శివలింగం లభించిన వజూ ఖానాగా చెబుతున్న చోట హిందువులకు పూజలకు అనుమతులివ్వాలని డిమాండ్ చేసింది. మసీదును హిందూ ఆలయంగా ప్రకటించాలని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. -
అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ.. భక్తులకు ఈసారి కొత్త రూల్..!
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రలో పాల్గొనే భక్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్‌లో జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ట్రాక్, గాందర్బల్ జిల్లాలోని బాల్టాల్ ట్రాక్‌లకు ఇవాళే రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఆఫ్ లైన్, ఆన్లైన్ ద్వారా భక్తులు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 542 బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులు ఈ సేవలు అందిస్తున్నాయి. అయితే అధికారులు ఈ ఏడాది రిజిస్ట్రేషన్‌లో కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. యాత్రలో పాల్గొనబోయే భక్తులు కచ్చితంగా ఆధార్‌తో రిజిస్ట్రేషన్ చేయించి వేలిముద్ర స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ యాత్రకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలు.. ► 13-70 ఏళ్ల భక్తులే ఈ యాత్రలో పాల్గొనేందుకు అర్హులు ► అందరూ కచ్చితంగా ఆరోగ్య ధ్రువపత్రాన్ని పొందుపర్చాలి ► ఆరు వారాలకు పైబడిన గర్భిణీలు యాత్రలో పాల్గొనడానికి అనుమతి లేదు అమర్నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి తరలివెళ్తుంటారు. ఈనేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రార్థనలను ఈసారి లైవ్ టెలికాస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: సీఎం మమత మేనల్లుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. సీబీఐ, ఈడీ విచారణపై స్టే.. -
బ్యాంకు లాకర్లో రూ.500 కోట్లు విలువ చేసే మరకత లింగం
సాక్షి, చెన్నై: తంజావూరులోని ఓ వ్యక్తి బ్యాంకు లాకర్లో రూ.500 కోట్లు విలువ చేసే పచ్చవర్ణ మరకత(ఎమరాల్డ్) లింగం బయట పడింది. తిరుక్కువలై ఆలయంలో అపహరణకు గురైన ఆ విగ్రహం లాకర్లోకి ఎలా వచ్చిందనే విషయాన్ని తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తంజావూరు అరులానందనగర్‌లోని ఓ ఇంట్లో పురాతన విగ్రహం ఉన్నట్టు చెన్నైలోని విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగానికి సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందం శుక్రవారం ఆ ఇంట్లోని అరుణా భాస్కర్‌ను ప్రశ్నించారు. తమ ఇంట్లో ఏమీ లేవని, తన తండ్రి స్వామియప్పన్ మరణించారని, అంతకుముందు ఆయన వద్ద ఉన్న మరకత లింగం బ్యాంక్ లాకర్లో ఉండొచ్చని చెప్పారు. దీంతో బృందం లాకర్‌ను తెరిచి చూశారు. అందులో పచ్చవర్ణ మరకత లింగం బయట పడింది. దీని విలువ రూ.500 కోట్లు ఉంటుందని అంచనా. ఆ విగ్రహం మైలాడుతురై జిల్లా శీర్గాలి సమీపంలోని తిరుక్కువలై శివాలయంలో మూడేళ్ల క్రితం చోరీకి గురైనట్టు తేలింది. దీంతో అధికారులు శనివారం ఆ విగ్రహాన్ని చెన్నైలోని కార్యాలయంలో భద్రపరిచారు. -
అపురూప దృశ్యం.. ఆవిష్కృతం
నగరి (చిత్తూరు జిల్లా): నగరి మున్సిపల్ పరిధి కీళపట్టు పురాతన శ్రీచంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలోని అరుణోదయ వేళ శివలింగాన్ని సూర్యకిరణాలు తాకిన అపురూప దృశ్యం మంగళవారం సాక్షాత్కరించింది. ఉదయం 6.30 నుంచి 6.45 గంటల వరకు భానుడు తన కిరణాలతో స్వామివారిని స్పృశించాయి. ఎన్నడూ లేని విధంగా ఆలయంలోకి సూర్యకిరణాలు శివలింగం వరకు ప్రసరించడం ప్రత్యకతను సంతరించుకుంది. ఈ విషయం తెలియడంతో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చేసి ఈ దృశ్యాన్ని తిలకించి పరవశించారు. కిరణాలు ఒక మార్గంలా వెళ్లి శివలింగంపై పడుతుండడంతో ఇది మహత్యమే అంటూ దర్శించేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. ఆలయ నిర్వాహకుడు సుబ్రమణ్యంస్వామి మాట్లాడుతూ శతాబ్దాల కిందటే సూర్యకిరణాలు స్పృశించేలా తూర్పు ముఖంతో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోందని, పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దృశ్యాన్ని గమనించేవారు లేకపోయారన్నారు. కొన్నేళ్లుగా భక్తుల చొరవతో ఆలయం మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటోందని, నిత్యపూజా కైంకర్యాలు బాగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. సూర్యోదయ సమయాన్నే కిరణాలు శివలింగాన్ని స్పృశించడాన్ని వీక్షించి తరించామని వివరించారు. వారం రోజుల పాటు శివలింగాన్ని సూర్యకిరణాలు స్పృశించవచ్చని భావిస్తున్నామని తెలిపారు. శివలింగాన్ని స్పృశిస్తున్న సూర్యకిరణాలు.. చదవండి: ‘మనకు మొహమాటం ఉన్నా.. కరోనాకు లేదు’ రెచ్చిపోతున్న ఆన్లైన్ మోసగాళ్లు.. -
శివ స్రవంతి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో నివాసం ఉంటున్న రుద్ర స్రవంతి అనే శివభక్తురాలు కార్తీకమాసం ప్రారంభం రోజు నుంచి నేటి వరకు 11 వేలకు పైగా శివలింగ ప్రతిమలను తయారు చేయడం శివభక్తులకు కనువిందైన ఒక విశేషం అయింది. ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన రుద్ర స్రవంతి.. భర్త వ్యాపారం రీత్యా నాయుడుపేటలో ఉంటున్నారు. ఆమె శివభక్తురాలు. ప్రత్యేకించి శివలింగ ప్రతిమలను తయారుచేయడం కోసమే ఆమె నాయుడుపేట పట్టణంలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు సమీపంలో బాలాజీ ఎనక్లేవ్లో నివాసం ఉంటూ గత ఐదేళ్లుగా ప్రతిమల తయారీతో శివారాధన చేస్తున్నారు. తండ్రి ప్రమాదంలో గాయపడి కోలుకున్న తరువాత ఆయన క్షేమం కోసం మరింత భక్తిభావంతో పరమశివుడిని ఆరాధిస్తున్నారు. అష్టగంధంతో శివలింగ ప్రతిమలు ఈసారి కాశీకి చెందిన ఓ ఆశ్రమ పీఠాధిపతి ఇచ్చిన అష్టగంధంతో గత నెల రోజులుగా శివలింగ ప్రతిమలను తయారు చేస్తున్నట్లు రుద్ర స్రవంతి తెలిపారు. గంధంతోపాటు పసుపు, విబూది, బంకమట్టి, పుట్టమట్టి మేళవింపుతో ప్రతిమలకు ఆమె రూపునిస్తున్నారు. ఎవరి సహాయమూ తీసుకోకుండా ఇంట్లోనే ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు రోజుకు 300 నుంచి 350 శివలింగ ప్రతిమలను తయారు చేస్తున్నారు. కార్తీక మాసమంతా ఉపవాసం ఉంటూ కేవలం ద్రవ పదార్థాలనే ఆహారంగా తీసుకుంటూ రోజుకు 12 గంటలకు పైగా శ్రమించి ప్రతిమల్ని చేస్తున్నారు. దాంతో ఇంట్లో ఎక్కడ చూసినా శివలింగ ప్రతిమలే దర్శనమిస్తున్నాయి. అంతేకాదు, ఇంటి ముఖద్వారం తెరుచుకున్న వెంటనే అనేక రుద్రాక్షలు ధరించి ఉన్న శివుడి ప్రతిమ కనిపిస్తుంది. ఆమె పూజ గదిలోనూ ఎక్కువగా శివుడు, శివలింగాల ప్రతిమలే ఉంటాయి. నేడు ప్రాణ ప్రతిష్ట ఇప్పటి వరకు పూర్తి చేసిన 11,111 శివలింగాల ప్రతిమలకు నేడు (కార్తీకమాసం చివరి సోమవారం) వేదపండితులతో ప్రత్యేక పూజలు చేయిస్తున్నట్లు రుద్ర స్రవంతి తెలిపారు. ఈ శివలింగాలను ఎవరికీ ఇచ్చేది ఉండదని, మొత్తం శివలింగాలను కలిపి మహా శివలింగం తయారు చేసి పూజలు చేసిన అనంతరం మూడు రోజుల తరువాత నవంబరు 28వ తేదీన నెల్లూరు జిల్లా పరిధిలోని మల్లాం గ్రామ సమీపంలో సముద్రతీరంలో నిమజ్జనం చేస్తామని ఆమె చెప్పారు. రుద్ర స్రవంతి తయారు చేస్తున్న ఈ శివలింగాలను రోజూ అనేక మంది భక్తులు ఇంటికి వచ్చి మరీ ఆసక్తిగా తిలకిస్తున్నారు. – ఎస్.కె.రియాజ్బాబు, సాక్షి నాయుడుపేట -
దేవరాజ సేవ్యమానం... కాలభైరవం
‘కాలుడు’ అంటే యముడు. యముని పేరు వింటేనే లోకమంతా భయపడుతుంది. అలాంటి మృత్యుదేవతను సైతం భయపెట్టగల మహిమాన్వితుడు శ్రీ కాలభైరవుడు. సంసార బాధలతో సతమతమయ్యేవారు, అనారోగ్యాల బారిన పడ్డవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు శ్రీ కాలభైరవస్వామిని వేడుకుంటే సకల బాధలను హరింపజేసి భక్తులను రక్షిస్తాడని నమ్మకం. తిరుమలలో ఏవిధంగా అయితే ముందుగా వరాహస్వామిని సందర్శించుకున్న తర్వాతే వేంకటేశ్వరుని పూజిస్తారో, కాశీనగరంలో కూడా అదేవిధంగా క్షేత్ర పాలకుడైన కాలభైరవుని సేవించకుండా చేసిన కాశీయాత్ర నిష్ఫలమని సాక్షాత్తూ శివుడే కాలభైరవుడికి వరమిచ్చినట్లు పురాణోక్తి. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవాష్టమి. ఈ సందర్భంగా కాలభైరవుడి విగ్రహం లేదా చిత్రపటానికి షోడశోపచార పూజలు చేసి, మినప గారెలను, కల్లును (మిరియాల పొడి వేయని బెల్లం పానకం కల్లుతో సమానమని శాస్త్రోక్తి) నివేదిస్తే కాలభైరవుడు ప్రసన్నుడై, గ్రహదోషాలను రూపుమాపుతాడని, కోరిన వరాలనిస్తాడని ప్రతీతి. కాలభైరవుడి పటం లభించకపోతే శివలింగం ముందు కూర్చుని, కాలభైరవ అష్టకం పఠించవచ్చు. (నేడు కాలాష్టమి) మానవాళికి గీతాధార మనిషికి మార్పు చాలా అవసరం. ఆ మార్పు బాహ్యమైనది కాదు – లోపలి మనిషికి సంబంధించినది. ముఖ్యంగా తన ప్రవర్తనలోని ఎన్నో లోపాలను చక్కదిద్దుకోవడం, ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం, సమాజానికి పనికొచ్చే విధంగా తనను తాను కొత్తగా రూపొందించుకోవడం అత్యంతావశ్యకం. ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవడం, ఆలోచనలో అభివృద్ధికరమైనవాటికి ఎక్కువగా చోటుకల్పించడం, సానుకూల దృక్పథాన్ని సాధించడం, ఆత్మన్యూనతాభావాన్ని జయించడం వంటి ఎన్నో అంశాలలో పట్టు సాధించాలి. ఈ అంశాలన్నీ గీతలో కృష్ణుడు ఏనాడో అర్జునుడికి చెప్పాడు. గీతోపదేశం సందర్భంలో కృష్ణుడు అర్జునుణ్ని యుద్ధానికి సంసిద్ధుణ్ని చేశాడు. ‘‘నువ్వు గొప్ప పరాక్రమవంతుడవని లోకం కీర్తిస్తున్నది. లోకం దృష్టిలో నువ్వు చులకన కాకుండా ఉండాలంటే యుద్ధానికి సిద్ధపడాలి. నా మిత్రులు, నా బంధువులు, నా గురువులు అంటూ యుద్ధం మానేశావనుకోరు – భయం వల్ల పారిపోయావంటారు. ఈ లోకం నిన్ను చులకన చేస్తుంది. శత్రుసైన్యంలోని యోధులంతా నీలోని పరాక్రమాన్ని శంకిస్తారు. నిందిస్తారు. నీకు యుద్ధమే కర్తవ్యం’’ అంటూ అవసరమైనంత మేరకు అర్జునుణ్ణి రెచ్చగొట్టాడు శ్రీకృష్ణుడు. స్వధర్మం పేరుతో అర్జునుడి చేత కర్తవ్యాన్ని నిర్వహింపజేసిన మానసిక నిపుణుడు శ్రీకృష్ణుడు. కౌరవులను నిర్వీర్యులను చేయడంలోను శ్రీకృష్ణుడు అంతే చాతుర్యం చూపాడు. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడం. ముందుచూపుతో వ్యవహరించడం – వ్యూహాత్మకంగా ముందుకువెళ్లడం, ఎత్తులు వేయడం – వంటి అంశాలలో శిక్షణ ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. కోణాన్ని దృష్టిలో పెట్టుకుని గీతా జయంతి సందర్భంగా శ్రీకృష్ణుడి వ్యక్తిత్వం ఏ స్థాయిదో, వ్యూహరచన ఎంతటిదో, ఆయన నుండి పాండవులకు అందిన స్ఫూర్తిని గ్రహించాలి. వాటి నుండి మనమూ ప్రభావితం కావాలి. మార్గశిర శుద్ధ ఏకాదశికి మోక్షదైకాదశి అని, గీతాజయంతి అనీ పేరు. ఈ వేళ గీతలో కనీసం కొన్ని శ్లోకాలనైనా పఠించి, వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఫలదాయకం. (30, గురువారం గీతాజయంతి) -
శివలింగాన్ని తాకిన సూర్య కిరణాలు
జి.సిగడాం : కార్తీక శోభనాడు సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరించడంతో భక్తులు పరవశించిపోయారు. ఈ అరుదైన దృశ్యం శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకయ్యపేట పంచాయతీలో ఉమారుద్ర కోటీశ్వర దేవాలయంలో దర్శనమిచ్చింది. ఆదివారం ఉదయం 6.15 గంటల నుంచి 6.45 గంటల వరకు సూర్యకిరణాలు శివలింగాన్ని స్పర్శించాయి. ఇలాంటి దృశ్యమే శ్రీకాకుళం పట్టణంలోని అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చే సంగతి తెలిసిందే. ఉమారుద్ర కోటీశ్వర దేవాలయంలో సూర్యకిరణాలు ముందుగా సూర్యదేవుడు ఆలయం మీదుగా నందీశ్వర కొమ్ముల మధ్యలో అమ్మవారి, విఘ్నేశ్వర విగ్రహాన్ని తాకి అనంతరం శివలింగానికి పూర్తిస్థాయిలో స్పర్శించడం.. అద్భుతమైన దృశ్యమని భక్తులు చెప్తున్నారు. సూర్యనారాయణమూర్తి తన కిరణ స్పర్శను ఆదిదేవుడిపై ప్రసరింపచేయడం చాలా అద్భుతంగా ఉందని వేదపండితులు తెలిపారు. ఏటా కార్తీకమాసం రెండో సోమవారం, అలాగే కార్తీ మాసం ఆఖరి నాలుగు రోజల వ్యవధిలో ఈ ఆలయంలోని శివలింగాన్ని సూర్య కిరణాలు స్పర్శిస్తాయి. ఆలయం నిర్మించి పదేళ్లు అవుతున్నదని, ఏటా కార్తీక మాసంలో ఇలా సూర్యకిరణాలు పడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. -
పంచమఠాల్లో రుద్రాభిషేకాలు
శ్రీశైలం: పంచమఠాల్లోని శివలింగ స్వరూపాలకు లోక కల్యాణార్థం బుధవారం శాస్త్రోక్తంగా రుద్రాభిషేకాలను నిర్వహించారు. జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ శివాచార్య స్వామీజీ సూచనల మేరకు వీరశైవ గురుకుల పాఠశాల వ్యవస్థాపకులు దానయ్యస్వామి చిత్రపటానికి ప్రత్యేకç ³Nజలు చేసి ఊరేగింపుగా పంచమఠాలకు చేరుకున్నారు. అక్కడి శివలింగాలకు నమకచమకాలతో శాస్త్రోక్తంగా ఆగమ పాఠశాల విద్యార్థులు అభిషేకాలను నిర్వహించారు. శ్రావణమాస అనుస్థానంలో భాగంగా ప్రతి ఏడాది చివరి బుధవారాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా జగద్గురు స్వామీజీ ఆదేశించినట్లు గురుకులపాఠశాల నిర్వాహకులు మల్లికార్జునస్వామి తెలిపారు.